మ్యూజిక్ వైబ్ మిరాయ్
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:11 AM
ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకుడు గౌర హరి ఉండి కుర్రోడు.
సంగీత దర్శకుడు గౌర హరి పశ్చిమ గోదావరి జిల్లా కుర్రోడే
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన వండర్ విజువల్స్ హనుమాన్, మిరాయి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాలు నమోదు చేశాయి. తాజా చిత్రం మిరాయ్ దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో నిర్మితమైన ఈ చిత్రాలకు సంగీతం ప్రధానం. అద్భుత నేపథ్య సంగీతంతో సినిమా అలరిస్తే పాటలు మరింత ఆకట్టుకున్నాయి. సినిమాలో ‘వైబ్ ఉంది’ పాట చిత్రించినా తెరపై మాత్రం తొలగించారు. ఆడియో విడుదలతో విశేషంగా ఆకట్టుకుంది. అభిమానుల కోరిక మేరకు ఈ గీతాన్ని తెరపై చూపబోతున్నారు. ఈ చిత్రాలకు సంగీత దర్శకుడు గౌర హరి మన గోదావరి జిల్లా వాసి. హరి తాతయ్య, అమ్మమ్మ స్వగ్రామం ఉండి. నానమ్మ, తాతయ్య స్వగ్రామం తణుకు. కొన్నాళ్లు ఉండిలో ఉన్న హరి విద్యాభ్యాసం తణుకులో సాగింది. తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయాడు. సంగీత దర్శకుడిగా అద్భుత ప్రతిభతో సొంత జిల్లాకు పేరు తెచ్చాడు.
ఉండి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకుడు గౌర హరి ఉండి కుర్రోడు. తాడికొండ లక్ష్మీనరసింహం (కర ణం), సావిత్రమ్మ దంపతుల పెద్దకుమార్తె రాధా రమణి, క్రొవ్విడి బాల సుబ్రహ్మణ్యం సంతానం గౌర హరి. అతడికి ఒక చెల్లెలు ఉంది. అమ్మమ్మ ఊరు ఉండి బ్రాహ్మణపేటలో వేంకటేశ్వరస్వామి ఆలయంనకు సమీపంలో వారి కుటుంబం నివసిం చేది. ఇక్కడే ప్రాథమికి విద్యాభ్యాసం తర్వాత కొన్నాళ్లు నానమ్మ ఊరైన తణుకులో ఉన్నారు. తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడ ప్రము ఖ సంగీత దర్శకుడి వద్ద సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాడు. హనుమాన్, మిరాయ్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడంతో పాన్ ఇండియా స్థాయిలో గౌర హరి పేరు దద్దరిల్లింది. తొలిసారి సంగీత దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు అద్భుత విజయాలు సాధించడంతో చిత్రసీమలో ప్రస్తుతం దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్నాడు.
ఆర్‌ఆర్‌ఆర్ అభినందన
శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు సంగీత దర్శకుడు హరికి వేంకటేశ్వరస్వామి జ్ఞాపికన అందించి అభినందిం చారు. తన నియోజకవర్గానికి చెందిన యువకుడు చిత్రసీమలో అద్భుతంగా రాణించడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని హరిని అభినందిం చారు. స్థానికంగా పలువురు అభిమానులు గౌర హరి చిత్రం గీసి అభిమానాన్ని చాటుకున్నారు.
ఉండిలో ఒకటే సందడి..
తమ గ్రామానికి చెందిన యువకుడు చిత్రసీమలో మంచి గుర్తింపును సాధించడంతో ఉండిలో సందడి నెలకొంది. సినిమాలో లేని పాట ‘వైబ్ ఉంది’ ఇక్కడ మరింత మారుమోగుతోంది. గ్రామంలో యువత సంబరాలు జరుపుకున్నారు. గౌర హరి ఉండి రాక కోసం ఎదురుచూస్తున్నారు.
మా ఇంటి పక్కనే ఉండేవారు
గౌర హరి కుటుంబం మా ఇంటి పక్కనే నివాసం. మా కుటుంబంతో కలిసిమెలిసి ఉండేవారం. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. హరి ఉన్నత స్థాయికి వెళ్లడం సంతోషంగా ఉంది.
– కామేశ్వరి (నాని మేడమ్), ఉండి
నా స్నేహితురాలికి అభినందనలు
నా స్నేహితురాలి కుమారుడు హరి. సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించడం సంతోషం. నా స్నేహితురాలికి అభినంనలు. మా దగ్గర చిన్నపిల్లోడు పెద్దస్థాయికి వెళ్లడం ఆనందంగా వుంది.
– కోకా పద్మిని, ఉండి
మరిన్ని విజయాలు సాధించాలి
మిరాయ్, హనుమాన్ చిత్రాలతో హరి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రేక్షకుల అభిమానం పొందడం గొప్ప విషయం. వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాను.
– నల్లా సత్యకిరణ్ ప్రసాద్, ఉండి
ఎంతో ఆనందం
మా గ్రామానికి చెందిన కుర్రోడు చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాను. ఇదేరీతిలో చిత్రపరిశ్రమలో కొనసాగాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను.
– ఇందుకూరి హరినారాయణరాజు, ఎంపీపీ, ఉండి