మొంథా గండం
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:44 AM
మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి చేలల్లో నీళ్లు నిలిచాయి. డ్రెయిన్లు పొంగుతున్నాయి.
తుఫాన్ ఎఫెక్ట్‌తో ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భారీ వర్షాలు.. తప్పని కష్టనష్టాలు
మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి చేలల్లో నీళ్లు నిలిచాయి. డ్రెయిన్లు పొంగుతున్నాయి. ఈ డ్రెయిన్లు మొరాయిస్తే సాగుకు ఇబ్బందులు తప్పవని వరి రైతుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు దేవుడా ఈ తుఫాన్ గండం దాటించాలని ఆక్వా రైతులు మొక్కుతున్నారు. ఇప్పటికే పొలాలు ముంపునకు గురైతే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సూచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా మొంథా తుఫాన్ ఎఫెక్ట్ వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుందని తెలుస్తుంది. ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని పరిస్థితులపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
ఈసారి గట్టెక్కించు దేవుడా..
ఎడతెరపిలేని వర్షాలకు చనిపోతున్న చేపలు, రొయ్యలు
మొక్కుతున్న ఆక్వా రైతులు
ఆకివీడురూరల్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ఆక్వారైతులకు గండంగా మారింది. కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాలతో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీవర్షాలకు ఆక్వారైతులు చిగురుటాకులా వణికిపోతున్నారు. భారీ వర్షాల వల్ల చెరువుల్లో నీటిమట్టం పెరిగిపోయింది. నీటిలోని శెలనిటీ తగ్గిపోవడంతో పాటు నీటిరంగు తగ్గిపోతుంది. దీనివల్ల రొయ్యలకు అందాల్సిన పోషకాలు, మినరల్స్ తగ్గిపోతాయి. ఎండలేకుండా వర్షాలు కురుస్తుంటే నీటిలోని ఉష్ర్టోగ్రత తగ్గిపోతుంది. ఈమేరకు నీటిలో పీహెచ్ తగ్గి, ఆక్సిజన్ శాతం తగ్గిపోవడంతో రొయ్యలు చనిపోయి కిందకు దిగిపోతాయి. చేపలు పైకి వచ్చి ఆక్సిజన్ అందక తిరుగుతూ చనిపోతాయి. వీటితో పాటు వైరస్ ప్రభావం పెరిగిపోతుంది. రొయ్యలకు సాధారణంగా ఎండ ఎక్కువగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాయి. లేదంటే వైరస్, విబ్రియో వంటివి సోకి నష్టం వాటిల్లుతుంది. వాతావరణంలో వచ్చిన మార్పులు వల్ల రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.
వణికిపోతున్న ఆక్వారైతులు..
ప్రభుత్వం, వాతావరణ శాఖల నేపథ్యంలో ప్రారంభమైన మొంథా తుపాన్ పేరు చెబితేనే రైతులు వణికిపోతున్నారు. సోమవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుందనడంతో, చెరువులలో నీటి మట్టం అమాంతం పెరిగిపోతుందని, ఇప్పటికే నీటి పరిమాణం పెరిగిన రైతులు ఆందోళన చెందుతున్నారు. 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతుండడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవచ్చని, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడం వల్ల జనరేటర్ డీజిల్‌కు అదనపు ఖర్చు పెరిగిపోతుందని అంచనా వేస్తున్నారు. గాలి అంతవేగంగా వీస్తే చెరువుచుట్టూ కంచెలా ఏర్పాటు చేసిన ఆపాలు ఎగిరిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 40 వేల ఎకరాల్లో ప్రస్తుతం సాగు జరుగుతుందని, సాగు ప్రారంభమై ఇంచుమించుగా 20 రోజులు అవ్వవచ్చని, వీరందరికి ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. ఇప్పటికే ధరలు తగ్గిపోవడం, వ్యాధులు బారిన పడి నష్టాలు పాలవుతున్న రైతులకు వాతావరణం రూపంలో మరో పెద్ద సమస్య వచ్చిపడింది.
