సంతృప్తిగా..
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:24 AM
వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్ట డంతో కొంతమంది తినలేక ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే వారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు అందించే భోజనం మెనూలో మార్పులు చేసింది.
నాణ్యతగా మధ్యాహ్న భోజనం
సత్ఫలితాలిస్తున్న సన్నబియ్యం
రుచికరంగా వంటలు.. ఇష్టంగా తింటున్న విద్యార్థులు
నెరవేరుతున్న ప్రభుత్వం లక్ష్యం
వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్ట డంతో కొంతమంది తినలేక ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే వారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు అందించే భోజనం మెనూలో మార్పులు చేసింది. నాలు గు రోజుల పాటు తెల్లఅన్నం, వారానికి ఐదు కోడి గుడ్లు, వివిధ రకాల కూర గాయలతో పాటు సన్నబియ్యం తో వండిన భోజనం అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అమలు తీరుపై గురువారం కొన్ని పాఠశాలల్లో ‘ఆంధ్రజ్యోతి విజిట్’ చేసింది. అన్ని చోట్ల విద్యా ర్థులు భోజనం బాగుందంటూ ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశారు.
దెందులూరు : మండలంలోని కొవ్వలి జడ్పీ ఉన్నత పాఠశాలలో గతంలో 550 మం ది పిల్లలకు 490 నుంచి 500 మంది మాత్ర మే మధ్యాహ్న భోజనం చేసేవారు. కూటమి ప్రభుత్వం సన్నబియ్యంతో నాణ్యతతో భోజ నం అందించడంతో పాటు ఆరటిపండు, వేరు శెనగ చిక్కీలు అందిస్తుండడంతో గురువా రం 585 మందికి 583 మంది హైస్కూ ల్ లోనే భోజనం చేశారు. మిగిలిన ఇద్దరు అనా రోగ్య కారణాలతో భోజనం చేయలేదు. ఉద యం రాగి జావ అందించారు. మధ్యా హ్నం సన్న బియ్యం భోజనంతో పాటు ఉడకబెట్టిన కోడిగుడ్డు, విజిటబుల్ బిర్యాని, బంగాళా దుంప కుర్మాతో భోజనం అందించారు. చల్లచింతలపూడి, దెందులూరు పాఠశాలల్లో విజిట్ చేయగా ‘భోజనం బాగుంది’ అంటూ విద్యార్థులు తెలిపారు.
ఏలూరు రూరల్ : ఏలూరు రూరల్ మండలంలోని 46 ప్రభుత్వ పాఠశాలలకు నెల రోజులకు సరిపడా సన్న బియ్యాన్ని సరఫరా చేశారు. శనివారంపేట జడ్పీ స్కూల్‌లో 524 మందికి 500 మంది విద్యార్థులు భోజనం చేశారు. వారు మాట్లాడుతూ గతంలో అన్నం ముతకగా ఉండేదని ఇప్పుడు సన్న బియ్యంతో అన్నం బాగుందని, మిగిలిన వంటలు కూడా రుచికరంగా ఉంటున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
జంగారెడ్డిగూడెం : స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం బెల్లం కలిపిన రాగిజావ, మధ్యాహ్న భోజనానికి వెజిటెబుల్ రైస్, ఉడికించిన కోడి గుడ్డు, బంగాళా దుం పల కుర్మా వండడంతో విద్యార్థులు ఎంతో ఇష్టంతో తిన్నారు. గురువారం పాఠశాలకు 813 మంది హాజరుకాగా వారిలో 759 మంది మధ్యాహ్న భోజనం చేసినట్టు హెచ్‌ఎం. పట్నాల సోమశేఖర్ తెలిపారు. ప్రతీ రోజు ఉపాధ్యాయులు భోజనం నాణ్యత,రుచి చూసి న తర్వాతే విద్యా ర్థులకు వడ్డిస్తారని తెలి పారు. సన్నబియ్యం వల్ల మధ్యాహ్న భోజనం చేసే వారి సంఖ్య బాగా పెరిగిందన్నారు. కాగా పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసే చోట ఉంచిన డస్ట్‌బిన్‌ల్లో ఎవరూ అన్నం పడ వేయకపోవడం గమనార్హం.
నాణ్యత పెరిగింది..
