తెలుగు తెచ్చిన తంటా !
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:41 AM
ఉపాధ్యాయ ఉద్యోగ నియా మకాలకు పాఠశాల విద్యాశాఖ కొత్తగా పెట్టిన సంస్కరణలు/ మార్గదర్శకాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా డీఎస్సీ–2025 తుది ఎంపికల ముంగిట్లోవున్న ఐదుగురు అభ్యర్థుల ఉద్యోగా వకాశాలను ఆవిరిచేసింది.
కేంద్ర విద్యాసంస్థల్లో చదవడమే డీఎస్సీ ఉద్యోగ అవకాశాలను చేజార్చిందని అభ్యర్థుల ఆవేదన
డీఎడ్, బీఎడ్ పూర్తిచేసినా ఉపాధ్యాయ ఉద్యోగాలకు అనర్హులేనా ?!
ఏలూరుఅర్బన్,ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి):ఉపాధ్యాయ ఉద్యోగ నియా మకాలకు పాఠశాల విద్యాశాఖ కొత్తగా పెట్టిన సంస్కరణలు/ మార్గదర్శకాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా డీఎస్సీ–2025 తుది ఎంపికల ముంగిట్లోవున్న ఐదుగురు అభ్యర్థుల ఉద్యోగా వకాశాలను ఆవిరిచేసింది. శుక్రవారం ఇదేకోవలో ఇద్దరు మహిళా అభ్యర్థులకు నిర్ణీత అర్హతలు లేవని అనర్హుల జాబితాలో చేర్చగా, తాజాగా శనివారం మరో ఐదుగురిని తిరస్కరణ జాబితాలో ఉంచినట్టు తెలిసింది. సర్టిఫికెట్ల పరిశీలన ముగిసిన నేపథ్యంలో శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియలో గుర్తించిన వీరిని అనర్హులుగా చేసినట్టు సమాచారం. అయితే వీరి అనర్హత ధ్రువీకరణను విద్యాశాఖవర్గాలు బహిర్గతం చేయడం లేదు.
చివరి నిమిషంలో ఉద్యోగావకాశాలను చేజార్చుకున్న ఈ ఐదుగు రు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను అనర్హులుగా చేసిన అంశమేం టంటే.. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిర్వహించే నవోద య, కేంద్రీయ విద్యాలయ, సీబీఎస్‌ఈ బోధన జరిగే విద్యాసంస్థల్లో పదో తరగతిలో ప్రథమభాష లేదా ఇంటర్మీడియట్‌లో ద్వితీయ భాష లేదా డిగ్రీ కోర్ సబ్జెక్టుల్లో తెలుగుభాష చదవకపోవడమే సంబంధిత డీఎస్సీ కాల్ లెటర్లు అందుకున్న సెలెక్టెడ్ అభ్యర్థులను నియామక ప్రక్రియ నుంచి నెట్టివేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన
గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్య మంలోనే తరగతుల నిర్వహణ, బోధన జరుగుతోంది. ఈ విషయాన్ని సైతం పరిగణనలోకి తీసుకోకుండా టెన్త్‌లో ప్రథమభాష, ఇంటర్‌లో ద్వితీయభాషగా తెలుగు ఉంటేనే డీఎస్సీ ఉద్యోగాలకు అర్హులని కొత్త విషయాన్ని తెరపైకి తీసుకురావడం నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ముఖ్యంగా కేంద్ర విద్యాసంస్థల్లో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ పూర్తిచేసిన వారిలో ఒకింత ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇవే షరతులు ముందునుంచీ పెట్టిఉంటే కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పరీక్షలు రాయడం, అడ్మిషన్లు తీసుకోవడం ఎవరూ చేయరని అభ్యర్థులు చెబుతున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ అనంతరం ఉపాధ్యాయ విద్యశిక్షణ కోసం డీఎడ్, డిగ్రీ అనంతరం బీఎడ్ చదివామంటే టీచరు ఉద్యోగాల కోసమేనని, తాజా మార్గదర్శకాలతో డీఎస్సీ నియామకాలకు అనర్హులుగా చేయడం ఎంతవరకు సబబమని ప్రశ్నిస్తున్నారు.
