హాస్టల్.. భయం భయం!
ABN , Publish Date - Jul 22 , 2025 | 12:29 AM
సాంఘిక సంక్షేమ వసతి గృహ భవనాలు కోట్ల రూపాయలతో నిర్మించారు. కనీస సౌకర్యాలు, మరమ్మతులను నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
మరమ్మతు పనుల్లో జాప్యం
విద్యార్థులకు ఇబ్బందులు
భద్రతకు ముప్పు.. తల్లిదండ్రుల ఆందోళన
సాంఘిక సంక్షేమ వసతి గృహ భవనాలు కోట్ల రూపాయలతో నిర్మించారు. కనీస సౌకర్యాలు, మరమ్మతులను నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి మరమ్మతు పనులు నిలిచిపోవడంతో హాస్టల్ భవనం నిరుపయోగంగా మారుతోంది. ప్రహరీ నిర్మాణంలో అలసత్వం కారణంగా విద్యార్థుల భద్రతకు ముప్పు పొంచి ఉంది. గ్రామానికి, పట్టణానికి దూరంగా పొలాల మధ్యలో భవనంలో సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నా విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు.
తణుకు రూరల్, జూలై 21(ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతు పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 22 సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్‌లో రూ.1.29 కోట్లతో జనవరి, ఫిబ్రవరిలో చేపట్టిన మరమ్మతు పనులు నిలిచిపోయాయి. తణుకు పరిధిలోని పైడిపర్రులో రూ.28 లక్షలతో చేపట్టిన పనులు నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2018లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.5 కోట్లతో పైడిపర్రులో నిర్మించిన జీ ప్లస్ 1 హాస్టల్ భవన సముదాయంలో కళాశాల విద్యార్థులకు ఈ వసతి గృహాలు కొనసాగుతున్నాయి. గ్రామానికి, పట్టణానికి దూరంగా పొలాల మధ్యలో భవనం నిర్మించడంతో విద్యార్థులకు ఇబ్బం దులు తప్పడం లేదు. హాస్టల్ భవనం పొలాల మధ్య ఉండడంతో ఆవరణ ఎలుకల బొరియలతో గోతులమయమైంది. దీనితో పాటు వంట గదులలో టైల్స్ కూడా పాడైపోవడంతో వాటిని మరమ్మతులు చేయడంతో పాటు ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.28 లక్షలు మంజూరు చేసింది. ప్రహరీ నిర్మాణం పూర్తైనా వంట గదిలో టైల్స్, ఆవరణ మెరక పనులు నిలిచిపోయాయి. ఆవరణ మెరక చేసేందుకు తీసుకొచ్చిన కంకర గుట్టలు నెలల తరబడి వదిలేశారు. పాములు, పురుగులు చేరడంతో విద్యార్థులను మొత్తం పై అంతస్తులో ఉండేలా సిబ్బంది చర్యలు తీసుకున్నా రు. వంట గదిలో టైల్స్ పనులు నిలిచిపోవడంతో విద్యార్థులు భోజనం చేయడానికి అసౌకర్యంగా ఉంది. కోట్ల రూపాయలతో నిర్మించిన హాస్టల్ భవ నంలో కనీస మరమ్మతులు పూర్తి చేసి సౌకర్యం మెరుగుపరచాలని విద్యార్థులు కోరుతున్నారు.
హాస్టల్ ఎలా ఉంది? : జేసీ
భీమవరం రూరల్: భీమవరం మండలంలోని దిరుసుమర్రులో మూడవ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్వహిస్తున్న ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతి గృహంలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో సౌకర్యాలు ఎలా ఉన్నా యి? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకున్నారు. ప్రతిరోజూ సన్న బియ్యంతో తయారు చేసిన రైస్, మెనూ ప్రకారం కూరలు పెడుతున్నారా? అని ఆరా తీశారు. పిల్లలు పడుకుంటున్న గదులు, వంటలు, పరిసరాలను పరిశీలించారు. వర్షం వచ్చినప్పుడు హాస్టల్ గేటు వద్ద నీరు నిలిచిపోతుందని, కరెంట్ పోతే చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు వివరించారు. తహసీల్దార్ రావి రాంబాబు, హాస్టల్ వార్డెన్ ఎ.దేవి, వీఆర్వో తదితరులు ఉన్నారు.