Share News

ఉలికిపాటు..!

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:28 AM

మంగళవారం ఉదయం ఏలూరు నగరం ప్రశాంతంగా వుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా వున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. నగరంతోపాటు జిల్లా పోలీసులు అలర్ట్‌ అయ్యారు.

ఉలికిపాటు..!
మహిళా మావోయిస్టులను భవనం నుంచి బయటకు తీసుకొస్తున్న మఫ్తీలో ఉన్న మహిళా పోలీసులు

ఏలూరులో 15 మంది మావోయిస్టుల అరెస్టు

గ్రీన్‌సిటీలోని ఓ భవనంలో నెల రోజులుగా నివాసం

వీరిలో ఐదుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులు

వట్లూరు సమీపంలోని ప్రైవేటు హాస్టల్‌లో మరో విద్యార్థి..

ఎస్పీ కిశోర్‌ ఆధ్వర్యంలో మఫ్టీలో చుట్టుముట్టిన పోలీసులు

45 నిమిషాల్లో ముగిసిన ఆపరేషన్‌.. భారీ భద్రత మధ్య విచారణ

ఉలిక్కిపడిన ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు

ఏలూరు క్రైం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి) : మంగళవారం ఉదయం ఏలూరు నగరం ప్రశాంతంగా వుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా వున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. నగరంతోపాటు జిల్లా పోలీసులు అలర్ట్‌ అయ్యారు. అన్ని పోలీసు స్టేషన్‌లలో వున్న వారిలో ఎక్కువ మంది మఫ్టీలోకి మారిపోయారు. ఆఘమేఘాల మీద ఏలూరు మినీ బైపాస్‌లో ఉన్న కేకేఆర్‌ గ్రీన్‌ సిటీ సమీపానికి చేరుకున్నారు. వివిధ మార్గాల నుంచి ఒక్కొక్కరు అడుగులు వేసుకుంటూ వచ్చారు. కొందరు రోడ్లు తుడిచే వారుగా, మరికొందరు కూలీలుగా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఒక బిల్డింగ్‌ వద్దకు చేరుకున్నారు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. ఓ వైపు ఆకాశంలో డ్రోన్‌ కెమెరాలు ఎగురుతున్నాయి. ఆ ప్రాంతం వీధుల చివర పోలీసు జీపులు వచ్చి చేరుతున్నాయి. మరో 20 నిమిషాలు గడిచేసరికి గ్రీన్‌సిటీలో వున్న డోర్‌ నెంబర్‌ 22–136–9 వడ్లపూడి నాగభూషణాచార్యులు, పార్వతి ప్రసన్నం పేరు మీద ఉన్న శ్రీ సాయి నివాసం భవనాన్ని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ కె.ప్రతాపశివకిశోర్‌ సైతం మఫ్టీలో ప్రత్యక్షమయ్యారు. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, ఇతర ప్రాంతాల ఎస్‌ఐలు, సీఐలు, సిబ్బంది అక్కడే కనిపించారు. అంతలోనే విజయవాడ నుంచి వచ్చిన 30 మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు బులెట్‌ఫ్రూఫ్‌ జాకెట్లతో ఆ భవనంలోకి ఒక్కసారిగా ప్రవేశించారు. క్షణాల వ్యవధిలో లోపల ఐదుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులను ముసుగులు వేసి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే సిద్ధంగా వుంచిన బస్సులో వారిని ఎక్కించారు. ఇంతలో మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురి మృతి, పలుచోట్ల మావోయిస్టుల అరెస్ట్‌ల వార్తలు రావడంతో.. వీరు కూడా మావోయిస్టులు అయ్యి వుంటారని స్థానికులు భావించారు. వీరి ఊహించినది కరెక్టేనని తర్వాత పోలీసులు నిర్ధారించడంతో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఈ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌తో..

