Share News

అన్నదాతల్లో జోష్‌

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:22 AM

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను వారి ఖాతాల్లో దాదాపు జమ చేసింది. ఆధార్‌ లింకేజీ సమస్యలతో కొద్ది మంది రైతులకు మాత్రమే సొమ్ములు పెండింగ్‌లో ఉన్నాయి.

 అన్నదాతల్లో జోష్‌

రబీలో 77,629 మంది రైతుల నుంచి 7,17,310 టన్నుల ధాన్యం కొనుగోలు

ఇప్పటి వరకు రూ.1649.28 కోట్లు జమ

బ్యాంకు లింకేజీ సమస్యతో రూ.4 కోట్లు పెండింగ్‌

రైతులకు సమాచారం ఇచ్చిన అధికారులు

ఖరీఫ్‌లో పలు సమస్యలను అధిగమించాలి

(భీమవరం–ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను వారి ఖాతాల్లో దాదాపు జమ చేసింది. ఆధార్‌ లింకేజీ సమస్యలతో కొద్ది మంది రైతులకు మాత్రమే సొమ్ములు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించుకుంటే వారికి సొమ్ములు జమ చేస్తుంది. గడచిన రబీలో ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా రికార్డుస్థాయి లో ధాన్యం కొనుగోలు చేసింది. 85 శాతం మంది రైతులకు 24 గంటల వ్యవధిలోనే సొమ్ములు చెల్లించింది. అంచనాలకు మించి ధాన్యం సేకరించడంతో మిగిలిన 15 శాతం మంది రైతులకు సొమ్ములు చెల్లింపులో జాప్యం జరిగింది. తాజాగా బకాయిలు మొత్తం చెల్లించడంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. జిల్లాలో బకా యి వున్న రూ.182 కోట్లను ఈ నెల 11న ఒక్కరోజే రైతు ఖాతాల్లో జమచేసింది. బ్యాంకు లింకేజీ సమస్య కారణంగా రూ.4 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. సంబంధిత రైతులకు అధికారులు సమాచారం అందించారు.

ఖరీఫ్‌లో మేల్కోవలసిందే

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణలో రైతులకు పూర్తి వెసులుబాటు లభించింది. మిల్లులకు పంపడానికి ఎదురుచూసే ఇబ్బందులు తప్పాయి. గడచిన ఖరీఫ్‌లో కోతలు అయిన వెంటనే మిల్లులకు తరలించేశారు. రబీలోనూ కొద్దిపాటి ఇబ్బందులు మినహా సక్రమంగానే ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. అకాల వర్షాలు కురిసినా కొనుగోలులో రైతులను ఇబ్బంది పెట్టలేదు. మిల్లర్లతో సంప్రదించి తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ప్రభుత్వం అదే తరహాలో కొనుగోలు చేస్తే రైతులకు ఇబ్బంది ఉండదు. కచ్చితమైన అంచనాతో ఉండాలి. సంచులను ముందుగానే భద్రపరచుకోవాలి. గడ చని రబీలో కొన్ని మండలాల్లో సంచుల ఇబ్బంది తలెత్తింది. ఖరీఫ్‌లో అటువంటి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అప్పుడే సక్రమంగా ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉంటుంది, వర్షాలు కురిస్తే ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ధాన్యం మిల్లులకు తరలించాలి. రైతు ఖాతాల్లో సొమ్ములు జమ అయ్యేలా ముదుగానే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. అప్పుడే ఖరీఫ్‌లోనూ ధాన్యం సేకరణ సవ్యంగా సాగనుంది.

ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 77,629 మంది

రైతుల నుంచి 7,17,310 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు చెల్లించాల్సిన మొత్తం రూ.1,653.72 కోట్లు.

ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో

చెల్లించిన సొమ్ము రూ.1,300 కోట్లు.

గత ఏడాది రబీలో 6.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ సారి 77 వేల టన్నులు అదనంగా సేకరించారు. ఈ కారణంగా మిగిలిన సొమ్ము రూ.353.72 కోట్లు చెల్లింపులో జాప్యం చోటు చేసుకుంది.

పైవేటు మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులంతా ప్రభుత్వంపైనే ఆధారపడ్డారు. ఫలితంగా సొమ్ములు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. జాప్యం అనివార్యమైంది.

పెండింగ్‌ బకాయిలను వారం రోజుల నుంచి విడుదల చేస్తూ వస్తున్నారు. జిల్లాలో శుక్రవారం నాటికి రూ.1649.28 కోట్లు చెల్లింపులను

పూర్తి చేశారు. మరో రూ.4 కోట్లు బ్యాంకుల్లో సిద్ధంగా ఉన్నాయి.

రైతులు లింకేజీ సమస్యలను పరిష్కరించుకుంటే వారి ఖాతాల్లో పడనున్నాయి. దీనికోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - Jul 13 , 2025 | 12:22 AM