ఆక్వా రైతులకు జాగ్రత్తలు ఇలా..
ఉండి : భారీ వర్షాల వల్ల రొయ్యలు, చేపల చెరువుల్లో ఆక్వా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉండి కృషి విజ్ఞానకేంద్రం ఫిషరీస్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ.శ్రీనివాసరావు అన్నారు. వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో ఆక్వారైతులకు శాస్త్రవేత్త సూచనలు అందించారు. ప్రస్తుతం తుఫాన్ ప్రభావంతో చేపలు రొయ్యల చెరువులలో ఆక్సిజన్ లోపం ఏర్పడడం, అమ్మోనీయం, హెచ్2ఎస్ వంటి విషవాయువులు ఉత్పత్తి అయి చేపలకు, రొయ్యలకు ఒత్తిడి కలిగి వ్యాధులకు గురికావడం, చనిపోవడం సంభవిస్తున్నాయి. ప్రధానంగా పెద్ద సైజు చేపలు శంఖుజలగ, బ్యాక్టీరియా వ్యాధి వున్న చేపలు ఎక్కువగా చనిపోతాయి. ముందుగానే చెరువునీటిని పరీక్షించుకుని నీటి ఆక్సిజన్ స్థాయి ఐదు పీపీఎం కంటే తక్కువగా వున్నట్టు గుర్తిస్తే వెంటనే ఏరియేటర్లు లేదా రీసర్క్యులేషన్ చెరువునీటిని చెరువులోకి తోడడం లేదా బోటు తిప్పడం రాత్రి పది గంటలు నుంచి ఉదయం ఎండ వచ్చే వరకు ఏర్పాటుచేసుకోవాలి. శంఖుజలగ వ్యాధులున్నట్లు గమనిస్తే పొటాషియం పెర్మాంగనేటు ఎకరానికి అరేకేజీ నుంచి ఒక కేజీ వరకు తెల్లవారుజామున చెరువునీటిలో చల్లుకోవాలి. సాయంత్రం పూట జియోలైటు ఎకరానికి పది కేజీలు, గేనోనెక్స్, ముక్క కలిగిన పౌడర్‌ను పావుకేజీ ఎకరానికి అమ్మోనియం తగ్గడానికి చల్లుకోవాలి. వర్షం పడితే అగ్రికల్చరల్ లైమ్ ఎకరానికి 30 కేజీలు చల్లుకోవాలి. మేతలు గమనించి తక్కువగా ఇవ్వాలి. వారానికి ఒకరోజు మేత ఇవ్వడం మానివేసిన మంచిది. ఏవిధమైన రసాయనాలు, ఎరువులు వాడవద్దంటూ సూచించారు.
డ్రెయిన్లు మొరాయిస్తే సాగుకు గండమే
భీమవరం రూరల్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : అల్పపీడనం ప్రభావంతో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. సార్వా వరిచేలల్లోకి వర్షపు నీరు చేరుతుంది. ఈ సమయంలో మురుగు డ్రెయిన్‌లు మొరాయిస్తే సాగుకు గండం తప్పదు. నాలుగు రోజుల క్రితం అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలకు డ్రెయిన్ నిండుగా ప్రవహిస్తుంది. మళ్లీ మొంథా తుఫాన్ ప్రభావంతో సోమవారం ఎడతెరిపి లేని వర్షం కురిసింది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మురుగు డ్రెయిన్ పైనే సార్వా సాగు ఆధారపడింది. గడిచిన ఆరేళ్లలో మురుగు డ్రెయిన్ అభివృద్ధి అంతం మాత్రంగానే జరిగింది. ఇప్పుడు సాగును ముంచేలా మారింది. జిల్లాలో మేజర్, మైనర్ డ్రెయిన్‌లు దాదాపు 120 ఉన్నాయి. ప్రస్తుతం సాగు చేసిన సార్వా సాగు రెండు లక్షల ఎకరాలు ఈ డ్రెయిన్‌లపైనే ఆధారపడి ఉంది. గడిచిన మేలోనే డ్రెయిన్‌లో చెత్త తొలగించారు. మట్టి పూడికతీతలకు నోచుకోలేదు.