కోట్లాది రూపాయల రివార్డు వున్న మోస్టు వాంటెడ్‌ మావోయిస్టు నాయకుడు హిడ్మా, అతని భార్య, మరో నలుగురు మారేడుమిల్లిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. అక్కడ లభించిన డైరీ, ఇతర ఆధారాలతోనే ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నట్లుగా గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఏలూరులో షెల్టర్‌ జోన్‌గా తలదాచుకున్న 14 మంది మావోలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పెదవేగి డీటీసీకి తీసుకువెళ్ళి అక్కడ నుంచి సాయంత్రానికి జిల్లా పోలీస్‌ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆ తరువాత సాయంత్రానికి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నూతనంగా నిర్మించి ఉన్న మహిళా పోలీస్‌ స్టేషన్‌ భవనంలో ఉంచి వారిని విచారిస్తున్నారు. మరోవైపు విజయవాడ నుంచి ప్రత్యేక ఉన్నతాధికారుల బృందం వచ్చి వారిని విచారిస్తున్నట్లు సమాచారం. బుధవారం వారి అరెస్టును మీడియా ముందు ప్రవేశపెట్టే ఆవకాశాలు ఉన్నాయి. మావోయిస్టులను ఏలూరు నగరంలో అరెస్టు చేశారని తెలియడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. వీరంతా నెల రోజుల నుంచి ఈ భవనంలో వుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. పగటి వేళ ఒకరిద్దరు కనపడేవారని, రాత్రి రెండు గంటల వరకూ లైట్లు వెలుగుతూ ఏవో శబ్దాలు వినిపించేవని చెప్పారు. వారు ఎవరితోనూ మాట్లాడేవారు కాదన్నారు. వీరు జిల్లాకు ఎందుకు వచ్చారు ? వారి ఏం చేయబోతున్నారనేది తేలాల్చి వుంది. షెల్టర్‌ జోన్‌గా వినియోగించుకోవడానికి వచ్చి.. పోలీసులకు చిక్కినట్లు భావిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

అడవుల నుంచి ఏలూరు వైపు

మావోయిస్టుల కదలికలతో పోలీసులు అప్రమత్తం

ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు

ప్రైవేటు హాస్టల్స్‌, లాడ్జీలు, హోటల్స్‌పైన పోలీసు దృష్టి

ఏలూరు క్రైం/కుక్కునూరు నవంబరు 18(ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత హిద్మా సహా మరో ఐదుగురు మృతి చెందడం, ఏలూరు, విజయవాడ, కాకినాడ నగరాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడిన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా కేంద్ర ఇంటిలిజెన్స్‌ శాఖ గతంలోనే గుర్తించింది. ఏలూరు జిల్లాకు సరిహద్దుకు గోదావరి నది వుంది. దీనికి అవతల వైపు చత్తీస్‌ఘడ్‌, ఏపీలోని అల్లూరి జిల్లా, తెలంగాణ ఏజెన్సీ గ్రామాలున్నాయి. పోలీసులకు, మావోయిస్టులకు తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో షెల్టర్‌ జోన్‌గా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఉండే అవకాశం ఉందని పోలీస్‌ యంత్రాంగం నిఘా పెడుతోంది. కుక్కునూరు ఎస్‌ఐ రాజారెడ్డి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు(ఎస్‌పీఎఫ్‌) సిబ్బందితో వలస ఆదివాసి గ్రామాల్లో మంగళవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఆదివాసీలను కలిసి కొత్తగా ఎవరైనా గ్రామాలకు వచ్చారా ? అని ఆరా తీశారు. ఇంటింటికి తిరిగి పరిశీలిస్తున్నారు.

