పురుషులకు పొదుపు సంఘాలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:09 AM
పురుషులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారితో స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఐదు నెలల క్రితం మెప్మా డైరెక్టర్ నంబూరి తేజ్ భరత్ ఉత్తర్వులు జారీచేశారు.
డ్వాక్రా తరహాలోనే పొదుపు.. ఆపై రుణాలు
ఆరు రంగాల్లోని వారితో గ్రూపుల ఏర్పాటు
ఏలూరు, మరో మూడు పట్టణాల్లో 70 సంఘాలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
పురుషులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారితో స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఐదు నెలల క్రితం మెప్మా డైరెక్టర్ నంబూరి తేజ్ భరత్ ఉత్తర్వులు జారీచేశారు. ఏలూరు జిల్లాలోను డ్వాక్రా సంఘాల మాదిరిగా పొదుపును అలవాటు చేసి, ఆరు నెలలు తర్వాత వారికి రుణాలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం అవు తోంది. మిషన్ ఎలిమేషన్ ఆఫ్ పావర్టీ (మెప్మా) ఆధ్వర్యంలో ఏలూరు కార్పొరేషన్, నూజివీడు మున్సిపాల్టీ, జంగారెడ్డిగూడెం, చింతలపూడి నగర పంచాయతీల్లో ఈ సంఘాలను ఏర్పాటు చేయడానికి అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ప్రధానం గా భవన నిర్మాణ కార్మికులు, రవాణా రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, డొమెస్టిక్ వర్కర్లు(స్విగ్గీ, జమోటో), పారిశుధ్య కార్మి కులు (కాంట్రాక్టు కార్మికులు) కేర్‌టేకర్స్ (వాచ్‌మెన్లు) తదితర ఆరు రకాల పనులు చేసుకునే పురుషులతో సంఘాలను రిజిస్టర్ చేయిస్తున్నారు. వారితో ఇప్పటికే ఐదు నెలలు పొదుపు ను చేయించడం అలవాటు చేశారు. రూ.వంద నుంచి రూ.500 వరకు పొదుపు చేసుకునేలా, వారికి తీర్మానాలు చేయించడం, ఆపై పుస్తకాలు (రిజిస్టర్)లు నిర్వ హణ చేపట్టారు. ప్రధానంగా పురుష సంఘాలకు కనీసం ఐదుగురు సభ్యులుంటే చాలు. అంతకంటే పది మంది ఉండవచ్చు. ఐదుగురితో సంఘం ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వివిధ వర్గాలను ఒకచోటికి చేర్చడం వారికి సులభతరం అవుతోంది. ఇప్పటికే ఐదు నెలలు పొదుపు పూర్తి కావడంతో, ఇంకో నెల వారితో పొదుపు చేయించి వారికి రుణ సౌకర్యం కల్పించి వారికి నచ్చిన వ్యాపారాలు చేసుకునేందుకు వీలు గా చర్యలు చేపట్టారు.
ప్రస్తుతానికి 70 సంఘాల స్థాపన
– మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి.మాధవి
ఏలూరు 19, నూజివీడు 33, జంగారెడ్డిగూడెం 17, చింతలపూడిలో ఒక సంఘం కలిపి మొత్తం 70 సంఘా లను ఏర్పాటుచేశాం. ఈ సంఖ్య పెంచడానికి క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా భవన నిర్మాణ, రవాణా రంగ కార్మికులు సభ్యులుగా చేరేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. సాధ్యమైనంత మేర ఎక్కువ మందికి ఈ సంఘాల్లో సభ్యులుగా చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. సంఘాల ఏర్పాటు నిరంతరంగా జరుగుతుంది. ఆరు నెలలు పొదుపు పూర్తయ్యాక ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణాల సౌకర్యం కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అన్నీ సక్రమంగా జరిగితే దసరా లేదా దీపావళి నాటి రుణాలు ఇస్తాం.