ఎఫ్‌ఏక్యూ.. వివరణేగాని జీవో కాదుగా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ–2001 రిక్రూట్‌మెంట్ సందర్భంగా జారీఅయిన ఆర్సీ/జీవో ఉత్తర్వులప్రకారం అభ్యర్థుల అర్హత లపై ఎస్సీఈఆర్టీ ఇచ్చిన వివరణ ప్రకారం నవోదయ విద్యాసంస్థల్లో పదో తరగతిలో తెలుగు పాఠ్యాంశాలను చదివిన వారందరినీ ఎస్‌ఎస్‌సీ స్కీంలో ప్రథమభాష తెలుగును ఎంచుకున్నట్టుగానే పరిగణించాలని స్పష్టం చేశారు. ఇదే ఉత్తర్వు ఇప్పటికీ అమల్లోవున్నట్టుగానే భావిస్తు న్నారు. కాగా విద్యాశాఖ తన వాదనను సమర్థించుకునేందుకు ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ (ఎఫ్‌ఏక్యూ)ను తెరపైకి తెచ్చింది. మెగా డీఎస్సీ–2025 నిర్వహణపై ఈ నెలలో విద్యాధికారులకిచ్చిన శిక్షణ సందర్భంగా కొంద రు లేవనెత్తిన సందేహాలపై ఎఫ్‌ఏక్యూ రూపంలో వివరణలిచ్చారు. అందులో 8వ ప్రశ్నగా ప్రస్తావనకు వచ్చిన డీఎస్సీ అభ్యర్థుల విద్యార్హ తల విషయంలో లాంగ్వేజీ, మీడియంల విషయమై ఇచ్చిన వివరణలో ఎక్కడా నవోదయ, సీబీఎస్‌ఈ, కేంద్రీయ విద్యాలయ, తదితర కేంద్ర విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థుల విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ వివరణ నుంచి తమకు మినహాయింపు ఉంటుందని అభ్యర్థులు చెబుతున్నారు.
సమంజసమేనా ?
సీబీఎస్‌ఈ, నవోదయ, కేంద్రీయ విద్యాలయ, తదితర కేంద్ర విద్యాసంస్థల్లో ఆంగ్లమాధ్యమంలోనే బోధన జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పదో తరగతిలో ప్రథమ భాష ఇంగ్లీషు మాత్రమే ఉంటుంది. మరో భాషను ఎంచుకునే సౌలభ్యం ఉండదు. ఇక ఇంటర్మీడియట్‌లో ద్వితీయ భాషగా తెలుగు ఎంచుకోవడానికి అవకాశం వున్నప్పటికీ అధికమార్కుల కోసం దాదాపు విద్యార్థులందరూ సంస్కృతం లేదా మరో భాషకు ప్రాధాన్య మిస్తారు. అతి స్వల్పసంఖ్యలో మాత్రమే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగును ఎంచుకుంటారు. రాష్ట్రబోర్డులో చదివిన విద్యార్థుల విష యంలో సమస్య లేకపోయినా కేంద్ర విద్యాసంస్థల్లో టెన్త్, ఇంటర్ వరకు అభ్యసించిన వారి అర్హతల విషయంలోనే మెగా డీఎస్సీ–2025 నియామకాలకు కొత్తగా పెట్టిన సంస్కరణలు సంబంధిత అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాల ఆశలపై నీళ్లుచల్లాయి.
జీవో నిబంధనలే పాటిస్తాం
కేంద్ర విద్యాసంస్థల్లో టెన్త్, ఇంటర్మీడియట్ చదివి తెలుగు ప్రథమ, ద్వితీయ భాషలేని అభ్యర్థుల విషయంలో వచ్చిన సమస్యలపై ఉన్నతాధికారులు స్పష్టతనిచ్చారు. విద్యార్హతలు, అనర్హతలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 19న జారీఅయిన జీవో 15 ఉత్తర్వు 31వ పేజీలో రూల్ నంబరు 4లో నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ నిబంధనలనే డీఎస్సీ నియామకాలకు పాటిస్తున్నాం. వివాదాలకు అతీతంగా పూర్తిపారదర్శకతతో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఏ ఒక్కరికీ అన్యాయం జరుగదు.
– ఎం.వెంకట లక్ష్మమ్మ, ఉమ్మడి జిల్లా డీఈవో