అభివృద్ధిలో పోటీ పడిన ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:43 AM
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఒక్కో అడుగు ముందుకేశారు.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
కొత్తదనం, మార్పు చూపించే ప్రయత్నం
ఉండిలో రఘురామ సరికొత్త ప్రయోగం
పాలకొల్లులో మంత్రి నిమ్మల రూటే సపరేటు
వివాదాలు పక్కనపెట్టి సంక్షేమం వైపు
ప్రజలు కోరుకున్న ‘మార్పు’ చూపించారు
తొలి ఏడాది పాలనలో దూసుకెళ్లారు..
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఒక్కో అడుగు ముందుకేశారు. వైసీపీ హయాంలో ఐదేళ్లు జిల్లాలో కక్ష సాధింపులు, అక్రమ కేసులతో పాలన సాగిందని, అభివృద్ధి శూన్యమని ప్రజలు భావించారు. అప్పట్లో ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను వెల్లడించేందుకు కూడా భయపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో పాలనలో మంచి, చెడులను బాహాటంగా మాట్లాడుకునే పరిస్థితి జిల్లాలో ఏర్పడింది. సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు వద్దకు వెళుతున్నారు. పట్టణాల్లో వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు అమృత్ ప్రాజెక్ట్‌లు పడకేశాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమృత్ పథకంలో ప్రాజెక్ట్‌లకు అడుగులు పడ్డాయి.
(భీమవరం/ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
మార్పు కోరుతూ ప్రజలు కూటమికి ఎలాంటి విజయా న్ని అందించారో అదే కోణంలో ప్రతీ నియోజకవర్గంలో సరికొత్త మార్పు.. మార్కు చూపించడానికి ఎమ్మెల్యేలు చెమటోడుస్తున్నారు. ఏడాది పాలనలో నువ్వా నేనా అనే విధంగా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిలో పోటీ వాతావ రణం నెలకొంది.
పాలకొల్లు నియోజకవర్గంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తనదైన శైలిలో అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో రోడ్లతోపాటు మిగిలిన పెండింగ్ పనులను పూర్తి చేయడానికి సానుకూలత వ్యక్తమైంది. యలమంచిలి మండలంలో వానా కాలం వరద భయం. గోదావరి గట్లు పటిష్టతకు గడిచిన ఐదేళ్లలో నయాపైసా కూడా జగన్ సర్కార్ ఖర్చు పెట్టలేదు. కాని ఈ ఏడాది కాలంలోనే మంత్రి చొరవతో గోదావరి ఏటిగట్ల పటిష్టతకు నిధులు విడుదలై చకచకా పనులు సాగడానికి మార్గం ఏర్పడింది. పాలకొల్లు పట్టణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు కార్యచరణ రూపొందించుకున్నారు. డిప్యూటీ
స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏడాది కాలంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండిలో మార్పు చూపిం చారు. మిగతా ఎమ్మెల్యేలు అందుకోలేనంతగా చకచకా నిర్ణ యాలు తీసుకున్నారు. కాల్వ గట్లపై ఆక్రమణలు తొలగించ డమే కాకుండా అన్ని కాలువలు, మురుగు కాలువల ప్రక్షాళ నకు నడుం బిగించారు. పోలీస్‌స్టేషన్ల భవనాల నిర్మాణం, వాహనాలు సమకూర్చడమే కాకుండా నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. రాజకీయాల్లో ఎంతవేగంగా వ్యవహరిస్తారో అభివృద్ధి, సంక్షేమంలో రఘు రామ అంతకంటే వేగంతో వ్యవహరించారన్న భావన ప్రజల్లో ఉంది. నరసాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పెను మార్పులకు ప్రయత్నించారు. రూ.7 కోట్లతో కొత్త రోడ్లు వేశారు. తాగునీటి పంపిణీ సక్రమంగా సాగేలా ఫిల్టర్ బెడ్‌లకు నాంది పలికారు. ఆక్వా యూనివర్సిటీ, హార్బర్, వశిష్ట వారధి ఎమ్మెల్యే ఆశించినట్టు గా ముందుకు సాగలేదు. తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన మార్కు చూపించారు. పట్టణంలో మూలనపడిన పార్కుకు జీవం పోశారు. సీఎం చంద్రబాబును ఒప్పించి రూ.50 కోట్లు నిధులు రాబట్టారు. రోడ్లను అద్దంలా తీర్చిదిద్దేందుకు రూ.20 కోట్లు రాబట్టడమే కాకుండా ఆ మేరకు పనులు చేయించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గంలో అభివృద్ధికి కోట్ల రూపాయలు వచ్చేలా చూశారు. ఒక్క రైల్వే పనులకే రూ.300 కోట్లు, మినీ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేయడం అందరి మన్ననలకు దారి తీసింది. క్రికెట్ స్టేడియం నిర్మించాలనే ప్రతిపాదనవైపు ఆయన అడుగులు వేస్తున్నారు. ఆచంట నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ముందుగా తెలుసుకోవడం, దానికి తగ్గట్టుగానే తదుపరి నిర్ణయాలు తీసుకోవడంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ విజయవంత మయ్యారు.
