మునిసిపాలిటీకి తాళం
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:49 PM
పట్టణంలో చెత్త డంపింగ్ సమస్య కౌన్సిల్‌లో దుమారం రేపుతోంది. కౌన్సిల్ సమావేశంలో కూటమి సభ్యు లు, చైర్‌పర్సన్, వైసీపీ సభ్యుల మధ్య వాడీ వేడి చర్చ సాగింది.
డంపింగ్ యార్డుపై నరసాపురం కౌన్సిల్ గరం గరం
సమావేశంలో చర్చించాలని కూటమి సభ్యుల పట్టు
మరోసారి చర్చిద్దామన్న చైర్‌పర్సన్, వెసీపీ కౌన్సిలర్లు
సమావేశం నుంచి వెళ్లిపోనున్న అధికార పక్ష సభ్యులు
గేటుకు తాళాలు వేసిన నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షం
నరసాపురం టౌన్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలో చెత్త డంపింగ్ సమస్య కౌన్సిల్‌లో దుమారం రేపుతోంది. కౌన్సిల్ సమావేశంలో కూటమి సభ్యు లు, చైర్‌పర్సన్, వైసీపీ సభ్యుల మధ్య వాడీ వేడి చర్చ సాగింది. అధికారులు సూచించిన స్థలంలో చెత్త డంపింగ్‌పై తీర్మానానికి కూటమి సభ్యులు పట్టుబ ట్టారు. నిధుల లభ్యతను బట్టి తర్వాత చర్చిద్దామని చైర్‌పర్సన్, వైసీపీ సభ్యులు చెప్పడంతో కౌన్సిలర్లు చైర్‌పర్సన్ పోడియంను చుట్టుముట్టారు. సమాధానం చెప్పకుండా చైర్‌పర్సన్ వెళ్లిపోవడంతో కూటమి సభ్యులు గేటుకు తాళం వేశారు.
పట్టణంలో చెత్త సమస్య ప్రజను వేధిస్తుంటే.. డంపింగ్ యార్డు ఏర్పాటు రాజకీయ వివాదాలకు వేదికగా మారుతోంది. మునిసిపల్ చైర్‌పర్సన్ వెంకట రమణ అధ్యక్షతన శనివారం జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో అజెండా లో పొందుపరిచిన డంపింగ్ యార్డు సమస్య పరిష్కారంపై సభ్యులు పట్టుబ ట్టారు. దీనిపై మరోసారి చర్చిద్దామని చైర్‌పర్సన్ దాటవేశారు. మునిసిపల్ అధికా రులు చూపించిన స్థలంలోనే చెత్త డంపింగ్‌కు ఆమోదిస్తే సమస్య తీరుతుందని, తక్షణం తీర్మానం చేయాలని వీసీ కొత్తపల్లి నాని, కౌన్సిలర్లు వన్నెంరెడ్డి శ్రీను, కోటిపల్లి సురేష్, కేసరి గంగరాజు, కృష్ణవేణి, అరుణ పట్టుబట్టారు. చైర్‌పర్సన్ వెంకటరమణ మాట్లాడుతూ డపింగ్‌యార్డు సమస్యకు తాము వ్యతిరేకం కాదని, నిధుల సమస్య, రోడ్డు సాధ్య సాధ్యాలపై మరోసారి చర్చిద్దామని చెప్పారు. కౌన్సిల్ సుముఖంగా ఉంటే మీరెందుకు అమోదించడం లేదని ప్రశ్నించారు. పోడియం వద్ద వెళ్లి సమస్యను పరిష్కరించాలని చైర్‌పర్సన్‌కు విన్నవించారు. వైసీపీ కౌన్సిలర్ జయరాజు మాట్లాడుతూ డపింగ్‌యార్డు ప్రదేశం పల్లపు ప్రాంతం కావడంతో రూ 30లక్షలతో రోడ్డు వేసినా ప్రయోజనం ఉండదన్నారు. నిధుల కోసం ఎమ్మెల్యే నాయకర్, ఎంపీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళదామన్నారు. చైర్‌పర్సన్, వైసీపీ కౌన్సిలర్లు బయటకు వెళ్లడంతో వీసీ కొత్తపల్లి నాని, వన్నెం రెడ్డి శ్రీను, కోటిపల్లి సురేష్, పాలూరి బాబ్జీ, కేసరి గంగరాజు, కృష్ణవేణి, సురేష్, అరుణ మునిసిపల్ కార్యాలయ గేట్‌కు తాళం వేసి ఆందోళన చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన సాగడంతో పోలీసులు చేరుకున్నారు. కౌన్సిలర్ జయరాజు రాడ్డుతో తాళం పగలగొట్టి చైర్‌పర్సన్‌తో పాటు వైసీపీ కౌన్సిలర్లంతా కారెక్కేం దుకు బయటకు వచ్చారు. కారు వెళ్లనివ్వండా అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యంతో వారంతా కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
సమగ్ర విచారణ చేపట్టాలి
మునిసిపాలిటీలో బాక్స్ టెండర్లు, సీ బిల్లులపై సమగ్ర విచారణ చేపట్టాలని కూటమి కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కౌన్సిల్ తీర్మానాలు చేసిన పనులు ఎందుకు చేపట్టడం లేదని కమిషనర్ అంజయ్యను నిలదీశారు. 11 నెలల నుంచి ఒక్క పని చేయించుకోలేకపోయామని అవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పురపాలకానికి చెడ్డ పేరొస్తుందని దిలీప్, సిర్రా కాంతమ్మ అన్నారు. పని చేయని కమిషనర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని సభ్యులు కోరగా సభ్యులు అంగీకరించారు.
దౌర్జన్యం చేశారు : చైర్‌పర్సన్
తనతో పాటు మహిళా కౌన్సిలర్లపై జనసేన కౌన్సిలర్లు దౌర్జన్యం చేశారని మునిసిపల్ చైర్‌పర్సన్ వెంకటరమణ అన్నారు. బయటకు వెళ్లనివ్వకుండా నిర్బంధించడం దారుణమని వీసీ నాగిని, కౌన్సిలర్లు ఆడిదెల శ్యామాలలు అవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడారు. డపింగ్‌యార్డు సమస్యపై సభ్యులంతా కూర్చొని చర్చిద్దామని చెప్పినా వినలేదని, పోడియం వద్దకు వచ్చి మినిట్ బుక్‌లో రాయాలని బలవంతం చేశారాన్నారు. చైర్‌పర్సన్‌తో పాటు మిగిలిన కౌన్సిలర్లను బయటకు వెళ్లకుండా గేటుకు తాళాలు ఎలా వేస్తారని ప్రశ్నించారు. డపింగ్‌యార్డుకు పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. సిర్రా కాంతమ్మ, యర్రా ఉమా, కావలి రామసీత, దుర్గాభావని, పద్మ, కామన బుజ్జి, శ్రీకాంత్, సఖినేటిపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.