ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాలేదు
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:26 AM
వైసీపీ అధినేత జగన్ రెడ్డిని ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాలేదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.
ఏలూరు రూరల్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్ రెడ్డిని ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాలేదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. స్థానిక జడ్పీ అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలకు ఆయన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. సామాన్య ప్రజలతో పాటు సొంత కుటుంబ సభ్యులకు సైతం వెన్నుపోట్లు పొడిచిన జగన్‌కు కూటమి ప్రభుత్వంపై విమర్శించే అర్హత లేదన్నారు. రౌడీ షీటర్లకు మద్దతు ఇచ్చి వాళ్లను పరామర్శించే స్థాయికి జగన్ దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నాడని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చింతమనేని విమర్శించారు. తప్పుడు కేసులతో తనను, చంద్రబాబును జైల్లో పెట్టించిన ఘనుడు అన్నారు.
వెన్నుపోటు దినం విడ్డూరం
ఏలూరు టూటౌన్: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. మంగళవారం విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ సొంత చెల్లి, కన్నతల్లికి జగన్ వెన్నుపోటు పొడిచారన్నారు. వెన్నుపోటు, గొడ్డలి పోటును ఆయన పేటెంట్ తీసుకున్నారని బడేటి చంటి ఎద్దేవా చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనం అయిందన్నారు. రాష్ట్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహర్నిశలు పాటు పడుతున్నారన్నారు. దొంగే దొంగ అన్నట్లు వెన్నుపోటుదారు అయిన జగన్‌రెడ్డి ధర్నాలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కూటమి ప్రభుత్వం 70 శాతం హామీలు నెరవేర్చిందన్నారు. 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు.