శ్రీవారి క్షేత్రంలో పచ్చదనం
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:22 AM
ప్రముఖ క్షేత్రమైన ద్వారకాతిరుమలకు వచ్చిన భక్తులకు పచ్చదనం కనువిందు చేస్తోంది. క్షేత్రంలో అడుగెట్టే వారికి లక్ష్మీపురం ఆలయం నుంచి ప్రధాన ఆలయం వరకు అడుగడుగునా పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది.
త్వరలో గ్రీన్‌సిటీగా చిన్నతిరుపతి
సందర్శకులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదానికి అధిక ప్రాధాన్యం
నిత్యజీవితంలో మనం ఎన్నో ఒత్తిళ్లకు, ఉద్రిక్తలకు గురతుంటాం. ఆ సమయంలో వాటి నుంచి మన మనసును మళ్లించేందుకు ఏదైనా ఒక పుణ్య క్షేత్రానికో లేదా ఆహ్లాదాన్నిచ్చే ప్రదేశానికో వెళ్లాలని చూస్తుంటాం. అక్కడకు వెళ్లి దైవ దర్శనం, ఆ తరువాత శిల్ప సౌందర్యాలు, పచ్చదనాన్ని చూసి పరవశించిపోతాం. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల టెన్షన్లకు, ఒత్తిళ్లకు తాత్కాలికంగా బైబై చెప్పేస్తాం.. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం.. ఈ విధంగా ద్వారకాతిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచేందుకు అఽధికారులు అనేక ఉద్యానవనాలు, పచ్చికబయిళ్లు ఏర్పాటుచేసి. శ్రీవారి క్షేత్రాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు తీసుకున్న చర్యలు ఊపందుకున్నాయి. ఇందుకు పలువురు దాతలు భాగస్వామ్యులవుతున్నారు. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
ద్వారకాతిరుమల, జూలై 22 (ఆంధ్రజ్యోతి):
ప్రముఖ క్షేత్రమైన ద్వారకాతిరుమలకు వచ్చిన భక్తులకు పచ్చదనం కనువిందు చేస్తోంది. క్షేత్రంలో అడుగెట్టే వారికి లక్ష్మీపురం ఆలయం నుంచి ప్రధాన ఆలయం వరకు అడుగడుగునా పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. ఈ క్రమంలో డివైడర్‌ల మధ్యలో ఇతర క్రోటన్‌తో పాటు ఎంతో ఖరీదైన ఫాక్స్‌టైల్ పామ్ మొక్కలను వేశారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సెంట్రల్ పార్కింగ్ వద్ద విజయవాడకు చెందిన వరుణ్ గ్రూప్ సంస్థ కంపెనీకి చెందిన దాత సుమారు రూ.5లక్షలు విలువైన గరుడపక్షి దాని చుట్టూ అవెన్యూ ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేయడంతో వీక్షించే భక్తులు పరవశిస్తున్నారు.
టోల్‌గేట్ సమీపంలో దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో మాధవకుంట వరకు జపనీస్ హార్టికల్చర్ ప్రాసెస్‌ను అనుసరించి మియావాకీ ఫారెస్ట్ మెథడ్‌తో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు దేవస్థానం ఈఈ డీవీ భాస్కర్, డీఈ టి.సూర్యనారా యణ ఆంధ్రజ్యోతికి తెలిపారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెరిగి డీప్ ఫారెస్ట్‌గా ఇవి కనిపిస్తాయి. రెండు అడుగుల వరకు ఎదిగిన తర్వాత భూమిలోని వేర్లు కలవడంతో మొక్కలు పైకి సమష్టిగా పెరిగి ఫారెస్ట్‌లా ఉంటుందని తెలిపారు. దాదాపు ఐదు వేల మొక్కలు వేస్తున్నామని వివరించారు. ఈ మొక్కలు పెరిగితే పక్షులకు, ఇతర ప్రాణులకు ఆవాసాలుగా ఉంటాయి.
ఈక్రమంలో గుమ్మడి టేకు, సీమతంగేడు, బాదం, వేప, వేగిస, మర్రి, మారేడు, నల్లేరు, నేరేడు, చింత, జామ, వెలగ, ఉసిరి, ఆకాశమల్లి, చిన్న అశోక, ఔషధ మొక్కలైన బ్రహ్మి, మండూకపర్ణి, వట్టివేరు. పసుపు, అల్లం, నిమ్మగడ్డి వంటి పలు మొక్కలను వేస్తామ న్నారు. ఇంకా పలు రకాలు త్వరలో వస్తాయని వివరించారు. సాధారణంగా మార్జిన్‌లో వేసే దొరంతా క్రోటన్‌కు బదులుగా ఎక్కడా లేని విధంగా ‘రాణి చిన్నమ్మారావు సత్రం, వేదపాఠశాల’ తదితర ప్రాంతాల్లో కరివేపాకు మొక్కలను వేశామ న్నారు. దీనివల్ల సువాసనతో పాటు గ్రీనరీగా ఉంటుం దన్నారు. ఈ మొక్కలను కటింగ్ చేసినప్పుడు వంటకాల్లోకి ఉపయోగపడతాయి.