ముంచిన మొంథా
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:48 AM
మొంథా తుఫాన్ జిల్లాను అతలాకుతలం చేసింది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మంగళవారం రాత్రి జిల్లాలోని పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది.
ఈదురుగాలులు.. భారీ వర్షాలు
నేలవాలిన చెట్లు.. ఒరిగిన విద్యుత్ స్తంభాలు
అంధకారంలో పలు గ్రామాలు .. దెబ్బతిన్న రహదారులు
9,298.64 హెక్టార్లలో వరి, మినుము, పత్తి, వేరుశనగ.. 33 హెక్టార్లలో అరటి, కూరగాయల పంటలకు నష్టం
ఏలూరుసిటీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ జిల్లాను అతలాకుతలం చేసింది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మంగళవారం రాత్రి జిల్లాలోని పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. వరి, పత్తి, మినుము, వేరుశనగ పంటలతో పాటు ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. పెద ఎడ్లగాడి వద్ద కొల్లేరు వరద ఉధృతి కొనసాగుతోంది. జిల్లా యంత్రాగం చేపట్టిన ముందస్తు సహాయక కార్యక్రమాల వల్ల ఆస్థి, ప్రాణ నష్టా లను నివారించగలిగారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్‌లు, తుఫాన్ సహాయక చర్యల నిమిత్తం వచ్చిన జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, కలెక్టర్ కె.వెట్రి సెల్వి, జేసీ అభిషేక్ గౌడ ఎప్పటికప్పుడు సహాయక చర్యలపై సమీక్షలు నిర్వహిం చారు. జిల్లాలో 90 తుఫాన్ సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి 3,422 కుటుంబా లకు చెందిన ఏడు వేల మందికి భోజన, వసతి సదుపాయాలు కల్పించామన్నారు.
9,298.64 హెక్టార్లలో పంట నష్టం
తుఫాన్ ప్రభావంతో జిల్లాలో 9,298. 64 హెక్టార్లలో వరి, మినుము, వేరుశెనగ, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లా లో 26 మండలాల్లో 296 గ్రామాలు తుఫాన్ వల్ల ప్రభావితం అయ్యాయి. 10,916 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం 6,763. 24 హెక్టార్లలో వరి, 1,551.2 హెక్టార్లలో మినుము, 67 హెక్టా ర్లలో వేరుశనగ, 917.2 హెక్టార్ల లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న వరి పంట పొలాలను జిల్లా వ్యవసాయ శాఖాధికారి షేక్ హబీబ్ బాషా పరిశీలించారు. కాగా జిల్లాలో 33 హెక్టార్లలో ఉద్యాన పంటలకు 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఏడు మండ లాల్లోని 18 గ్రామాలు తుఫాన్‌కు ప్రభావితం కాగా ఆయా ప్రాంతాల్లో 30 హెక్టార్లలో అరటి తోటలు, 3 హెక్టార్లలో కూర గాయల తోటలు దెబ్బతిన్నాయి.
విద్యుత్ శాఖకు అపార నష్టం
మొంథా తుపాను కారణంగా విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లింది. జిల్లాలో 11 కేవీ ఫీడర్లు 20 వరకు దెబ్బ తినగా, 33 కేవీకి చెందిన ఎనిమిది విద్యుత్ స్తంభాలు దెబ్బ తిన్నాయి. ఎల్‌టీకి చెందిన 109 విద్యుత్ స్తంభాలు, 11 కేవీకి చెందిన 66 విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. జిల్లాలో 22 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 11 కేవీ విద్యుత్ కండక్టర్లు 9.62 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. మొత్తంగా జిల్లా లో విద్యుత్ శాఖకు రూ. 35.96 లక్షల వరకు నష్టం వాటిల్లింది. జిల్లాలో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరిగా యని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు తెలిపారు. జిల్లా లోని 144 విద్యుత్ సబ్‌స్టేషన్లు పరిధిలో 82 చోట్ల 33 కేవీ పీడర్లు, 726 చోట్ల 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ను సకాలంలో పునరుద్ధరించినట్టు వివరించారు.
