Share News

ఎంఆర్‌ రాజు ఇక లేరు

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:38 AM

ఎంజీఎం ట్రస్ట్‌ ద్వారా క్యాన్సర్‌ రోగులకు విశేష సేవలందించిన సేవా మూర్తి, శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్‌ ఎంఆర్‌.రాజు ఇకలేరు. ట్రస్ట్‌ భవనంలోనే మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.

ఎంఆర్‌ రాజు ఇక లేరు

ఎంజీఎం ట్రస్ట్‌ ద్వారా క్యాన్సర్‌ రోగులకు విశేష సేవలు

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రశంస

2013లో పద్మశ్రీ పురస్కారం

ట్రస్ట్‌ భవనంలో తుది శ్వాస

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ఎంజీఎం ట్రస్ట్‌ ద్వారా క్యాన్సర్‌ రోగులకు విశేష సేవలందించిన సేవా మూర్తి, శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్‌ ఎంఆర్‌.రాజు ఇకలేరు. ట్రస్ట్‌ భవనంలోనే మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.

కాళ్ల, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ శాస్త్రవేత్త, గాంధేయవాది, మహాత్మా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ (పెద అమిరం) వ్యవస్థాపకుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ ముదుండి రామకృష్ణంరాజు (ఎంఆర్‌ రాజు) (95) మంగళవారం మృతి చెందారు. పెద అమిరంలోని ఎంజీఎం ట్రస్ట్‌ భవనంలోనే తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన స్వదేశంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, దివంగత సుభద్రాదేవితో మహాత్మాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. అనేక మంది క్యాన్సర్‌ బాధితులకు వైద్య సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. మాజీ రాష్ట్రపత్రి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి పురస్కారం అందుకు న్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిం చాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

శాస్త్రవేత్తగా ఎదిగి..

పెద అమిరంలో 1931లో జన్మించిన ఎంఆర్‌.రాజు ప్రాథమిక విద్య జిల్లాలోనే సాగింది. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించి అక్కడే డాక్టరేట్‌ చేసిన తర్వాత అమెరికా వెళ్లారు. లాస్‌ అల్మాస్‌ డిఫెన్స్‌ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా పని చేశారు. అనంతరం స్వదేశంలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందించే లక్ష్యంతో మాతృభూమికి తిరిగివచ్చి క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు సేవ లందించారు. 2006లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం పెద అమిరంలోని ఎంజీఎం ట్రస్ట్‌ను సందర్శించి పేదప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కా రంతో గౌరవించింది. 2013లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని ఎంఆర్‌ అందుకు న్నారు. అధికారిక లాంఛనాలతో దహన సంస్కారాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌రెడ్డి సమక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఆయన పార్థివదేహంపై ఉంచి నివాళులర్పించారు. అనంతరం బలసుమూడి వద్ద ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచికంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఎంఆర్‌ రాజు మరణ వార్తను తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు మంతెన రామ్‌కుమార్‌ రాజు, దంతులూరి రంగరాజు తదితరులకు సంతాపాన్ని తెలియజేశారు.

Updated Date - Jun 25 , 2025 | 12:38 AM