నరసాపురం లేస్‌కు జాతీయ పురస్కారం
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:07 AM
నరసాపురం లేస్ ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు లభించింది.
వన్ డిస్ర్టిక్ వన్ ప్రొడక్ట్‌కు ఎంపిక
నేడు ఢిల్లీలో అవార్డు అందుకోనున్న కలెక్టర్
నరసాపురం/భీమవరం టౌన్, జూలై13(ఆంధ్రజ్యో తి): నరసాపురం లేస్ ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు లభించింది. ఇప్పటికే దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న లేస్‌కు కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఒన్ డిస్ర్టిక్ ఒన్ ప్రోడక్ట్) అవార్డు ప్రకటించింది. 2024–25 సంవత్సరానికి నరసాపురం అల్లికకు గుర్తింపు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల ఉత్పత్తులు పోటీపడగా 7 జిల్లాల ఉత్పత్తులను ఎంపిక చేయగా నరసాపురం లేస్ అల్లికలు ప్రథమంగా ఎంపికయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదానంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నుంచి జిల్లా కలెక్టర్ నాగరాణి సోమవారం అవార్డును అందుకోనున్నారు. గతంలో నరసాపురం లేస్ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు లభించింది. తాజాగా జాతీయ స్థాయిలో మరో అవార్డు దక్కడం గమనార్హం. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ లేస్ పార్కుపై ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ పార్కును సందర్శించి మహిళలతో సమావేశమవుతున్నారు. కొత్త డిజైన్లు, అల్లికలపై శిక్షణ గురించి ఆరా తీయడంతో పాటు మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు.