యూరియా బ్లాక్ చేస్తే పీడీ యాక్ట్
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:56 PM
వరి పండించే ప్రతీ రైతుకు యూరియా, ఎరువులను అందించే బాధ్యత అందరిదీ.. ఈ విషయంలో దుష్ప్రచారాలను జిల్లా యంత్రాంగం ఎక్కడిడక్కడ తిప్పికొట్టి, ప్రజల్లో అలజడిని సద్దుమణించే బాధ్యత తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
ప్రతీ రైతుకు ఎరువులు అందించాలి
వినియోగంపై అవగాహన కల్పించాలి
అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష
ఏలూరు, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): వరి పండించే ప్రతీ రైతుకు యూరియా, ఎరువులను అందించే బాధ్యత అందరిదీ.. ఈ విషయంలో దుష్ప్రచారాలను జిల్లా యంత్రాంగం ఎక్కడిడక్కడ తిప్పికొట్టి, ప్రజల్లో అలజడిని సద్దుమణించే బాధ్యత తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
యూరియా కృత్రిమ కొరత సృష్టించే డీలర్లు, వ్యాపారులను, బ్లాక్ మార్కెటింగ్ పాల్పడే వారిపై పీడీ యాక్టును ప్రయోగించి కేసులను నమోదు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్‌లో ఎరువుల సరఫరా, పంపిణీ విధానంపై ఎమ్మెల్యేలు, అధికారులతో సోమవారం సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సే ధ్యేయంగా వారికి అండగా ఉంటుందన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదు. వాస్తవంగా ఖరీఫ్‌లో 33,762 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 530 కేంద్రాల ద్వారా 32,557 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు. రెండు రోజుల్లో 2200 మెట్రిక్ టన్నులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఎరువులను పామా యిల్, ఇతర పంటలకు వాడుతున్నప్పుడు ఆయా రైతు లను ఎందుకు సమన్వయం చేయలేకపోయారని వ్యవ సాయశాఖ జేడీ హబీబ్ భాషా, ఉద్యానశాఖ జేడీ రామ్మోహన్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవా రం నుంచి వారం రోజుల పాటు సంయుక్తంగా ఏడు నియోజకవర్గాల్లో ఎరువుల వాడకం, లభ్యతపై ప్రధాన కేంద్రాల్లో అవగాహన సదస్సులను నిర్వహించేలా చూడాలని కలెక్టర్ వెట్రిసెల్విని మంత్రి నాదెండ్ల ఆదేశించారు. ఉద్యాన పంటలైన పామాయిల్, పత్తి, మిర్చి, మొక్కజొన్న రైతులకు విరివిగా రాబోయే రోజుల్లో నిల్వలు ఉంచుతామని ఎక్కడ అధైర్యపడవద్దన్నారు.
విజిలెన్స్ దాడులు చేయండి
రాబోయే రోజుల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారు లతో బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిపై దాడులు చేయాలని ఎస్పీ ప్రతాప్ కిశోర్‌కు ఆదేశాలిచ్చామన్నారు. ఇప్పటికే 12 కేసులు బుక్ చేశామని, 29 చెక్‌పోస్టుల వద్ద నిఘా ముమ్మరం చేశామన్నారు. సీఎం చంద్రబాబు ఎరువుల కొరతపై కలెక్టర్లతో సమీక్షించారని, క్షేత్రస్థాయిలో సమస్యల్లేకుండా చూడాలని తమను సమావేశాలు పెట్టాలని ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు.
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం నియోజవర్గంలో ఎరువుల సమస్యలు లేవని, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పత్తి, మిర్చి, పామాయిల్ పంటలకు మాత్రం ఎరువులు అవసరమ న్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కొరతపై వచ్చిన వార్తలను చూసి రైతులు ఎగబడి ఎరువులు నిల్వ చేసుకుంటున్నారన్నారు. ఉంగుటూరు, దెందు లూరు నియోజకవర్గాల్లో వరి సాగు ఎక్కువ అని, ఇక్క డ సరఫరా పెంచాలని కోరారు. కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ ధాత్రిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ పాల్గొన్నారు.
నానో యూరియా మాకొద్దు..
ఎరువుల కొరత లేకపోయినప్పటికి పంపిణీలో సర్వర్ సమస్య, ఈ పోస్ మిషన్లు పనిచేయకపోవడం, లాగిన్ సక్రమంగా లేకపోవడం వలన ఎరువుల స్టాక్ వచ్చిన పంపిణీ చేయలేకపోతున్నామని వివిధ సొసైటీల చైర్మన్లు తాతా సత్యనారాయణ, శ్రీనివాస్, చంద్రశేఖర్, వరప్రసాద్ తెలిపారు. నానో యూరియాను మాకొద్దన్నా అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సొసైటీలకు యూరియా, ఇతర ఎరువులు కూడా 12 నుంచి 15 టన్నులు చొప్పున పంపిణీ చేస్తున్నారని, అవి సర్దలేకపో తున్నామన్నారు. 25 టన్నులకు లేదా పెంచితే సర్దుబా టు చేయగలమన్నారు. కొందరు ప్రైవేట్ డీలర్లు 266 బస్తాను రూ.400కు పైబడి అధిక ధరకు విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు.
దీనిపై మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ సర్వర్ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి వచ్చిన సరుకు 24 గంట ల్లోగా రైతులకు సరఫరా జరిగేలా డీసీవో, వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నానో ఎరువుల వినియోగంపై తమకు ఫిర్యాదులన్నాయన్నారు. దీనిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. సమస్యలపై మాట్లాడే అవకాశం రైతులకు కల్పించలేదు. సొసైటీ చైర్మన్ల ప్రభుత్వ, ప్రజా ప్రతిని ధుల భజన విమర్శలకు తావిచ్చింది.