Share News

కుంచనపల్లిలో మ్యాజిక్‌ డ్రెయిన్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:28 AM

మండలంలోని కుంచనపల్లి గ్రామంలో మ్యాజిక్‌ డ్రెయిన్‌ నిర్మాణం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది.

కుంచనపల్లిలో మ్యాజిక్‌ డ్రెయిన్‌
కుంచనపల్లిలో రోడ్డుపై మురుగు

జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక

ఇంకుడు గుంతలతో డ్రెయిన్‌

మురుగు సమస్యకు చెక్‌

కార్యాచరణ సిద్ధం

తాడేపల్లిగూడెం రూరల్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని కుంచనపల్లి గ్రామంలో మ్యాజిక్‌ డ్రెయిన్‌ నిర్మాణం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. తక్కువ ఆదాయం కలిగిన గ్రామాలకు మ్యాజిక్‌ డ్రెయిన్లు వరంగా మారనున్నాయి. ఈ తరహా మేజిక్‌ డ్రెయిన్‌ ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం సోమవరంలో ప్రయో గాత్మకంగా నిర్మించారు. వీటి ద్వారా గ్రామాల్లో మురుగునీటి సమస్య పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

మ్యాజిక్‌ డ్రెయిన్‌ అంటే..

మురుగునీరు ఇంకుడు గుంతలకు మళ్లించి.. శుభ్రంచేసి వాటిని భూగర్భ జలాలకు మళ్లించేవిధంగా డ్రెయిన్‌ నిర్వహించనున్నారు. ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటుచేసి అక్కడ నుంచి కచ్చా డ్రెయిన్‌ ఏర్పాటు చేస్తారు. మురుగు రోడ్లపైకి రాకుండా ఇంకుడు గుంతల్లో చేరుతుంది. రోడ్డుపై మురుగు లేకుండా చేసేదే ఈ మ్యాజిక్‌ డ్రెయిన్‌.

జిల్లాలో తాడేపల్లిగూడెం మండలం కుంచ నపల్లిలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఉపాధి హామీ పథకం జిల్లా స్థాయి అధికారు లు గ్రామంలో మ్యాజిక్‌ డ్రెయిన్‌ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించారు. మెట్ట, డెల్టా ప్రాంతాల వాతావరణం ఉన్న కుంచనపల్లిలో ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తే జిల్లా అంతటా ఈ ఫలితాల ద్వారా ముందు కు వెళ్లవచ్చని డ్వామా అధికారులు భావిం చారు. గ్రామంలో 6వేల జనాభా, 1650 గృహాలు ఉన్నాయి. గ్రామంలో మురుగు నీరు రోడ్లపైకి ప్రవహించడంతో నీటి కాలుష్యం పెరుగుతోంది. మ్యాజిక్‌ డ్రెయిన్‌ ఏర్పాటుచేసి ఆ సమస్య పరిష్కరించి విజయవంతంగా జిల్లా అంతటా ప్రారంభించేందుకు వీలుంటుం దని అధికారులు భావిస్తున్నారు.

గ్రామంలో 400 మీటర్లలో ఉపాధి హామీ పథకంలో కచ్చా డ్రెయిన్‌, ఇంకుడు గుంతలు తవ్వేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ డ్రెయిన్‌ ద్వారా ఆ ప్రాంతంలో మురుగునీటి సమస్య పోవడంతో పాటు తరచూ డ్రెయిన్లు శుభ్రంచేసే అవసరం ఉండదు. గ్రామం మురుగునీరు రహితంగా తయారుకానుంది.

Updated Date - Jul 21 , 2025 | 12:28 AM