పట్టణాలు.. పల్లెలకు ప్రాధాన్యం
జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో దాదాపు రూ.250 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. తాడేపల్లిగూడెంలో రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు శరవేగంగా సాగు తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తి చేసేందుకు మరో రూ.80 కోట్లు నిధులు మంజూరయ్యాయి. తాడేపల్లి గూడెంలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదిం చి సాధ్యాసాధ్యాలు, అవసరాలను పరిశీలిస్తోంది. మరోవైపు ఆకివీడు నుంచి దిగమర్రు వరకు 165 జాతీయ రహదారిని నాలుగు లైన్‌లుగా ప్రతిపాదించారు. కేంద్ర మంత్రి మండలి ఆమోదం తర్వాత టెండర్లు పిలిచి జాతీయ రహదారి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనున్నారు. లోసరి నుంచి భీమవరం మీదుగా తాడేపల్లిగూడెం రహదారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఏడాది పాలనలో మునిసిపాలిటీలు, పంచాయతీ లకు ఆర్థిక స్వేచ్ఛ లభించింది. మునిసిపాలిటీలు తమ నిధులను నేరుగా వెచ్చించుకునే వెసులుబాటు కల్పించారు. పంచాయతీల్లో దాదాపు రూ.60 కోట్లతో ఉపాధి పనులు చేపట్టారు. రహదారులు అభివృద్ధి చేశారు.
తాగునీరు, కాల్వలపై దృష్టి
గోదావరి జలాలను శుద్ధిచేసి నేరుగా పల్లెలకు అందించే వాటర్ గ్రిడ్‌కు దాదాపు రూ.1400 కోట్లతో కూటమి ప్రభుత్వంలో ముందడుగు పడింది. విజ్జేశ్వరం వద్ద ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన పనులు చేపడుతున్నారు. పశ్చిమ డెల్టా సాగు పంట కాలువలు, డ్రెయిన్‌ల మరమ్మతులు, పూడిక తొలగింపు పనులు రూ.40 కోట్లతో చేపడుతున్నారు. జిల్లాలో కొత్త రైల్వే ప్రాజెక్ట్‌లు మంజూరయ్యాయి. నరసాపురం నుంచి మచిలీ పట్నం వరకు కొత్త రైల్వే మార్గానికి డీపీఆర్ సిద్ధం చేయాలని రైల్వే శాఖ ఆదేశించింది. నరసాపురం–కోటిపల్లి రైల్వే మార్గానికి అడుగులు పడ్డాయి. తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ, విశాఖపట్నం వైపు ప్రధాన రైలు మార్గంలో గ్రామాల వద్ద ఆర్‌వోబీలను కేంద్రం మంజూరు చేసింది. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం రైల్వే స్టేషన్లను అధునాతనంగా తీర్చిదిద్దుతుతున్నారు.
దాతల సహకారంతో అభివృద్ధి
నియోకవర్గాల్లో ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడ కుండా దాతల సహకారంతో ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఉండి నియోకవర్గం అన్నిటికంటే ముందుంది. డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు విరాళాలు సేకరించి అభివృద్ధి చేయడంలో శ్రమిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఇండోర్ స్టేడియం, కాలువ పనులు, స్విమ్మింగ్ పూల్ పనులకు ఎమ్మెల్యే బొలిశెట్టి దాతలను సమీకరించి అభివృద్ధి చేపడుతున్నారు. భీమవరంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే అంజిబాబు దాతలను సమీకరించారు.
కేంద్ర మంత్రి వర్మ మెరుగైన పాత్ర
నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సమస్యలే కాకుండా కేంద్ర సహాయ మంత్రి హోదాలో భూపతిరాజు శ్రీనివాసవర్మ మెరుగైన పాత్ర పోషించారు. తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టినా తడబాటు లేకుండా ముం దుకు సాగారు. ఉక్కు శాఖామంత్రి కుమారస్వామితో కలిసి విశాఖ ఉక్కుకర్మాగారం వివాద పరిష్కారంలో కీల కంగా వ్యవహరించడమే కాకుండా రాష్ట్రస్థాయిలో తగి నంత అనుకూలత సాధించగలిగారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సాన్నిహిత్యం కొనసాగిస్తూనే పలుమార్లు రైతుల సమస్య లను నేరుగా ప్రస్తావించగలిగారు. రాష్ట్రాభివృద్ధిలో కేంద్ర మంత్రిగా తనదైన శైలిలో వ్యవహరించారు. నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ఆక్వా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిలుపుదలలో కేంద్ర మంత్రి చురుగ్గా వ్యవహరించారు. ప్రత్తిపాడు – నవాబ్ పాలెం – ఆరుళ్ల మార్గంలో రైల్వే వంతెన నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించేలా చేశారు. ఆకివీడు–దిగమర్రు నాలుగులైన్ల రహదారి అభివృద్ధికి కీలక భూమిక పోషించారు. లోసరి–పిప్పర జాతీయ రహదారి అనుసంధానానికి వంద కోట్లు మంజూరు చేయించారు. కిడ్నీ బాధితులను ఆదుకునేలా తన పార్లమెంట్ స్థానం పరిధిలో 7 డయా లసిస్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నారు.