Share News

ఇక అభివృద్ధివైపు అడుగులు !

ABN , Publish Date - May 01 , 2025 | 12:31 AM

ప్రజలు చెల్లించే ఆస్తిపన్ను, నీటి పన్ను, భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం అంతా ఇప్పటివరకు ప్రభుత్వ ఆజమాయిషిలో ఉండేది. పేరుకే మునిసిపాలిటీ నిధులు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే బిల్లులు మంజూరయ్యేవి.

ఇక అభివృద్ధివైపు అడుగులు !
భీమవరం మునిసిపల్‌ కార్యాలయం

మునిసిపాల్టీలకు ఆర్థిక స్వేచ్ఛ

సొంత నిధులు వినియోగించుకునే అవకాశం

పల్లెల మాదిరిగానే పట్టణాలకు వెసులుబాటు

ఇక బిల్లులకు వేచి చూడాల్సిన పనిలేనట్టే

బడ్జెట్‌లో కేటాయించిన నిధులకే పరిమితం

మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

పట్టణాలు అభివృద్ధివైపు అడుగులు వేయనున్నాయి. ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలు తమ సొంత నిధులతో చేపట్టే పనులకు బిల్లులు తక్షణమే విడుదలయ్యేలా ఆర్థిక వెసులు బాటు కల్పించింది. మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో మున్సిపాలిటీలు ఊపిరిపీల్చుకున్నాయి. కాంట్రాక్టర్‌లకు ఊరట లభించింది. పట్టణ ప్రజలకు ఇది ఎంతగానో మేలుచేకూర్చనుంది. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

(భీమవరం–ఆంధ్రజ్యోతి) :

ప్రజలు చెల్లించే ఆస్తిపన్ను, నీటి పన్ను, భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం అంతా ఇప్పటివరకు ప్రభుత్వ ఆజమాయిషిలో ఉండేది. పేరుకే మునిసిపాలిటీ నిధులు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే బిల్లులు మంజూరయ్యేవి. పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత పంచాయతీలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పించారు. పంచాయతీల్లో ప్రజలు చెల్లించే పన్ను ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేసుకునే అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి పట్టణాల్లోనూ చర్చ జరుగుతోంది. మున్సిపల్‌ శాఖలోనూ అంతర్మథనం ప్రారంభమైంది, తుదకు పట్టణాల్లో వచ్చే ఆదాయాన్ని మున్సిపాలిటీలు ఖర్చుపెట్టుకుంటే బిల్లులు కూడా పెండింగ్‌ లేకుండా మంజూరు చేసే వెసులుబాటు ఇచ్చారు. ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

చేపట్టే పనులు ఇవే..

మున్సిపాలిటీల్లో రహదారులు, డ్రెయిన్‌ల నిర్వహణకు నిధులు వెచ్చించుకోవచ్చు. పార్క్‌లు, నీటి వనరుల అభివృద్ధి–నిర్వహణ, పారిశుధ్య నిర్వహణకు అవసరమైన వసతులు, పాఠశాలలు, మునిసిపల్‌ వాణిజ్య సముదాయాల నిర్వహణ, శ్మశాన వాటికల అభివృద్ధి, అన్నా క్యాంటీన్‌ల నిర్వహన, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు వంటి వాటికి ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు పనులు నిర్వహిస్తే బిల్లుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడేది. కొత్త రహదారులు, డ్రెయిన్ల నిర్మాణంపై మార్గదర్శకాల్లో స్పష్టత ఇవ్వలేదు. కొత్త నిర్మాణాలపై అవకాశం ఇస్తే ఆర్థికంగా బలోపేతంగా ఉండే భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు వంటి మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు అవకాశం ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం మున్సిపాలిటీలతోపాటు, ఆకివీడు నగర పంచాయతీలో ప్రతిఏటా పన్ను రూపంలో దాదాపు రూ.75 కోట్ల మేర ఆదాయం లభిస్తుంది. ప్రజలు చెల్లించే ఆస్తిపన్ను రూపంలో ఆ మొత్తం సమకూరుతోంది. దానికితోడు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల నుంచి ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, పట్టణ ప్రణాళిక ద్వారా అదనంగా మరో రూ.25 కోట్లు మేర ఆదాయం సమకూరుతోంది. మార్కెట్‌ ఆశీలు, మున్సిపల్‌ షాపుల ఆదాయం కలసివస్తోంది. మొత్తంపైన రూ.120 కోట్లకుపైగా జిల్లాలో మున్సిపాలిటీలకు సొంత నిధులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిపై మున్సిపాలిటీలకు ఆర్థిక స్వేచ్ఛ లభించింది.

బడ్జెట్‌లో

కేటాయించాల్సిందే

ప్రతి ఏటా మున్సిపాలిటీలు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. బడ్జెట్‌కు అనుగుణంగానే మున్సిపాలిటీలు ఖర్చుపెట్టుకోవాలి. అంతే తప్పా తమకు నచ్చిన రీతిలో వెచ్చించుకునే అవకాశం లేదు. ముందుగానే ఏ పనులకు ఎంతమేర కేటాయించవచ్చో అంచనాలు వేసుకోవాలి. బడ్జెట్‌ను ఆ మేరకు పంపిణీ చేయాలి. ఏడాది అంతా ఆ విధంగానే వ్యయం చేయాలి. అప్పుడే బిల్లులు మంజూరవుతాయి. దీనివల్ల మున్సిపాలిటీలకు మేలు జరుగుతుంది. ముందస్తు ప్రణాళికల ఆధారంగానే నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈవిషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటివరకు మున్సిపాలిటీల్లో చేపట్టే పనులకు బిల్లులు మంజూరు చేయాలంటే నెలలతరబడి వేచి చూడాల్సి వస్తోంది. కనీస మరమ్మతులు వంటి పనులు చేపట్టినా సరే బిల్లులు మంజూరయ్యేవి కావు. తాజా వెసులుబాటుతో మున్సిపాలిటీలకు అటువంటి కష్టాలు ఉండవు. మున్సిపాలిటీలో చరిత్రలో ఇదో మైలు రాయిగా అంతా చర్చించుకుంటున్నారు.

Updated Date - May 01 , 2025 | 12:34 AM