Share News

మహా మాయగాడు మన గుగాంపు

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:24 AM

అతడు వేదికపై ఉన్నాడంటే మన కళ్లు మనల్ని మోసం చేస్తాయి.

మహా మాయగాడు మన గుగాంపు

అంతర్జాతీయ వేదికలపై ఇంద్రజాల ప్రదర్శన

ప్రతిష్టాత్మక అమెరికా మెర్లిన్‌ అవార్డు కైవసం

స్వస్థలం ఆచంట వేమవరం

దుబాయ్‌లో స్థిర నివాసం

అతడు వేదికపై ఉన్నాడంటే మన కళ్లు మనల్ని మోసం చేస్తాయి. నిజమా.. మాయా.. అనే సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసే మహా మాయగాడు మన గుగాంపు. కర్ర కదిపితే పూల బొకే ప్రత్యక్షమవుతుంది. ఖాళీ జగ్గు నుంచి నీళ్లు పోస్తాడు. అతడి మ్యాజిక్‌తో రెండు గంటల పాటు మాయ చేసేస్తాడు. ఆచంట మండలం ఎ.వేమవరం గ్రామానికి చెందిన గుడాల గాంధీ పుష్కరుడు గుగాంపు పేరుతో మెజీషియన్‌గా చిరపరిచితుడు. దుబాయ్‌లో స్థిరపడిన గుగాంపు ఇంద్రజాలంలో అనేక అవార్డులు అందుకున్నారు. తాజాగా మ్యాజిక్‌లో అత్యున్నత పురస్కారమైన అమెరికన్‌ మెర్లిన్‌ అవార్డు అందుకున్నారు. రెండు సార్లు ఈ అవార్డు అందుకున్నట్లు గర్వంగా చెబుతారు.

ఆచంట, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): మండలంలో ఆచంట వేమవరం గ్రామానికి వెళ్లి ఎవరినైనా గుడాల గాంధీ పుష్కరుడి గురించి అడిగితే ఐదు నిమిషాలు ఆలోచిస్తారు. గుగాంపు అని అడిగితే అర క్షణంలో అందరూ చెబుతారు. స్వగ్రామంలోనే కాదు ఎక్కడైనా గుగాంపు పేరు చిరపరిచితం. ఆచంట వేమవరం గ్రామానికి చెందిన అంతర్జాతీ య ఇంద్రజాలికుడు డాక్టర్‌ గుగాంపు (గుడాల గాంధీ పుష్కరుడు) దుబాయ్‌లో స్థిరపడ్డారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఇంద్రజాల ప్రదర్శనతో ప్రతిభ కనబరిచిన గుగాంపు అంతర్జాతీయ స్థాయి లో రాణిస్తున్నారు. ఇటీవల అమెరికా లాస్‌వేగాస్‌లో ప్రతిష్టాత్మక మెర్లిన్‌ అవార్డును కైవసం చేసుకున్నారు. అనంతరం ఫోన్‌ ద్వారా గ్రామస్తులు, బంధువులతో ఆనంద క్షణాలను పంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాల నుంచి 37 మంది అంతర్జాతీయ ఇంద్రజాలికులు ఈ అవార్డుకు ఎంపి కైనట్లు ఆయన వివరించారు. విశాఖపట్టణానికి చెందిన బీఎస్‌రెడ్డితో పాటు తాను మ్యాజిక్‌లో అత్యున్నత పురస్కారం అమెరికన్‌ మెర్లిన్‌ అవార్డు అందుకున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్‌ మెజిషియన్‌ సొసైటీ చైర్మన్‌ టోని ఆశీని నుంచి అవార్డును స్వీకరించడం మాటల్లో చెప్పలేనంత అనుభూతి కలిగిందన్నారు. 2016లో మొదటిసారి ఈ అవార్డు తీసుకున్నట్లు తెలిపారు. తాను ఎంచుకున్నరంగంలో అత్యున్నత స్థాయికి ఎదగడంలో ముఖ్యభూమిక పోషించిన మాతృదేశం, స్వగ్రామానికి ఎపుడూ రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.

Updated Date - Aug 23 , 2025 | 12:24 AM