అదరగొట్టారు
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:12 AM
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం, రాజ్యాంగ విలువలపై అవగాహన, తదితర ప్రయోజనాలే లక్ష్యంగా విద్యాశాఖ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఎంపిక చేసిన బాల ఎమ్మెల్యేలతో బుధవారం అమరావతి లో నమూనా అసెంబ్లీలో నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో జిల్లాకు చెందిన ఏడుగురు బాల ఎమ్మెల్యేలు ప్రత్యేకత, వాగ్ధాటిని కనబరిచారు.
మాక్ అసెంబ్లీకి జిల్లా విద్యార్థుల హాజరు
ఏలూరు అర్బన్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం, రాజ్యాంగ విలువలపై అవగాహన, తదితర ప్రయోజనాలే లక్ష్యంగా విద్యాశాఖ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఎంపిక చేసిన బాల ఎమ్మెల్యేలతో బుధవారం అమరావతి లో నమూనా అసెంబ్లీలో నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో జిల్లాకు చెందిన ఏడుగురు బాల ఎమ్మెల్యేలు ప్రత్యేకత, వాగ్ధాటిని కనబరిచారు. అచ్చం అసెంబ్లీ సమావేశాల మాదిరిగానే నిర్వహించిన మాక్ అసెంబ్లీ సమావేశంలో బాల ఎమ్మెల్యేలనుద్దేశించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ ప్రాధామ్యాలు, భావిభారత పౌరులుగా విద్యార్థుల బాధ్యతలపై ప్రసంగించి చైతన్యవంతం చేశారు. జిల్లా నుంచి మంత్రిగా ఎంపికైన ఉంగుటూరు మండలం పెదనిండ్రకొలను జడ్పీ హైస్కూలు విద్యార్థి గురుప్రసాద్‌కు యువజన, క్రీడలశాఖ మంత్రిత్వశాఖను కేటాయించారు. ఒలింపిక్స్‌లో పతకాలు ఆంధ్రప్రదేశ్/ భారతదేశం క్రీడాకారులు సాధించడానికి కార్యాచరణపై ప్రతిపక్ష బాల ఎమ్మెల్యే సంధించిన ప్రశ్నకు మంత్రి గురుప్రసాద్ ధీటైన సమాధాన మిచ్చారు. ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రభుత్వం తమది కాదని, ప్రజలతో ఆడించే ప్రభుత్వమని, ఆ మేరకు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటే రూ.50 లక్షలు, స్వర్ణపతకం సాధిస్తే రూ.10 కోట్లు, రజత పతక విజేతకు రూ.5 కోట్లు, కాంస్య పతకం సాధిస్తే రూ.3 కోట్లు ప్రోత్సాహక బహుమ తులుగా ముఖ్య మంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని మంత్రి సమాధానమివ్వడం సభలో హైలైట్‌గా నిలిచింది. విద్యా ర్థుల్లోవున్న నైపుణ్యా లను గల్లీనుంచి ఢిల్లీవరకు, ఒలింపిక్స్ వరకు తీసుకెళ్లి ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి జవాబిచ్చారు.
ఇక అసెంబ్లీ మార్షల్‌గా దెందులూరు నియోజకవర్గ విద్యార్థి పూర్ణగణేష్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నూజివీడు జడ్పీ హైస్కూలు విద్యార్థి గోపి నాగచైతన్య వ్యవహరించారు. అధికారపక్ష ఎమ్మెల్యేలుగా మణికంఠ (దెందులూరు), అశ్మితసాయి (కైకలూరు), ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా నిఖిల్‌సాయు (పోలవరం), కె.వంశిక (చింతలపూడి), జి.లిఖిత (ఏలూరు) వ్యవహరించారు. వీరందరికీ పతకాలు, సర్టిఫికెట్లు, బాల రాజ్యాంగం బహుమతు లుగా అందజేశారు. జిల్లా బాల ఎమ్మెల్యేల బృందానికి గైడ్ టీచర్లుగా పెదనిండ్రకొలను జడ్పీ హైస్కూలు ఉపాధ్యాయుడు కె.సుబ్బరాజు, రంగాపురం జడ్పీ హైస్కూలు టీచరు జి.రమణి వ్యవహరించారు. నిజమైన శాసనసభలో బాల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహణకు నిబంధనలు అంగీకరించనందున శాసనసభ ఆవరణ లోనే వేసిన సెట్టింగ్‌లో మాక్ అసెంబ్లీ సమావేశం జరిగింది. నమూనా అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం విద్యార్థులందరినీ నిజమైన శాసనసభ, శాసనమండలి హాల్స్‌కు తీసుకెళ్లి ప్రత్యక్షంగా చూపించి, అన్ని విభాగాల గురించి వివరించారని గైడ్ టీచర్లు తెలిపారు.