Share News

మామి‘డీలా’..

ABN , Publish Date - May 27 , 2025 | 12:32 AM

మామిడి ధరలు పతనం కావడంతో రైతు లు గగ్గోలు పెడుతున్నారు. బంగినపల్లి మామిడి టన్ను రూ.15 వేలు, తోతాపురి (కలెక్టర్‌) రకం టన్ను రూ.ఐదు వేలకు పడిపోయింది. సీజన్‌ ప్రారంభంలో బంగినపల్లి టన్ను సుమారు రూ.లక్ష పలుకగా కలెక్టర్‌ రకం టన్ను దాదాపు రూ.50 వేలు వరకు పలికింది. కనీసం కోత కూలీ, రవాణా ఖర్చు లు చేతికి రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

మామి‘డీలా’..
చాట్రాయిలో మామిడి కాయల రాశులు

ధరలు భారీగా పతనం..

కోత కూలీ, రవాణా ఖర్చులూ గగనమే..

తీవ్రంగా నష్టపోయాం : రైతుల ఆవేదన

చాట్రాయి/నూజివీడు టౌన్‌ మే 26 (ఆంధ్ర జ్యోతి): మామిడి ధరలు పతనం కావడంతో రైతు లు గగ్గోలు పెడుతున్నారు. బంగినపల్లి మామిడి టన్ను రూ.15 వేలు, తోతాపురి (కలెక్టర్‌) రకం టన్ను రూ.ఐదు వేలకు పడిపోయింది. సీజన్‌ ప్రారంభంలో బంగినపల్లి టన్ను సుమారు రూ.లక్ష పలుకగా కలెక్టర్‌ రకం టన్ను దాదాపు రూ.50 వేలు వరకు పలికింది. కనీసం కోత కూలీ, రవాణా ఖర్చు లు చేతికి రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

మామిడి సీజన్‌లో ఏటా ఏప్రిల్‌ నుంచి మే వరకు జ్యూస్‌ ఫ్యాక్టరీలు ఎగబడి కొనడం వల్ల మార్కెట్‌లో ధరలు నిలకడగా ఉండేవి. అయితే ప్రస్తుత సీజన్‌లో జ్యూస్‌ ఫ్యాక్టరీల (పల్ప్‌ పరిశ్రమ)లో నిల్వలు పేరుకుపోయి ఉండడంతో ప్రస్తుత సీజన్‌లో కొనుగోలుకు ముందుకు రాలేదు. దీనికి తోడు మంగు తెగులు, కోడిపెను ఎక్కువగా ఉండడం, ఢిల్లీ సేఠ్‌ల మార్కె ట్‌ మాయాజాలంతో భారీగా ధరల పతనమైనట్టు చెబుతున్నారు. మరోవైపు అధిక దిగుబడులు ఆశిం చిన రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు విచక్షణా రహితంగా వినియోగించడంతో మామిడి పంటకు ముప్పు వచ్చింది. మంగు తెగులు ఆశించి కాయ నాణ్యత తగ్గిపోయి ధరలు పతనమై ఎగుమతులు ఆగిపోయాయి. మామిడి ధరల పతనానికి అకాల వర్షాలు మరో కారణంగా చెప్పవచ్చు. మే ప్రారంభం నుంచి వర్షాలు పడడంతో మామిడి నాణ్యత దెబ్బతింది.

ఆదుకుంటున్న ముక్కల పరిశ్రమ

కలెక్టర్‌ రకం మామిడికి ముక్కల పరిశ్రమ ఒక్కటే దిక్కైందని చెప్పవచ్చు. మ్యాంగో పల్ప్‌ యూనిట్‌ పరిశ్రమ నిర్వాహుకులు మామిడి కొనుగోలు చేయకపోవడంతో కలెక్టర్‌ రైతులను ముక్కల పరిశ్రమ ఆదుకుంటోంది. నూజివీడు పరిసరాల్లో దాదాపు నాలుగు పరిశ్రమలు ఉండ గా గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఇటు కలెక్టర్‌ రైతులకు కొంతమేర మార్కెట్‌ను అందిస్తోంది.

ప్రత్యామ్నాయ పంటల వైపు..

మామిడి సాగులో వరుస నష్టాలు వస్తుండడంతో చాలామంది రైతులు మామిడి తోటలు నరికి మొక్కజొన్న పామాయిల్‌ సాగు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు చాట్రాయి మండలంలో 25 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండేవి. ప్రస్తుతం మండలంలో సుమారు 7 వేల ఎకరాల్లో మాత్రమే తోటలు మిగిలాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మామిడి తోటలు పూర్తిగా కనుమరుగవుతాయని రైతులు వాపోతున్నారు.

మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి

మామిడి పంటకు ప్రభు త్వం మార్కెటింగ్‌ సదుపాయం కల్పించి, గిట్టుబాటు ధర అం దించకపోతే మామిడి సాగుకు మనుగడ ఉండదు. ఆరుగాలం కష్టపడి పండించి మార్కెట్‌కి తీసుకువెళితే అరకొర ధర వస్తోంది. కోత కూలీ, రవాణా ఖర్చులూ చేతికి రావడం లేదు. నష్టాలు భరించే స్థితిలో రైతులు లేరు. ప్రభుత్వం దీనిపై పరిశీలన చేసి మామిడి రైతులను ఆదుకోవాలి.

– ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, మామిడి రైతు, ఆరుగొలనుపేట, చాట్రాయి మండలం

Updated Date - May 27 , 2025 | 12:32 AM