డీటీసీపీవో పర్యవేక్షణలో ‘నాలా’
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:55 AM
రెవెన్యూ శాఖ పరిధిలో నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్‌మెంట్) వసూళ్ల బాధ్యత టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారికి అప్పగించారు.
రెవెన్యూ నుంచి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌కు అధికారం
పాత రికార్డుల ప్రకారం లేఅవుట్‌ల పరిశీలన
తాజాగా మార్గదర్శకాలు విడుదల
ఏలూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖ పరిధిలో నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్‌మెంట్) వసూళ్ల బాధ్యత టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారికి అప్పగించారు. ప్రభుత్వ నిర్ణయంతో స్థానిక సంస్థలు ఆర్థికంగా పరిపుష్టి కానున్నాయి. జిల్లా పరిధిలో ఇడా (ఏలూరు అర్బన్ డెవలప్ మెంట్ అఽథారిటీ) పనిచేస్తుండడంతో రానున్న కాలంలో సాగుభూమిని వ్యవసాయతేర అవసరాలకు వినియోగించే వ్యవహారాలన్నీ గ్రామాల్లో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ (డీటీసీపీవో) పర్యవేక్షించ నున్నారు. గతంలో రెవెన్యూ శాఖ పరిధిలో నాలా కింద లేఅవుట్లు, వ్యవసాయేతర భూముల మార్పిడి వసూళ్లు మందగించాయి. ప్రతీ జిల్లా పరిధిల్లో అర్బన్ డెవలప్‌మెంట్ (యూఎల్‌బీ)లు ఉండడంతో వీటి ద్వారా వేగంగా, ఆఽధునీకరించిన సాంకేతిక వ్యవస్థ ద్వారా వసూళ్లను వేగవంతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలా వసూళ్ల బాధ్యతలను యూఎల్‌బీలకు దఖలుపరుస్తూ పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో జారీ చేశారు.
నాలుగు శాతం బెటర్‌మెంట్ చార్జీలు..
వ్యవసాయేతర భూములను లేఅవుట్, ఇతర అవసరాలకు మార్చినప్పు డు ఇకపై బెటర్‌మెంట్ చార్జీలు మార్కెట్ విలువలో 4 శాతం స్థానిక సంస్థలు వసూలు చేయనున్నాయి. నాలా అమలు సమయంలో క్షేత్రస్థాయిలో పంచాయతీ, రెవెన్యూ, మునిసిపాలిటీల పరిధిలోనే రెవెన్యూ శాఖాఽధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) పరిశీలించి అనుమతిలిచ్చేవారు. ప్రస్తుతం నాలా చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న దరఖాస్తుల ప్రక్రియ విషయమై రెవెన్యూశాఖ ఉన్నతాధి కారులు నిర్ణయం తీసుకున్నారు. గత సెప్టెంబరు 3 నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ డివిజన్ అధికారి పరిధిలోని దరఖాస్తులను టీడీసీపీకీ పంపాలని ఆదేశించారు.
వేగంగా పరిష్కరిస్తాం : సుధాకర్, ఇన్‌చార్జి డీటీసీపీవో
జిల్లాలో నాలా కింద లేఅవుట్లు, వ్యవసాయేతర భూముల మార్పిడిని వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటాం. దీనికోసం కొంత కసరత్తు చేయాల్సి ఉంది. త్వరలో అన్ని లాంఛనాలు పూర్తి చేసి, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే లే అవుట్‌ల ప్రక్రియ ఉంటుంది.