Share News

పాడి సంపద అధరహో !

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:06 AM

పాడి పెంపకానికి మంచిరోజులు వచ్చాయి. స్వచ్ఛమైన పాలు తాగేందుకు చాలామంది ఆసక్తి చూపడంతో రైతులకు పశువుల పెంపకం ఆదాయ మార్గంగా మారింది.

 పాడి సంపద అధరహో !

మరో రకం రూ. 80.. లేక రూ.70

స్వచ్ఛమైన పాల వైపే మొగ్గు

భారమైనా పాడి పెంపకంపై ఆసక్తి చూపుతున్న రైతులు

జిల్లాలో పాలిచ్చే పశువులు లక్షా 15 వేలు

రోజుకు 5 లక్షల 70 వేల లీటర్ల ఉత్పత్తి

పాడి పెంపకానికి మంచిరోజులు వచ్చాయి. స్వచ్ఛమైన పాలు తాగేందుకు చాలామంది ఆసక్తి చూపడంతో రైతులకు పశువుల పెంపకం ఆదాయ మార్గంగా మారింది. దీంతో పల్లెల్లో పాడి పశువుల పెంపకం పెరుగుతోంది. పెంపకం భారమైనా గేదెలు, ఆవులు పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. పాల విక్రయాల ద్వారా నెలసరి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు..

ఆరోగ్యానికి పాలు తాగాలని చెబుతున్నారు. దీంతో స్వచ్ఛమైన పాలకోసం పట్టణాలతో పాటు పల్లెల్లో పాలకు డిమాండ్‌ పెరుగుతోంది. పట్టణ వాసులకు ధర ఎక్కువైనా స్వచ్ఛమైన పాలు ఇంటికి వస్తున్నాయి. ఏ రోజు పాలు అప్పుడే అందుతున్నాయి. గతంలో పట్టణాలలో పాల ప్యాకెట్లపైనే ఆధారపడేవారు. అవి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచుకుని వాడుకునేవారు. ఇప్పుడు రైతులే ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తున్నారు. దీంతో రైతులకు ఆదాయం కూడా లభిస్తోంది. స్వచ్ఛమైన పాలు కావాలంటే కాస్త ధర ఎక్కువుగానే ఉంటున్నాయి. చిక్కటి పాలు లీటరు కావాలంటే రూ. 100 దాకా తీసుకుంటు న్నారు. ఆవు పాలు అయితే రూ. 80 ఆపై రూ.70 అమ్మకాలు చేస్తున్నారు.

రోజుకు 5 లక్షల 70 వేల లీటర్ల ఉత్పత్తి

గతంలో కంటే ఇప్పుడు పశువుల పెంపకం తగ్గినా జాతి పశువులు పెంచడం వల్ల పాల ఉత్పత్తి బాగానే ఉంది. దీంతో ఎక్కువ మంది పాడి పశువుల పాలు అందుతున్నాయి. జిల్లాలో లక్షా 78, 137 గేదెలు, దూడలు ఉన్నాయి. 45,538 ఆవులు, దూడలు పెంచుతున్నారు. వీటిలో 90 వేలు వరకు గేదెలు, 25 వేలు ఆవులు పాలు ఇస్తున్నాయి. మిగిలినవి చూడివిగా, దూడలుగా ఉన్నాయి. పాడి పశువుల నుంచి రోజుకు 5 లక్షల 70 వేల లీటర్లు పాలు ఉత్పత్తి అవుతుంది. జనాభాను బట్టి 9 లక్షలు పైగా పాలు వాడకం ఉంటుంది. అవసరాన్ని బట్టి పాల ప్యాకెట్లపైన లబ్ధిదారులు ఆధారపడాల్సి వస్తుంది. పశువుల పెంపకం పెరిగితే ప్యాకెట్‌ పాలు వాడకం తగ్గే అవకాశం ఉంటుంది.

