మైప ఎత్తిపోతలు.. మూలనపడింది
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:36 AM
దాహార్తి తీర్చేది.. పంటలు ఇచ్చేది నీరే. రైతులకు నీరందిం చేందుకు రూ.14.7 కోట్లతో నీటిపారుదల సంస్థ ద్వారా నిర్మించిన మైప ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా పడి ఉంది.
నిర్మించిన రెండేళ్లకే మూలనపడిన ఎత్తిపోతల పథకం
తప్పని సాగు నీటి కష్టాలు
పాలకోడేరు, జూన్ 2(ఆంధ్రజ్యోతి): దాహార్తి తీర్చేది.. పంటలు ఇచ్చేది నీరే. రైతులకు నీరందిం చేందుకు రూ.14.7 కోట్లతో నీటిపారుదల సంస్థ ద్వారా నిర్మించిన మైప ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా పడి ఉంది. సుమారు ఆరు గ్రామాల్లో 3,100 ఎకరాలకు సాగు నీరందిం చేందుకు 2013లో అప్పటి టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు శంకుస్థాపన చేశారు. నిర్మాణం పథకాన్ని పూర్తిచేసి వాడుకలోకి తీసుకువచ్చారు. పాలకోడేరు మండలం మైప, కోరుకొల్లు, గరగపర్రుతో పాటు యండగండి, అత్తిలి మండలంలోని స్కిన్నెరపురం, ఈడూరు గ్రామాలకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించడం లక్ష్యం. ఈ పథకం రైతులకు అంతంత మాత్రం ఉపయోగపడింది. తర్వాత రెండేళ్లకే ఎందుకూ పనికిరాకుండాపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యండగండి గ్రామం సమీపాన యనమదుర్రు డ్రెయిన్ నుంచి యండగండి, మైప, కోరుకొల్లు, స్కిన్నెరపురం, ఈడూరు వరకు సుమారు 7.5 కిలోమీటర్లు పంట పొలాల్లో నుంచి పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. పైప్‌లైన్ ద్వారా పాలకోడేరు, అత్తిలి మండలాల్లో శివారు ప్రాంతాలకు సాగునీరు అందించేలా ఏర్పాట్లు చేశారు.
ఉప్పునీటితో ఇబ్బందులు
రూ. 14.7 కోట్లతో ఏర్పాటుచేసిన ఈ ఎత్తిపోతల పథకం ద్వారా యనమదుర్రు డ్రెయిన్ నుంచి మూడు భారీ మోటార్లతో సాగునీరును తోడుతూ ఉండేవారు. యనమదుర్రులో ఉప్పునీరు రావడంతో తమ పంట పొలాలు నాశనమవుతున్నాయని అప్పట్లోనే రైతులు గగ్గోలు పెట్టారు. కొంత కాలం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తోడినా రైతులకు అంతంత మాత్రంగానే ప్రయోజనం రావడంతో ఆసక్తి కనబర్చలేదు. కొన్ని రోజులకు ఇంజన్లు పాడవడంతోపాటు పైప్‌లైన్‌లో మరమ్మతులు చేయకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం, స్టార్టర్స్ పాడవడంతో ఆ పథకం మూలనపడింది.
నిర్మించారు... పట్టించుకోలేదు
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పథకాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ గాలి కొదిలేశారు. ఇరిగేషన్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో కోట్ల రూపా యలతో నిర్మించిన పథకం వృథాగా పడి ఉంది. దీనికి తోడు వైసీపీ ప్రభుత్వ హయాంలో పంట కాలువలను తవ్వకపోవడం, వాటిపై శ్రద్ధ చూపకపోవడంతో రైతులకు సాగునీరందక నేటికీ నానా పాట్లు పడుతూనే ఉన్నారు. ఓవైపు కోట్లాది రూపాయలతో నిర్మించిన ఎత్తిపోతల పథకం మూలనపడగా, సాగు నీరందించే పంట కాలువలు సైతం పూడుకుపోవడంతో ఆయా ప్రాంత రైతులు సాగునీటి కోసం అల్లల్లాడుతున్నారు. మూలనపడిన ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ పథకానికి మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు పుష్కలంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నిర్వహణ లేదు
ఇరిగేషన్ నిధులు రూ. 14.7 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించారు. నిర్వహణ గాలికొదిలేయడంతో ఎందుకూ పనికిరాకుండాపోయింది. నిర్మించిన రెండేళ్లకే మూలనపడడం విచారకరం. రైతులకు ప్రయోజనం చేకూర్చాలని నిర్మించారు కాని, దానిని ఆచరణలో పెట్టడంలో మాత్రం మరిచారు. దీంతో రైతులమంతా చాలా ఇబ్బందులు పడ్డాం.
గాదిరాజు శ్రీనివాసరాజు, కోరుకొల్లు
మరమ్మతులు చేయలేదు
ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరందించేందుకు చాలాకాలం నేనే మోటార్లను ఆపరేట్ చేశా. ఇంజన్లు, స్టార్టర్స్ పాడవడంతో వాటిని మరమ్మతులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇక వదిలేశాం. కాలువల ద్వారా వచ్చే నీటినే ఇంజిన్లు, కారెముల ద్వారా తోడుకుని పంటను సాగు చేసుకున్నాం. ఈ పథకాన్ని వాడుకలోకి తీసుకువస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
కర్తాక ఏసురాజు