Share News

మావుళ్లమ్మ సేవకు.. జాబితా సిద్ధం !

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:38 AM

భీమవరం మావుళ్లమ్మ ఆలయ పాలకవర్గంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఇటీవల కాలం లో మావుళ్లమ్మ దేవస్థానం ఆదాయం గణనీయంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే అమ్మ వారి అలంకరణ కోసం ఆభరణాలు అధికమయ్యాయి.

మావుళ్లమ్మ సేవకు.. జాబితా సిద్ధం !

ప్రభుత్వానికి ఆలయ కమిటీ జాబితా

బోర్డు చైర్మన్‌ పదవి జనసేనకు..

నాగభూషణం పేరు ప్రతిపాదన

సభ్యుల్లో ఆరు టీడీపీకి.. మరో ఆరు జనసేనకు.. బీజేపీ పదవిపై తర్జనభర్జన

బోర్డులో ఇతర ప్రాంతాల వారికీ అవకాశం ఇచ్చే యోచనలో ప్రభుత్వం

ఇబ్బందులు ఉంటాయంటున్న స్థానిక నాయకత్వం

(భీమవరం–ఆంధ్రజ్యోతి):

భీమవరం మావుళ్లమ్మ ఆలయ పాలకవర్గంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఇటీవల కాలం లో మావుళ్లమ్మ దేవస్థానం ఆదాయం గణనీయంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే అమ్మ వారి అలంకరణ కోసం ఆభరణాలు అధికమయ్యాయి. బంగారం సమర్పించే భక్తులు పెరిగారు. భవిష్యత్తులో మావుళ్లమ్మకు బంగారు చీర ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో గుడికి భద్రతపై అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే అంజి బాబు ప్రస్తావించారు. ఈ క్రమంలో పాలకవర్గం ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం తరహాలోనే ఇక్కడ పాలకవర్గంలో ఇతర ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తే భక్తుల ఆదరణ మరింత పెరుగుతుందన్న భావనలో ప్రభుత్వం ఉంది. కాని, స్థానిక కూటమి నాయకత్వం మాత్రం మావుళ్లమ్మ ఆలయ పాలకవ ర్గాన్ని నియోజకవర్గ స్థాయిలోనే నియమించాలని పట్టుబడుతోంది. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లింది. అమ్మవారికి సేవ చేయడానికి

నియోజకవర్గంలో పోటీ పడుతుంటారు. ట్రస్ట్‌ బోర్డులో చోటు లభిస్తే చాలన్న భక్తులు ఎంతో మంది ఉన్నారు. చైర్మన్‌ పదవికి పోటీ మరింత అధికం. అందుకే ఈ పదవి నియామకం నాయకులకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పదవిని జనసేనకు కేటాయించారు. బంగారు నాగభూషణం పేరును ఖరారు చేస్తూ ట్రస్ట్‌ బోర్డు జాబితా ప్రభుత్వానికి వెళ్లింది. మొత్తం 13 మంది సభ్యుల్లో ఒకరు చైర్మన్‌ హోదాలో ఉంటారు. మిగిలిన 12 మందిలో ఆరుగురు సభ్యులను తెలుగుదేశం తరపున పంపారు. మరో ఆరుగురు సభ్యులను జనసేన నియమించేలా పేర్లు ఖరారయ్యాయి.

బీజేపీలో తెగని పంచాయితీ

బీజేపీకి మావుళ్లమ్మ ఆలయ కమిటీలో పేరు ఖరారు కాలేదు. పట్టణంలోని ఇతర ఆలయాల్లో ఐదుగురు సభ్యులు ఉండేలా పేర్లు నమోదుచేశారు. మావుళ్లమ్మ ఆలయంలోనూ బీజేపీ తరపున ఒకరికి సభ్యునిగా నియమించాలంటూ ఆ పార్టీ నుంచి ప్రతిపాదన వచ్చింది. సామాజిక వర్గాల సమతుల్యత విషయంలోనూ మల్లగుల్లాలు పడుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయం ఏమిటో..?

బోర్డు నియామకంలో ఇతర ప్రాంతాల వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న తలంపుతో ప్రభుత్వం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇతర దేవస్థానాలకు భీమవరం నియోజకవర్గం నుంచి పేర్లు అడిగారు. అదే తరహాలో మావుళ్లమ్మ ఆలయానికి ఇతర ప్రాంతాల నుంచి కమిటీలో అవకాశం కల్పించే అవకాశం వుంది. దీనిపై టీడీపీతో పాటు జనసేన నాయకత్వమూ వ్యతిరేకిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లారు. అయితే కమిటీ నియామకంలో ఎటువంటి మార్పులు, చేర్పులు ఉంటాయో చూడాలి.

Updated Date - Aug 07 , 2025 | 12:38 AM