శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:37 AM
ప్రముఖ క్షేత్రం చిన్నతిరుమ లేశుని ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు గురువారం రాత్రి వైభ వంగా ప్రారంభమయ్యాయి.
ద్వారకాతిరుమల,ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ప్రముఖ క్షేత్రం చిన్నతిరుమ లేశుని ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు గురువారం రాత్రి వైభ వంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ యాగశాలలో జరిపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్చకులు యాగశాల వద్ద శ్రీవారు, అమ్మవార్ల మూర్తులను ఉంచి అలంకరించారు. ఆలయ ఆవరణకు పుట్ట మన్నును తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలికల్లో ఉంచారు. అక్కడ పవిత్రాలను ఉంచి పూజలు చేశారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాలు, అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ నవధాన్యాలను పాలికల్లో పోశారు. దీంతో అంకురార్పణ ముగిసింది. అనంతరం మండపారాధన నిర్వహిం చారు. ఆలయంలో ఏడాదిపొడవునా తెలిసి. తెలియక జరిగిన తప్పుల ప్రాయఃచిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం పరిపాటి. శుక్రవారం ఆలయంలో పవిత్రాధివాసం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు.