Share News

ఏజెన్సీ ప్రాంతంలో ఆయుధ డిపో

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:07 AM

మూరుమూల ఏజెన్సీ ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి.

ఏజెన్సీ ప్రాంతంలో ఆయుధ డిపో
వంకా వారిగూడెం– దాట్లవారిగూడెం గ్రామాల మధ్య ఆయుధ డిపో ఏర్పాటు చేసే ప్రదేశం

గిరిజన ప్రాంత అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి

జీలుగుమిల్లి మండలం వంకా వారిగూడెం పరిసరాల్లో 1166 ఎకరాల సేకరణ

రూ.2వేల కోట్లతో నేవీ ఆయుధాల డిపో

10 వేల మందికి ఉపాధి అవకాశాలు

గిరిజన యువతకు ప్రయోజనం

భూ సేకరణపై డ్రోన్‌ సర్వే

గ్రామసభల్లో గిరిజనులతో చర్చ

జీలుగుమిల్లి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మూరుమూల ఏజెన్సీ ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఆయుధ డిపో ఏర్పాటుతో పోలవరం నియోజకవర్గం పలు రంగాల్లో అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని ఈ ప్రాంతవాసులు భావిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలోనే నేవీ ఆయుధ డిపో వంకవారిగూడెం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రతిపాదించింది. వంకవారిగూడెం, పంచాయితీ పరిధి లో గ్రామాల్లో సుమారు 1166.55 ఎకరాల సేకరణకు జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్ప టికే పలుసార్లు వంకవారిగూడెం, దాట్లవారిగూడెం, మడకంవారిగూడెం గ్రామాల్లో కుటుంబాల సంఖ్య, భూముల స్థితిగతులుపై రెవెన్యు అధికారులు సర్వేతో పాటు డ్రోన్‌ సర్వే సైతం పూర్తి చేశారు. సంబంధిత భూసేకరణ వివరాలపై నేవీ డిపో సంబంధిత విశాఖపట్నం అధికారులతో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ చర్చించారు. ఆయా అంశాలపై స్ధానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నేవీ డిపో ఏర్పాటుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇప్పటికే పలుసార్లు స్ధానిక గిరిజనులతో గ్రామసభల్లో చర్చించారు.

అభివృద్ధికి బాట

ఆయుధ డిపో ఏర్పాటుతో గిరిజన ప్రాంత అభివృద్ధికి బాట పడుతుందని, కేంద్రం రాష్ట్ర ప్రభు త్వాలు వేగంగా ముందుకు సాగేందుకు ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఈ ప్రాంత యువతకు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు ఆశాభావంతో ఉన్నారు. ఆయుధ డిపో ఏర్పాటు చర్యలతో అందరి దృష్టి జీలుగుమిల్లి మండల అభివృద్ధిపై పడింది. ఈ ప్రాంతంలో సాంకేతిక ప్రగతి తో ఉపాధి అవకాశాలు మెండుగా రానున్నాయ ని, సుమారు పదివేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చే వీలుందని ఎంపీ మహేశ్‌కుమార్‌ ప్రజలకు తెలియ జేశారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటుచేస్తే సరిహద్దు తెలంగాణ ప్రాంతం అశ్వారావుపేట, సత్తుపల్లి వరకు మరోపక్క మెట్టప్రాంతమైన జంగారెడ్డిగూడెం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

రవాణా సౌకర్యాలు మెరుగు

కేంద్రం ద్వారా సత్తుపల్లి–కొవ్వూరు రైల్వేలైన్‌, గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే రూటుకు సమీపంగా ఏర్పాటు చేస్తారని, టి.నరసాపురం మండల సమీపంలో రైల్వే లైన్‌ రానుందనే విషయం చర్చకు వస్తోంది. దీంతో టి.నరసాపురం మండలం నుంచి జీలుగుమిల్లి వచ్చే రహదారుల రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయం టున్నారు. ఇప్పటికే జీలుగుమిల్లి నుంచి వయా బుట్టాయగూడెం పట్టిసీమ ఎన్‌హెచ్‌ 365 బీబీ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడం గమనార్హం. దీంతో పాటు పోలవరం ప్రాంతం పర్యాటక అభివృద్ది మిళి తమై ఉందంటున్నారు. ఈ ప్రాంతంలో 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తే అందుకు తగ్గట్టుగా వారికి కావాల్సిన నిత్యావసరాలు, ఆహారం ఇతర అవసరాలు తీర్చేందుకు హోటళ్లు, ఆస్పత్రులు, వ్యాపార లావా దేవీలు సాగించే క్రమంలో మాల్స్‌ ఏర్పాటు కావచ్చని భావిస్తున్నారు. సమీపంలో స్థానికంగా గిరిజనులు జీవనం సాగించేందుకు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల ద్వారా సందేశం ఇస్తున్నాయి. అదే సమయంలో గిరిజన సంఘాల నుంచి ఆయుధ డిపో ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజనుల జీవనం, పర్యావరణ ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు అవగాహన కల్పించేందుకు అధికారులు గ్రామసభలు నిర్వహించారు.

గిరిజనులకు ఇబ్బందులు ఉండవు

ఆయుధ డిపో ఏర్పాటుపై అనేక అపోహలు న్నా యని, గిరిజనులకు ఎటువంటి లోటు రానివ్వబో మని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. గిరిజనుల అభిప్రాయాలకు తగ్గట్టు ప్రయోజనాలు కల్పిస్తా మని హామీ ఇస్తున్నారు. గత ఏడాది జరిగిన గ్రామసభల్లో పలువురు ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు, గిరిజనుల జీవన విధానానికి ఎటువంటి నష్టం జరగకుండా 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ, ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటా మన్నారు. రోడ్డు రవాణా సౌకర్యాలు అనువుగా మారనున్నాయి. 33 ఎకరాల్లో మాత్రమే నేవీ ఆయుధ డిపో నిర్మాణాలు జరుగుతాయని, ఆయా గిరిజన కుటుంబాలకు పూర్తి పరిహారం చెల్లించిన అనంతరమే నేవీ డిపో ఏర్పాటు పనులు జరుగు తాయని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.

Updated Date - Sep 19 , 2025 | 12:07 AM