రైతులకు నెలవారీ ఆదాయం

పల్లెల్లోని రైతులకు పాలు ఉత్పాదన నెలసరి ఆదా యంగా మారింది. కష్టమైనా పశువులను పెంచి పాలు నుంచి ఆదాయం పొందుతున్నారు.పాలు నిత్యావసర వస్తువు కావడంతో ఆదాయం నికరంగా మారింది. ఒక రైతు రెండు పశువులను పెంచుతూ రోజుకు సరాసరి 12 లీటర్లు వరకు ఉత్పత్తి చేస్తున్నాడ్డు. వాటిని పట్టణాల్లో ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు. ఇలా నెలకు రూ.36 వేల దాకా ఆదాయం వస్తుంది. అందులో దాణాకు రూ. 2400, ట్రాన్స్‌పోర్టుకి రూ. 2 వేలు, ఇతర ఖర్చులుగా రూ. 1600 మొత్తం 6 వేలు పోయినా రూ. 30 వేలు మిగులు కనిపిస్తుంది.

పశువుల పెంపకం భారమే

పశువుల పెంపకం గతంలోలా లేదు. భారంగా మారింది. మొదట పాడి పశువుల ధర బాగా పెరిగింది. 15 ఏళ్ళ క్రితం రూ. 30 వేలు ఉన్న పాడి గేదె ఇప్పుడు లక్ష పైనే ఉంటున్నది. దాణా ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. ప్రొటీన్స్‌ దాణా 50 కేజీలు రూ. 600 నుంచి రూ. 1200లకు చేరింది. ఎండుగడ్డి ఉచితంగా అందేది. అది ట్రక్కు గడ్డి రూ. 10 వేలు పెట్టి కొనాల్సి వస్తున్నది. ఇలా పశువుల పెంపకం ఖర్చులు బాగా పెరిగాయి. అయినప్పటికీ పాలు గిరాకీ, ధరలు బాగుందడంతో రైతులకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది

పశువుల పెంపకం రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్నదిది. గత 6 నెలలుగా ఆర్‌ఎస్‌కేలలో 50 శాతం సబ్సిడీతో దాణా అందుబాటులోకి వచ్చింది. పశు వైద్యశాల మొబైల్‌ వైద్య సేవలు పశువులకు బీమా సౌకర్యాలు వచ్చాయి. ఉచితంగా వైద్యం సేవలతో పాటు ఇంజక్షన్లు చేస్తున్నారు. గ్రామానికి ఒక పశు వైద్యుడు అందుబాటులో ఉన్నారు. పాలు కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి ప్రభుత్వం తెచ్చింది.

ఆదాయ వనరుగా మారింది

పాలు ధర పెరిగింది. లీటరుకు రూ.100 ఇస్తున్నారు. దానివల్ల పశువుల పెంపకం ఆదాయంగా మారింది. మంచి జాతి గేదెలు రోజుకు 8 లీటర్లు పైన పాలు ఇస్తున్నాయి. ఇంటిలో ఉపయోగించి మిగిలినవి అమ్మినా నెలకు రూ. 15 వేలు పైనే ఆదాయం ఉంటుంది. వ్యవసాయం చేస్తూ గేదెను మేపుకుంటూ పాలు నుంచి ఆదాయం రాబడుతున్నాను.

ఎం.పెంటయ్య రైతు, భీమవరం మండలం

స్వచ్ఛమైన పాలతో ఆరోగ్యం

చాలా మందికి పాలు వాడకం అవసరం. పాలు తాగడం వల్ల కాల్షియం పెరుగుతుంది.ఎముకలు పటిష్టంగా ఉంటాయి. మధ్యాహ్నం పెరుగు తినడం వల్ల ప్రొటీన్స్‌ లభిస్తాయి. అయితే స్వచ్ఛమైన పాలు తాగాలి. పిల్లలకు కూడా పాలు మంచిది.

దుర్గాప్రసాద్‌, తణుకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు

Updated Date - Nov 11 , 2025 | 01:06 AM