నగర ప్రాంతాలకు మావోలు

ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బలగాలు వరుస ఎన్‌కౌంటర్‌లతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేశారు. దీంతో వారికి పెద్ద ఎదురుదెబ్బ తగింది. అటవీ ప్రాంతం సురక్షితం కాదనుకున్నారో ఏమో కాని నగర ప్రాంతాల వైపు మావోలు దారి మళ్లించారు. సామాన్యులుగా, కూలీలుగా ఇళ్లను అద్దెకు తీసుకుని తమ కార్యకలాపాలు చాపకింద నీరులా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏలూరులోని కెకెఆర్‌ గ్రీన్‌ సిటీలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని, ఆ ఇంటికి సీసీ కెమెరాలు బిగించుకుని 14 మంది మావోలు ఇక్కడే ఉంటూ తమ కార్యకలాపాలు కొనసాగించారు. మరో విశేషం ఏమిటంటే వారు ఉన్న భవనానికి వంద మీటర్ల దూరంలోనే పోలీస్‌ శాఖకు అనుబంధంగా ఉన్న శాఖల్లో పనిచేసేవారు, వివిధ శాఖల అధికారులు నివాసాలు ఉన్నాయి. కానీ ఎవరికి అనుమానం రాకుండా నెల రోజుల నుంచి ఆ ఇంట్లో ఉంటూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటే ఎలాంటి జాగ్రత్త లు తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. వట్లూరులో మావోయిస్టు తలదాచుకున్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచా రం. ఇప్పటికే ఆ హాస్టల్‌ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లాలోని లాడ్జీలు, హోటల్స్‌, ప్రైవేటు హాస్టల్స్‌కు తనిఖీలు చేపట్టడానికి అన్ని రకాల చర్యలు చేపట్టారు.

రాష్ట్ర విభజనతో పెరిగిన భద్రత

ప్రశాంతంగా వుండే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను ఒకప్పుడు నక్సల్స్‌, మావోయిస్టులు షెల్టర్స్‌ జోన్‌గా వినియోగించే వారు. 2000 నుంచి సుమారు పదేళ్లపాటు పలు ఎన్‌కౌంటర్లు, అరెస్ట్‌లు జరిగినప్పటికి తర్వాత వారి జాడ తగ్గింది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జిల్లాలో పోలీసు నిఘా పెంచారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తరచు కూంబింగ్‌ నిర్వహించేవారు. 2014 రాష్ట్ర విభజనతో తెలంగాణ నుంచి రెండు ఏజెన్సీ మండలాలు ఏలూరు జిల్లాలోకి వచ్చాయి. పోలవరంలో ప్రాజెక్టు నిర్మాణంతో ముఖ్యమంత్రులు, అధికారులు, వివిధ దేశాల నుంచి ఇంజనీర్లు వస్తున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టి ఏజెన్సీలో కూంబింగ్‌ చేస్తూనే ఉన్నారు.

ఎన్‌కౌంటర్లు.. అరెస్ట్‌లు

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా వున్న సమయంలో కుక్కునూరు మండలంలోనే పలు ఘటనలు జరిగాయి. ఓసారి గుర్తు చేసుకుంటే.. కుక్కునూరు మండలంలో గతంలో మావోయిస్టుల ఉనికి బయటపడింది.

2006 జూన్‌ 6న మావోయిస్టులు కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌ను పేల్చి వేశారు. రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, కూంబింగ్‌ దళాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు.

రేగులచెరువు ఆదివాసి గ్రామంలో నాటు తుపాకులు తయారు చేస్తూ ఆదివాసీలు పోలీసులకు దొరికారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అప్పట్లో మండవ రామిరెడ్డి అనే కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిని మావోయిస్టులు హతమార్చారు.

2000 మార్చి 17న బుట్టాయిగూడెం మండలం జలతారు వాగు వద్ద జరిగిన మొదటి ఎన్‌కౌంటర్‌లో వరంగల్‌కు చెందిన ఇద్దరు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు, ఐదుగురు నక్సల్స్‌ మరణించారు. తర్వాత గూటాల ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ చనిపోయారు. 2008 నవంబరు వరకూ మొత్తం ఎనిమిది ఎన్‌కౌంటర్లు జరిగాయి.

2002 మేలో ఏలూరులో జడ్పీ వద్ద పోలీసుల తనిఖీల్లో ఐదుగురు మావోయిస్టులు చిక్కారు.

1998లో విజయవాడ నుంచి రాయగడ పాసింజర్‌ రైలులో టిఫిన్‌ బాక్సులో పేలుడు పదార్థాలను తీసుకుని వస్తుండగా ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో జారిపడి పలువురు సంఖ్యలో చనిపోయారు.

రాష్ట్ర విభజన అనంతరం మావోయిస్టుల ఉనికి కొంతమేర తగ్గింది. పలుమార్లు మావోయిస్టుల సాహిత్యానికి సంబంధించి పోస్టర్లు, కరపత్రాలు, వెలువడిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

Updated Date - Nov 19 , 2025 | 12:29 AM