దివ్యాంగులకు బాసటగా..
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:30 AM
కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది.సూపర్‌సిక్స్ పథకం అమలులో కీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏలూరు రూరల్, నవంబరు 10 (ఆంధ్ర జ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది.సూపర్‌సిక్స్ పథకం అమలులో కీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు శుభవార్త అందించింది. ఉచి తంగా మూడు చక్రాల మోటార్ వాహనాలను అందించాలని నిర్ణయించింది. 70 శాతం కన్నా ఎక్కువ శారీరక వైకల్యం కలిగి ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పథకానికి అర్హు లు. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాల ని ప్రభుత్వం సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందని వారు మళ్లీ దర ఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. నియోజక వర్గానికి పది చొప్పున వాహనాలు ఇవ్వనుంది. వీటిలో 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. యూనిట్ విలవ రూ.1.30 లక్షలు కాగా, అర్హులైన వారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమశాఖ ఏడీ రామ్‌కుమార్ తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 54 వేల 052 మంది దివ్యాంగులు ఉండగా, వీరిలో 39 వేల 356 శారీరక దివ్యాంగులు ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో అయినవారికే..
వాహనాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో దివ్యాంగుల నుంచి భారీగా డిమాండ్ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్కసారి మాత్రమే అందజేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఆ పార్టీ నేతలు సిఫార్సు చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తూ కొద్దిమందికే అందించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదిగో ఇచ్చేస్తున్నామంటూ మరోసారి జిమ్మిక్కులు చేశారు. కానీ త్రిచక్ర వాహనాలు ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం నుంచే దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి సారించింది. త్రిచక్ర వాహనాలు అందించడంతోపాటు ఏటా ఇదేస్థాయిలో అర్హులను ఎంపిక చేసి ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.