అల్పపీడనం.. జోరు వర్షాలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:03 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
గోదావరి ఉధృతితో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పార్థసారథి
ఏలూరుసిటీ, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్పపీడనం వాయు గుండంగా మారనుందని, మంగళవారం నుంచి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈనెల 24 వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
గోదావరి వరద నేపఽథ్యంలో కలెక్టరేట్‌లో 1800–233–1077, 94910 41419 ఫోన్ నంబర్లతో, జంగారెడ్డి గూడెం ఆర్డీవో కార్యాలయంలో 83092 69056 నంబర్‌తోను, నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08656– 232717 నంబర్లతో ప్రత్యేక కంట్రోలు రూమ్స్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. అత్యవసర సమయంలో వినియోగం నిమిత్తం మోటార్ బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఉరు ములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవ్వరూ ఉండరాదని సూచించారు.
1,542 హెక్టార్లలో వరి పంట ముంపు
వర్షాల కారణంగా జిల్లాలో 1,542 హెక్టార్లలో వరి పంట ముంపునకు గురైంది. ఇందులో 10 హెక్టార్లలో వరి నారుమళ్లు, 1,532 హెక్టార్లలో వరి నాట్లు వేసిన పంట పొలాలు ముంపు నకు గురయ్యాయి. పెదపాడు, ముదినేపల్లి, ఉంగుటూరు, నిడమర్రు, భీమడోలు, ఏలూరు, కామవరపుకోట, దెందులూరు, పెదవేగి తదితర మండలాల్లోని 50 గ్రామాల్లో 2,052 మంది రైతులకు సంబంధిం చిన వరి పంట పొలాలు ముంపు నకు గురయ్యాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు జిల్లా వ్యవసాయ శాఖాధికారి షేక్ హబీబ్ బాషా తెలిపారు. జిల్లాలో సార్వా వరి సాగులో ఇప్పటివరకు 1,092 హెక్టార్లలో వరి నారుమళ్లు, 32,494 హెక్టార్లలో వరి నాట్లు వేశారన్నారు. మిగిలిన పంటల పరిస్థితి బాగానే ఉందన్నారు.
జాగ్రత్తగా ఉండండి ఎస్పీ కేపీఎస్ కిశోర్
ఏలూరు క్రైం : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాయుగుండం నేపథ్యంలో అధిక వర్షాలు పడడం, గోదావరి నది వాగులు వంకలు, పరివాహక ప్రాంతాల్లో వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించే సమయంలో వాహనాలు నీటి ప్రవాహ వేగాన్ని గమనిస్తూ ఉండాల న్నారు. కాలువలు, వాగులు దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. ఏదైనా అత్యవసర పోలీస్ సహాయం పొందడానికి డయల్ 112, 83329 59175కు సమాచారం అందిస్తే తక్షణమే పోలీసులు చేరుకుంటా రన్నారు. ఏ ప్రదేశంలోనైనా విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వెంటనే విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు లేదా పోలీస్ సహాయం కోసం 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.
జిల్లాలో వర్షపాతం వివరాలు
గత 24 గంటల్లో అత్యధికంగా వేలేరుపాడు మండలంలో 19.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లాలో సరాసరి వర్షపాతం 9.4 మి.మీగా నమోదైంది. ఉంగుటూరు 17.6, పోలవరం 16, కొయ్యలగూడెం 15.4, జంగా రెడ్డిగూడెం 12.6, టి.నరసాపురం 12.4, చాట్రా యి 12.2, కామవరపుకోట 12.2, చింతలపూడి 10.6, ముసునూరు 10.2, నిడమర్రు 9.8, ఏలూరు రూరల్ 8.8, ఆగిరిపల్లి 8.6, జీలుగుమిల్లి 8.6, బుట్టాయిగూడెం 8.6, భీమడోలు 8.6, దెందులూరు 8.4, ద్వారకాతిరుమల 7, పెదవేగి 6.8, ఏలూరు అర్బన్ 6.8, లింగపాలెం 6.4, కలిదిండి 6.2, ముదినేపల్లి 5.8, పెదపాడు 5.6, నూజివీడు 5.2, కుక్కునూరు 4.6, మండవల్లి 4.4, కైకలూరు 3.2 మి.మీ వర్షపాతాలు నమోదయ్యాయి.