కైకలూరు : మండలంలోని తామరకొల్లు జడ్పీ హైస్కూల్లో
గురువారం 169 మందికి 143 మంది భోజనం చేశారు. సన్న బియ్యంతో ఆహార నాణ్యత పెరిగిం దని విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. స్వల్ప సంఖ్యలో మాత్రమే విద్యార్థులు ఇంటి భోజనాన్ని తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఆరోగ్యం సహకరించడం లేదని మరికొంతమంది పెద్దల సూచనల మేరకు భోజనం తెచ్చుకుంటున్నారు.
స్టేజ్ పైనే భోజనం
జీలుగుమిల్లి: జీలుగుమిల్లి జడ్పీ హైస్కూల్లో విద్యార్థులు భోజనం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వేసిన రేకుల షెడ్డులోనే వర్షాకాలం వంట చేస్తున్నారు. విద్యార్థులు భోజనం చేసే వసతి లేకపోవడంతో కొందరు స్టేజ్‌పైన, మరికొందరు ఆఫీస్ రూం వరండాలో భోజనం చేస్తూ కన్పించారు. 340 మందికి 268మంది హజరై మధ్యాహ్న భోజనం చేశారు. వీరితోపాటు ఇంటర్ విద్యార్థులు 50 మందికి వంట చేశారు. పలావ్, బంగాళాదుంప కర్రి, కోడిగుడ్డు వడ్డించారు. ఉదయం రాగి జావ ఇచ్చారు. ఈ ఏడాది 95 మంది విద్యార్థులు చేరారు. గతంలో వంట చేసే మధ్యాహ్న భోజన కార్మికులు ఇద్దరు అనారోగ్య కారణాలతో మానేశారు. వారిస్థానంలో మరో ముగ్గురు కొత్తగా వంట చేసేందుకు వస్తున్నారు. పూర్తిస్థాయిలో వీరి నియామకం జరగలేదు. దీనికి ఎస్‌ఎంసీ కమిటీ, అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం వంట వండి వడ్డించేవారు లేక వీరిని కొనసాగిస్తున్నట్టు ఉపాధ్యాయ సిబ్బంది చెప్పారు.
రుచికరమైన వంటలతో భోజనం..
ముసునూరు : ముసునూరు, రమణక్కపేట పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించగా ముసునూరు జడ్పీ పాఠశాలలో 318 మంది, రమణక్కపేట జడ్పీ పాఠశాలలో 315 మంది పాఠశాలలోనే భోజనం చేశారు. అహారం నాణ్యత బాగానే ఉందని, సన్నబియ్యం అన్నంతో తాము కడుపు నిండా భోజనం చేస్తున్నామని విద్యార్థులు తెలిపారు. మోను ప్రకారం నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం పెడుతున్నారని పేర్కొంటున్నారు.
రుచిగా..శుచిగా..
లింగపాలెం: మండలంలోని సింగ గూడెం, రంగాపురం, కె.గోక వరం, కల రాయనగూడెం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నాణ్యత ఎంతో చాలా బా గుందని విద్యార్థులు తెలిపారు. భోజనం రుచిగా ఉండడంతో గతంలో కంటే ఎక్కువ మంది మధ్యాహ్నభోజనం పాఠశాలల్లోనే చేస్తున్నారని ఉపాధ్యా యులు తెలిపారు.
భోజనం చాలా బాగుంటోంది..
సన్నబియ్యంతో వండిన భోజనం, పలు రకాల కూరలతో రుచి గా చాలా బాగుంది. ఇంతకు ముందు ఇంటి నుంచి భోజనం తీసు కొచ్చేవాళ్లం. ప్రస్తుతం ప్రతిరోజూ మధ్యాహ్నం బడిలోనే భోంచేస్తున్నాం.
– జి.మనోజ్ఞ్ఞ, సింగగూడెం
ఇంటి భోజనం మానేశాం..
ఇంతకు ముందు అన్నం లావుగా, ముద్ద ముద్దగా ఉండేది. ఇప్పు డు సన్న బియ్యంతో వండిన అన్నం, ప్రతి రోజూ ఒక్కోరకం కూర, ఐదురోజులు కోడిగుడ్డు ఇస్తున్నారు. ఇంటి నుంచి భోజనం తీసుకురాకుండా అందరం బడిలోనే తింటున్నాం.
– షేక్ మునీషా, సింగగూడెం