అయోమయంలో రైతన్నలు
భీమవరం రూరల్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : మొంథా తుఫాన్ ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాపై అతిగా చూపించడంతో రైతన్నలు అయోమయంలో పడ్డారు. పంటను గట్టెక్కించే అవకాశాలు ఏమాత్రం లేనందున గందరగోళం నెలకొంది. జిల్లాలో దాదాపుగా లక్ష ఎకరాలకు మరింత గండంగా మారింది. ఈనిక, పాలు పోసుకునే దశలో ఉన్నందున ఈదురుగాలులు, భారీ వర్షాలకు నీటమునిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్నిచోట్ల వరిచేలు నీళ్ల పాలవుతున్నాయి. పంట మాసూళ్లు దశకు చేరుకున్న ధాన్యం రాశులుగా ఉన్న రైతులు వాటిని చాలా వరకు గట్టుకు చేర్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఏమీ చేయలేని దీనస్థితిలో రైతన్నలు తుఫాన్ ప్రభావం తక్కువ ఉంటే బాగుండును అని వేడుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రొయ్యల చెరువులలో నీటిమట్టం పెరిగింది. మళ్లీ వర్షాలు ఎక్కువయితే చెరువుల గట్లు మునిగి నష్టం చేకూరుస్తుందని రైతులు ఆందోళనలో ఉన్నారు.
తుఫాన్‌పై జాగ్రత్తలు ఇలా..
భీమవరంటౌన్ : తుఫాన్ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. అధికారుల సూచనలను సత్వరమే పాటిస్తూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే ఆయా ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి. పునరావాస కేంద్రాల్లో భోజన సవతి, విద్యుత్, వైద్య సౌకర్యాలు కల్పించారు.
పురాతన భవనాలు, శిథిలావస్థలలో ఉన్న భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, వైర్ల వద్ద ఉండొద్దు.
ముఖ్యంగా విలువైన పత్రాలు, వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలి.
పశువులు, పెంపుడు జంతువులను కట్టకుండా వదిలి వేయాలి.
ఉరుములు, పిడుగులు వంటివి పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
విద్యుత్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. విద్యుత్ ఉపకరణాల కనక్షన్ తీసి వేయాలి. కిటికీలు, తలుపులు మూసివేసి ఉంచడం మంచిది.
తుఫాన్ సమయంలో సామాజిక మాద్యమాల ద్వారా ఎన్నో వార్తలు వస్తాయి. అపోహలు కల్పిస్తారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు.
అత్యవసర సమయాల్లో కమ్యూనికేషన్ కోసం మొబైల్‌ను ఎప్పటికప్పుడు చార్జింగ్ చేసుకోవాలి.. లేకపోతే ఆపద సమయంలో ఇతరులకు సమాచార ఇచ్చే అవకాశం ఉండదు.
ప్రభుత్వం, వాతావారణ శాఖ ఎప్పటికప్పుడు తుఫాన్ హెచ్చరికలను జారీ చేస్తోంది. సమాచారాలను అందిస్తోంది. ప్రజలు వాటిని నిరంతరం గమనిస్తూ ఉండాలి.
తుఫాన్ సమయంలో అత్యవస వస్తువులు, సామగ్రిని సిద్ధం చేసుకోవాలి.
వాగులు, వంకలు పొంగే అవకాశం ఉంటుంది. వాటిలో దిగే ప్రయత్నాలు చేయకూడదు.
మెంథా తుఫాన్‌తో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీర ప్రాంతానికి వెళ్లి సముద్రంలో దిగే సాహసం చేయకూడదు. పేరుపాలెం బీచ్‌లో పోలీసులు గస్తీ కాస్తున్నారు.
కార్తీక సాన్నాల కోసం గోదావరి, కాల్వల్లోకి సముద్రంలోకి దిగవద్దు.
తుఫాన్‌లో ఆపద ఎదురైతే ప్రభుత్వం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు సంప్రదించండి.