నీట్ ప్రశాంతం
ABN , Publish Date - May 05 , 2025 | 12:12 AM
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్–యూజీ పరీక్ష పటిష్ఠ బందోబస్త్ నడుమ ఆదివారం ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.
ఏలూరు జిల్లాలో 1,162 మంది, తాడేపల్లిగూడెంలో 1,847 మంది హాజరు
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో నిఘా
ఏలూరు అర్బన్/తాడేపల్లిగూడెం రూరల్, మే 4 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్–యూజీ పరీక్ష పటిష్ఠ బందోబస్త్ నడుమ ఆదివారం ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఏలూరు జిల్లా ఏలూరులో మూడు కేంద్రాలు, గోపన్నపాలెంలో మరో రెండు కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు మొత్తం 1,200 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా, వీరిలో 1,162మంది హాజరయ్యారు. ఏలూరు సుబ్బమ్మదేవి మున్సిపల్ హైస్కూలు కేంద్రానికి 240 మందికి 234మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 240మందికి 232, కస్తూరిబా బాలికోన్నత పాఠశాలకు 360మందికి 347, గోపన్నపాలెం కేంద్రీయ విద్యాలయకు 240మందికి 235, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 120మందికి 114మంది హాజరయ్యారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు నమోదుకాలేదని నీట్–యూజీ సిటీ కో–ఆర్డినేటర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బి.ఎస్.మీనా తెలిపారు. పరీక్ష ముగిసిన అనంతరం జవాబు పత్రాలను గోపన్నపాలెంలోని కేంద్రీయ విద్యాలయకు చేర్చి, ప్యాక్ చేసి సీల్ వేసిన అనంతరం సాయుధ పోలీసు బందోబస్తు నడుమ స్పీడ్‌పోస్టులో తరలించారు. పరీక్ష కేంద్రాలను డీఆర్వో, ఏలూరు డీఎస్సీ, డీఈవో, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్, తదితరులు సందర్శించారు. నీట్–యూజీకి జిల్లా నోడల్ అఽధికారిగా కలెక్టర్ వెట్రిసెల్వి వ్యవహరించారు. జిల్లాలోని ఐదు కేంద్రాల వద్ద జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ పర్యవేక్షణలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్, శశి ఇంజనీరింగ్ కళాశాలల వద్ద ఏర్పాటు చేసిన నాలుగు సెంటర్లలో 1,886 మంది విద్యార్థులకు గాను 1,847 మంది పరీక్షలు రాశారు. మూడంచెల తనిఖీలతో విద్యార్థులను తనిఖీ చేస్తూ పరీక్ష కేంద్రాలకు ఉదయం 11 గంటల నుంచే అనుమతించారు. పరీక్షల సరళిని కలెక్టర్ చదలవాడ నాగరాణి పరీశీలించారు.
ఈదురుగాలులతో కూడిన వర్షం ఆదివారం ఉదయం కురవడంతో పరీక్షకు ఆటంకం ఏర్పడుతుందేమోనన్న భయాందోళన వ్యక్తమైంది. పది గంటల నుంచే వర్షం తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు ప్రశాంతంగా రాశారు. పరీక్ష ప్రారంభ సమయానికి అరగంట ముందే గేటు క్లోజ్ చేస్తామని ప్రభుత్వం విస్తృత ప్రచారంచేయడంతో ఆమేరకు అభ్యర్థులు ఉదయం పదకొండు గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు చేతి రింగ్‌లు, వాచీలు, ఫోన్‌లతోపాటు చెవి రింగులు లేకుండానే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ హాజరుతీసుకున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రాంగణాల్లో నిశిత నిఘా సాయంత్రం ఐదు గంటలవరకు కొనసాగింది. పరీక్ష కేంద్రాల పరిధిలో సెల్‌ఫోన్లు పనిచేయకుండా జామర్లను ఏర్పాటు చేశారు.