ప్రాథమిక నష్టం అంచనాలను సమర్పించండి : కలెక్టర్
జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా కలిగిన ప్రాథమిక నష్టం అంచనాలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం రాత్రి తుఫాన్ నష్టం అంచనా లపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆరా తీశారు. జిల్లాలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవ్వరూ గాయ పడలేదన్నారు. నాలుగు పశువులు చనిపోయాయని, 18 ఇళ్లు దెబ్బ తిన్నాయని, 9298.64 హెక్టార్లల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా గుర్తిం చామన్నారు. పునరావాస కేంద్రాలలో తుఫాన్ బాధితులకు ఇంతవరకు 30 టన్నుల బియ్యం, మూడు టన్నుల కాయగూరలతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారన్నారు. 148 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవోలు అచ్యుత్ అంబరీష్, రమణ పాల్గొన్నారు. కాగా రానున్న రెండు రోజుల్లో జిల్లా అంతటా పెద్దఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం తుఫాన్ అనంతరం పారిశుధ్య, సహాయక కార్యక్రమాలు, నష్ట నివారణ అంచనాలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
జిల్లాలో వర్షపాతం వివరాలు : గత 24 గంటల్లో జిల్లాలో అత్యఽధికంగా ద్వారకాతిరుమల మండలంలో 70.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 31.3 మి.మీగా నమో దైంది. పెదవేగి 59.6, ముసునూరు 59.4, కామవరపుకోట 57, నూజివీడు 40.8, టి.నరసాపురం, పెదపాడు 37.6, పోలవరం 37.2, ఆగిరిపల్లి 36.4, కైకలూరు 35, లింగ పాలెం 34.2, జంగారెడ్డిగూడెం 33, చాట్రాయి 30.8, మండ వల్లి 29.8, చింతలపూడి 27.6, ఏలూరు అర్బన్, దెందు లూరులో 25.8, కలిందిండి 25.4, భీమడోలు 25, నిడమర్రు 23.6, ముదినేపల్లి 22.4, ఉంగుటూరు 21.2, ఏలూరు రూర ల్ 19.6, బుట్టాయిగూడెం 17.8, కొయ్యలగూడెం 17.4, జీలుగుమిల్లి 14, వేలేరుపాడు 6.8, కుక్కునూరు 6.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 11 మండ లాల్లో మొత్తం 46.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా ఇందులో అత్యధికంగా జీలుగుమిల్లి మండలంలో 17.8 మి.మీ, చింతలపూడి 10.4 మి.మీ, టి.నరసాపురం 5 మి.మీ, మిగిలిన 8 మండలాల్లో 5 మి.మీ కన్నా తక్కువగానే వర్షపాతం నమోదైంది.
పెరుగుతున్న కొల్లేరు
కైకలూరు/మండవల్లి : తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కొల్లేరు నీటి ప్రవాహ ఉధృతి పెరిగింది. ఇప్పటికే పెద్దఎడ్లగాడి – పెనుమాకలంక ఆర్‌అండ్‌బీ రోడ్డుపై మూడు అడుగులు నీరు ప్రవహిస్తుండగా లంక గ్రామాలకు రాక పోకలు స్తంభించాయి. పెద్దఎడ్లగాడి నుంచి పెనుమా కలంక, నందిగామలంక తదితర లంక గ్రామాలకు పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. కైకలూరు మండలంలో కొల్లేరు ఉధృతి క్రమేణ పెరుగుతోంది. ఎగువ నుంచి వర్షపునీరు 64 మేజర్, మైనర్ డ్రెయిన్ల ద్వారా చేరుతోంది. గోకర్ణపురం–పైడిచింతపాడు రహదారి రెండుచోట్ల ముంపుబారిన పడింది.
చివరి క్షణం వరకు ఉత్కంఠ
8 తీరం దాటే సమయంలో ఊపిరి బిగబట్టిన జనం
8 కంటి మీద కునుకు లేకుండా గడిపిన తీర గ్రామాలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
మొంథా తుఫాను ముంచి వెళ్లింది. కాకినాడ వద్ద తీరం దాటుతుందని అంతా అంచనా వేశారు. చివరకు కోనసీమ–పశ్చిమ సరిహద్దుల్లో బియ్యపుతిప్ప వద్ద తీరం దాటనున్నట్టు రాష్ట్ర విపత్తుల సంస్థ ప్రకటించడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా యంత్రాగమంతా హై అలర్ట్ అయ్యింది. ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇక తీరం దాటే సమయంలో జిల్లా ప్రజలు ఊపిరి బిగబట్టి ఉన్నారు. తీర గ్రామాల ప్రజల్లో కంటి మీద కునుకు లేదు. ఎంతటి విపత్తు తెస్తుందోనని అందోళనకు గురయ్యారు. ప్రతిక్షణం ఒక యుగంలా గడచింది. మంగళవారం రాత్రి 11.30 గంటలకు పూర్తిగా తీరం దాటుతుందని, ఆ సమయంలో తీవ్ర తుఫానుగా దాడి చేస్తున్న మొంథా ఎటువంటి అల్లకల్లోలం సృష్టిస్తుందోనని ఆందోళన చెందారు. సీఎం చంద్రబాబు రాత్రి వేళ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మంత్రి నిమ్మల రామానాయుడు తీరప్రాంతానికి చేరుకుని అక్కడ ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖలన్నీ తీర ప్రాంతంలోనే గస్తీ ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటలు అయ్యింది. అంతా ప్రశాంతంగానే ఉంది. తుఫాన్ బియ్యపుతిప్ప సమీపంలోనే తీరం దాటిందా లేదా వేరొకచోట అన్న అనుమానం కలిగింది. తుఫా న్‌కు ముందు వర్షం, ఈదురు గాలులు వీచాయి. తీరం దాటే సమయంలో ఎటువంటి అలజడి లేక పోవడంతో గమనార్హం. మొత్తానికి అర్ధరాత్రి తర్వాత గండం గట్కెక్కిందని భావించారు. అధికారులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కాని, రాత్రి మూడు గంటల సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారి సుడిగాలి వీచింది. గాలుల బీభత్సంతో వరి చేలు నేలవాలాయి. తుఫాన్ తర్వాత నష్టం తక్కువగా ఉండడంతో హుటాహుటీన సహాయక చర్యలు చేపట్టారు.