Share News

డంపింగ్‌ యార్డ్‌ ఎక్కడ?

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:00 AM

వశిష్ఠా నది తీరాన్న స్మృతివనం వద్ద డపింగ్‌యార్డును మూడు నెలల్లో ఖాళీ చేయాలని చెన్నై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అధికారులను ఆదేశించింది.

డంపింగ్‌ యార్డ్‌ ఎక్కడ?
గోదావరి ఒడ్డున వేస్తున్న చెత్త

వశిష్ఠ తీరంలో చెత్తపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అభ్యంతరం

మూడు నెలల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు

ముంచుకొస్తున్న గడువు

ప్రత్యామ్నాయ స్థల సేకరణలో వెనుకబాటు

నరసాపురం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): వశిష్ఠా నది తీరాన్న స్మృతివనం వద్ద డపింగ్‌యార్డును మూడు నెలల్లో ఖాళీ చేయాలని చెన్నై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అధికారులను ఆదేశించింది. ఇప్పటికి నెలన్నర గడిచినా ప్రత్యామ్నయ స్థలం ఎంపికపై పురపాలక సంఘం అధికారులకు స్పష్టత రాలేదు. ఎక్కడ ఖాళీ స్థలాలను పరిశీలిస్తున్నా స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. తాజాగా 28వ వార్డులో పురపాలక సంఘ స్థలం 2 ఎకరాల్లో చెత్త డంపింగ్‌కు ప్రయత్నించడంతో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడ చెత్త వేస్తే ఊరుకోబోమని కౌన్సిలర్లు షేక్‌ యాకోబ్‌బీబీ, శ్యామాల కౌన్సిల్‌ సమావేశంలో హెచ్చరించారు. దీంతో ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారించాలో తెలియక ఆధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ గడువు సమీపిస్తోంది.

20 ఏళ్లుగా గోదావరి ఒడ్డునే..

పురపాలక సంఘం గత 20 ఏళ్లుగా గోదావరి ఒడ్డున చెత్త డంప్‌ చేస్తోంది. స్థానికుల అభ్యంతరాలతో పాటు పట్టణానికి చెందిన ఓసూరి ఫణికర్‌ చెన్నైలోని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. నదీ జాలాలు కలుషితం అవుతాయని, నివాసాల సమీపంలో చెత్తతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారని ట్రిబ్యునల్‌కు వివరించారు. దీనిపై ట్రిబ్యునల్‌ పొల్యూషన్‌ బోర్డును పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అధికా రులు కంపోస్టుయార్డు సమీపంలో నమూనాలు సేకరించారు. వీటిల్లో ప్రమాదకరమైన కలుషితాలు ఉన్నాయంటూ నివేదిక ఇచ్చారు. దీంతో ట్రిబ్యునల్‌ తక్షణం ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని మరోసారి ఆదేశించింది

అన్ని చోట్ల ప్రతిఘటనలే..

వేములదీవి గ్రామంలో 15 ఏళ్ల క్రితం పురపాలక సంఘం స్థలాన్ని కొనుగోలు చేసింది. అక్కడ చెత్త వేయడానికి స్థానికులు ఆభ్యంతతం తెలిపారు. స్మృతివనం డంప్‌ చేయడంతో అది నిండుకుంది. తరువాత మునిసిపల్‌ కార్యాలయంలో ఖాళీ స్థలం, 28వార్డు స్థలంలో చెత్త డంప్‌ నిర్ణయాలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు.

Updated Date - Sep 29 , 2025 | 12:00 AM