Share News

ఎంఈవోల వ్యవస్థలో ‘ఇద్దరి’ అవస్థలు !

ABN , Publish Date - Jun 29 , 2025 | 11:40 PM

మండలాల్లో ప్రభుత్వ విద్యాపథకాలు, పాఠశాలల పర్యవేక్షణ, టీచర్ల పనితీరు పరిశీలన, విద్యార్థుల విద్యాసామర్థ్యాల మదింపు తదితర కీలక కార్యకలాపాలకు ఉద్దేశించిన మండల విద్యాధికారుల(ఎంఈవో–1,2)వ్యవస్థలో నెలకొన్న సంస్థాగత సమస్యలపై రెండు రకాల ఎంఈవోల సంఘాలు ఆదివారం వేర్వేరుగా గళంవిప్పాయి.

ఎంఈవోల వ్యవస్థలో ‘ఇద్దరి’ అవస్థలు !

సమస్య పరిష్కారానికి వేర్వేరు ప్రతిపాదనలతో తలో వాదన

గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన చిచ్చు

ప్రభుత్వం దృష్టిసారిస్తేనే మేలు

ఏలూరు అర్బన్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : మండలాల్లో ప్రభుత్వ విద్యాపథకాలు, పాఠశాలల పర్యవేక్షణ, టీచర్ల పనితీరు పరిశీలన, విద్యార్థుల విద్యాసామర్థ్యాల మదింపు తదితర కీలక కార్యకలాపాలకు ఉద్దేశించిన మండల విద్యాధికారుల(ఎంఈవో–1,2)వ్యవస్థలో నెలకొన్న సంస్థాగత సమస్యలపై రెండు రకాల ఎంఈవోల సంఘాలు ఆదివారం వేర్వేరుగా గళంవిప్పాయి. ఒకే పనికి ఇద్దరు సమానహోదాగల అధికారుల వల్ల క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టాయి. ఇద్దరు ఎంఈవోల వ్యవస్థవల్ల ఏర్పడిన అసమానతలను తొలగించి వెంటనే బదిలీల కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని ఎంఈవో–2ల సంఘం నాయకులు పట్టుబట్టగా, మండలానికి ఇద్దరు వద్దు...ఒక్కరే చాలునని పేర్కొంటూ ఎంఈవోలిద్దరినీ ఏకీకృతంచేసే ఫార్మూలాను అమలు చేయడమే సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారమని ఎంఈవో–1ల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఇద్దరు ఎంఈవోల వ్యవస్థ సమస్యలపై వేర్వేరు ప్రకటనల సారాంశమిదే.

అసమానతలు తొలగించి, బదిలీలు చేపట్టాలి : ఎంఈవో–2ల సంఘం

గత తొమ్మిదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఎంఈవోలకు బదిలీల కౌన్సెలింగ్‌ చేపట్టాలని ఏపీ ఎంఈవో–2 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.వి.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ యాజమాన్యాలకు చెందిన హెచ్‌ఎంలతో మండలానికి ఇద్దరు చొప్పున నియామకాలు జరిగిన ఎంఈవోల వ్యవస్థలో భాగంగా మండల విద్యాధికారులను ఉమ్మడి సీనియార్టీ ద్వారా బదిలీ చేస్తారన్న ప్రచారంలో వాస్తవంలేదని ప్రభుత్వమే స్పష్టం చేయాలని కోరారు. ఇప్పటికే డీడీవోలుగా పనిచేసిన గ్రేడ్‌–2 హెచ్‌ఎంలను కన్వర్షన్‌ద్వారా ఎంఈవోలను ని యమించగా, గత వైసీపీ ప్రభుత్వ వివక్షత కారణంగా ఎంఈవో–1ను డీడీవోగాను, ఎంఈవో– 2ను నాన్‌ డీడీవోలుగా విభజించి సమాన హోదాకు దూరం చేసిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఇద్దరు ఎంఈవోల వ్యవస్థ మధ్య అసమానతలు సృష్టించిందని, దీనివల్ల ప్రజల్లో ఎంఈవో–2 అంటే చులకనభావం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏకీకృతంతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎంఈవో–1ల సంఘం

మండల స్థాయిలో వున్న తహసీల్దార్‌, ఎంపీడీవో, తదితర వ్యవస్థలు ఏ ఒక్క దానిలోనూ ఇద్దరు అధికారులు చొప్పున పర్యవేక్షణ లేదని, దానికననుగుణంగానే ఇద్దరు ఎంఈవోల వ్యవస్థను కూడా ఏకీకృతం చేసి మండలానికి ఒక్క ఎంఈవో మాత్రమే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఈవో–1ల సంఘం రాష్ట్ర కోశాధికారి ఎస్‌.నరసింహమూర్తి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పలు అంశాలను వివరిం చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 679మంది చొప్పున ఎంఈవో–1, 2లు ఉన్నారని, ఈ రెండు పోస్టులను ఏకీకృతం చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఆ ప్రకారం మొత్తం 679మంది ఎంఈవో–1 పోస్టుల్లో ప్రస్తుతం 400మంది మాత్రమే పనిచేస్తున్నారని, మిగిలిన ఖాళీల్లో ఎంఈవో–2లను భర్తీచేస్తే ఇంకా మిగిలిన వారు గ్రేడ్‌–2 హెచ్‌ఎంలుగా వెళ్లిపోవడానికి సుముఖంగావున్న విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంఈవోలను ఏకీకృతం చేయడం ఒక్కటే ఫార్మూలా అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏకీకృత ఎంఈవో వ్యవస్థను పునఃప్రారం భించడానికి చర్యలు చేపట్టాలని కోరారు.

Updated Date - Jun 29 , 2025 | 11:40 PM