Share News

శ్రీవారి క్షేత్రానికి ముక్కోటి కాంతులు

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:52 PM

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి క్షేత్రం విద్యుత్‌ దీపకాంతులతో శోభిల్లుతోంది. ఈనెల 30న ముక్కోటి సందర్భంగా శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి, ముందురోజైన సోమవారం గిరి ప్రదక్షిణకు దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది.

శ్రీవారి క్షేత్రానికి ముక్కోటి కాంతులు

నేడు ద్వారకాతిరుమలలో గిరి ప్రదక్షిణ

రేపు ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు

ద్వారకాతిరుమల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి క్షేత్రం విద్యుత్‌ దీపకాంతులతో శోభిల్లుతోంది. ఈనెల 30న ముక్కోటి సందర్భంగా శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి, ముందురోజైన సోమవారం గిరి ప్రదక్షిణకు దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది. తొలుత సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ తొలి మెట్టు వద్ద నుంచి గోవిందస్వాములు, భక్తులు, గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు. ఈ యాత్ర దొరసానిపాడు రోడ్డు మీదుగా శేషాచలం చుట్టూ తిరిగి ఉగాది మండపం మీదుగా ఆలయానికి చేరుకుంటుంది. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర జరిగే ఈ యాత్రలో మార్గమధ్యలో భక్తులకు మంచినీరు, పండ్లు, అల్పాహా రాలను దేవస్థానం సమకూర్చు తుంది. దీని నిమిత్తం స్వామివారు తిరిగే మార్గాన్ని దేవస్థానం తీర్చిదిద్దింది.

ఉత్తర ద్వార దర్శనం ఇలా..

ఉత్తరద్వారం మీదుగా స్వామివారి దర్శనం మంగళవారం తెల్లవారు జామున ఐదు గంటల నుంచి కలుగనుంది. ఉచిత దర్శనం భక్తులతో పాటు రూ.100, రూ.200 ద్వారా వెళ్లే వారు షాపింగ్‌ కాంప్లెక్స్‌ వెనుక నుంచి తాత్కాలిక క్యూకాంప్లెక్స్‌లోకి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉత్తరగోపురం మీదుగా ఆలయంలోకి చేరుకోనున్నారు. రూ.500 టికెట్టు తీసుకున్న వారు కొత్త అనివేటి మండపం నుంచి నూతన క్యూకాంప్లెక్స్‌లోకి అక్కడి నుంచి దక్షిణగోపురం మీదుగా ఆలయంలోకి చేరుకుంటారు. వీరికి రెండు లడ్డూలు ఉచితంగా అందజే స్తారు. ఇప్పటికే ఉత్తరద్వారాన్ని ముస్తాబు చేయడంతో పాటు స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు.

రూ. 2 లక్షల విలువైన కూరగాయలు వితరణ

చినవెంకన్న నిత్యాన్నదానానికి కొంతమంది దాతలు సుమారు రూ.2 లక్షలు విలువైన ఎనిమిది టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. విజయవాడకు చెందిన బడేటి శ్రీనివాస్‌, అతని స్నేహితులు శ్రీవారి ఆలయానికి ఈ వితరణ చేశారు. ముక్కోటి పర్వదినాన క్షేత్రానికి వచ్చే భక్తులకు ఈ కూరగాయలను అన్నదానంలో వినియోగించాలని కోరారు. శ్రీనివాస్‌ స్వగ్రామం తణుకు మండలం గుమ్మంపాడు. శ్రీనివాస్‌ను అతని స్నేహితులను ఆలయ అధికారులు అభినందించారు.

కాళ్లకూరులో ఏర్పాట్లు

కాళ్ల, డిసెంబరు28(ఆంధ్రజ్యోతి):ముక్కోటి ఏకా దశి పర్వదినాన్ని పురస్కరించుకుని కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం చైౖర్మన్‌ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసకుంటారన్నారు. అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:52 PM