మైనింగ్‌కు మహర్దశ
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:11 AM
వైసీపీ ప్రభుత్వంలో కుదేలైన మైనింగ్ రంగాన్ని తిరిగి గాడిన పెట్టే చర్యలకు తెలుగు దేశం ప్రభుత్వం పూనుకోవడంతో జిల్లాలో మైనింగ్‌కు మహ ర్దశ పట్టనుంది.
మంత్రివర్గ నిర్ణయాలతో క్వారీ రంగానికి ఊతం
గ్రావెల్‌కు ఐదేళ్లు, క్వారీ, ఖనిజాలకు పదేళ్ల గడువుతో లీజులు
ఆదాయం పెంచేందుకు అధికారులు కార్యాచరణ
(ఏలూరు– ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వంలో కుదేలైన మైనింగ్ రంగాన్ని తిరిగి గాడిన పెట్టే చర్యలకు తెలుగు దేశం ప్రభుత్వం పూనుకోవడంతో జిల్లాలో మైనింగ్‌కు మహ ర్దశ పట్టనుంది. జిల్లాలో ద్వారకాతిరుమలలో బాల్ క్లే, కొయ్యలగూడెం, చింతలపూడి, చాట్రాయి మండలాల్లో రోడ్డు మెటల్, భీమడోలు, ఉంగుటూరు, టి.నర్సాపురం, చాట్రాయి, ముసునూరుల్లో గ్రావెల్ క్వారీలు ఉన్నాయి. ఓవరాల్‌గా 18 క్వారీలున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలోని లీజు గడువు పెంపు, పాత దరఖాస్తులకు మోక్షం కలిగించడం... భారం లేకుండా లీజుల పునరుద్ధరణ, కన్సిడరేషన్ భారం తొలగించడం వంటి మార్పులకు మంగళవారం మంత్రి వర్గం భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గతంలో అంతా దోపిడీయే
గత తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్డు మెటల్ పదేళ్లకు, గ్రావెల్ ఖనిజాలను ఐదేళ్లకు లీజులకు ఇచ్చే వారు. అనంతరం పునరుద్ధరణ జరిగేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజులు భారీగా పెంచారు. వార్షిక డెడ్‌రెంట్ విలువకు పదిరెట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతో చాలామంది అనుమతి తీసు కోకుండా ఇష్టాను సారంగా దోపిడీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని జేబుల్లో వేసుకున్నారు. ప్రస్తుత నిర్ణయం తో గ్రావెల్‌కు ఐదేళ్లు. ఇతర ఖనిజాలకు పదేళ్లకు రెన్యువల్ చేస్తారు. సీనరేజ్ ధరకు సమానంగా కొవిడ్ కాలంలో వసూలు చేసి కన్సిడరేషన్ మొత్తం నుంచి విముక్తి కలిగించారు. దీంతో జిల్లాలోని లీజుదారులకు ప్రయోజనం చేకూరనుంది. కొత్తవారు ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. క్వారీలు మూతపడి పనిలేక కార్మికులు పస్తులుండేవారు. భారాలు భరించలేక యజమానులు లబోదిబోమన్నారు.
తాజాగా గట్టెక్కించే దిశగా..
ఏపీ సూక్ష్మ ఖనిజాల విధానం–2025ను మంత్రివర్గం ఆమోదించించడంతో కొన్నేళ్లుగా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలను గట్టెక్కించే దిశగా సానుకూల నిర్ణయాలతో గనుల ఆధారిత కుటుం బాలకు మంచి రోజులు రానున్నాయి. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి ఉత్తర్వులు రావాల్సి ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఉత్తర్వులు వచ్చాకా ఆ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు తాము కూడా ఆదాయం పెంచడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు పేర్కొంటున్నారు.
వైసీపీ హయాంలో దరఖాస్తులు పెండింగ్
2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందస్తు ప్రాతిపదికన గనులు లీజుకు ఇచ్చేవారు. దరఖాస్తు ఫీజు నామమాత్రంగానే ఉండేది. వైసీపీ ఫ్రభుత్వంలో 2022లో ఈ–వేలం విధానం అమల్లోకి తీసుకురావడంతో దాదాపుగా చాలా దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోయాయి. పాత వాటి బూజులు దులిపి వాటిని కార్యాచరణ లో పెట్టనున్నారు. అక్రమార్కులు, వైసీపీ నేతలు అనుచరులే గనులను కొల్లగొట్టారు. వీటికి చెక్ పెట్టేందుకు జిల్లా అధికారులకు జీవోలు రూపంలో ఉత్తర్వులు రానున్నాయి. ––––––––––––