Share News

మద్యం మత్తులో యువకుడి హత్య

ABN , Publish Date - May 13 , 2025 | 12:05 AM

మద్యం మత్తులో జరిగిన గొడవలో యువకుడు హత్యకు గురైన సంఘటన కాళ్ళ మండలం ఎల్‌ఎన్‌ పురంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

మద్యం మత్తులో యువకుడి హత్య
సంఘటనా స్థలం పరిశీలిస్తున్న పోలీసులు

కాళ్ళ, మే 12 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో జరిగిన గొడవలో యువకుడు హత్యకు గురైన సంఘటన కాళ్ళ మండలం ఎల్‌ఎన్‌ పురంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా కోమటిలంకకు చెందిన చెన్నకేశవ అరవింద్‌ (22), ప్రత్తికోళ్లలంకకు చెందిన బండి జాన్‌ ఏసు బంధువులు. కొంత కాలం క్రితం ఎల్‌ఎన్‌ పురంలోని చెరువుల వద్దకు జీవనోపాధి నిమిత్తం వచ్చారు. వారు పనిచేసే చెరువుల వద్ద కిరణ్‌ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ముగ్గురూ చెరువు వద్దకు మద్యం తెచ్చుకున్నారు. తర్వాత బంధువులైన జాన్‌ ఏసు, అరవింద్‌ గొడవపడ్డారు. అరవింద్‌ పక్కనే ఉన్న వస్తువుతో జాన్‌ ఏసుపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే జాన్‌ ఏసు మేత బస్తాలపై ఉన్న చాకుతో అరవింద్‌ ఛాతీపై పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అరవింద్‌ను పక్కనే ఉన్న కిరణ్‌ వేరొకరి సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆకివీడు రూరల్‌ సీఐ జగదీశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై మృతుడు అరవింద్‌ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - May 13 , 2025 | 12:05 AM