Share News

వీధి వ్యాపారులకు చేయూత

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:03 AM

వీధివ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది.

వీధి వ్యాపారులకు చేయూత

పీఎం స్వనిధి ద్వారా రుణాలు

జిల్లాలో 3,617 మందికి లక్ష్యం

ఇప్పటివరకు మంజూరైనవి 1,907

రుణం ఇచ్చింది. రూ.1.90 కోట్లు

భీమవరం టౌన్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): వీధివ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. పీఎం స్వనిధి సంకల్ప ద్వారా బ్యాంకు రుణాలు మంజూరు చేయించి ఆర్థికంగా చేయూత ఇచ్చేం దుకు ప్రయత్నం ప్రారంభించింది. బ్యాంకులు అనుకున్నంత వేగంగా రుణాలు మంజూరు చెయకపోవడంతో ప్రత్యేకడ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 3వ తేదీ నుంచి ప్రారంభించారు. వచ్చే నెల 2 వరకు ఈ డ్రైవ్‌ చేపట్టనున్నారు. జిల్లాలో నూరుశాతం రుణాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు.పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో అన్ని మునిసిపాలిటీలలో పీఎం స్వనిధి సంకల్ప అభి యాన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. సర్వే ద్వారా గుర్తిం చిన వీధి విక్రయదారులకు దరఖాస్తులు చేయడం, బ్యాంక్‌లలో పెండింగ్‌లో ఉన్న రుణాలు మంజూరు చేస్తున్నారు. జిల్లా మొత్తం మీద 3,617 మందికి రుణాలు మంజూరు చేయించాల్సి ఉంది. సీఎం స్వనిధి సంకల్ప పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకులకు పంపిన దరఖాస్తులకు సకాలంలో రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చేనెల 2వ తేదీ లోపు నూరు శాతం రుణాలు మంజూరు చెయ్యాలని కలెక్టర్‌ నాగరాణి ఆదేశాలు జారీచేశారు. దీంతో మెప్మా అధికారులు మునిసిపాల్టీల వారీగా రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

వీధి విక్రయదారులకు క్రెడిట్‌ కార్డులు

మొదటి, రెండు విడతల రుణాలు తీసుకుని పూర్తిగా చెల్లించిన వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా క్రెడిట్‌ కార్డు సౌకర్యాన్ని మెప్మా అధికారులు కల్పిస్తున్నారు. ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.30 వేల వరకు ఖర్చు చేసుకోవచ్చు. మొదటిసారి రుణం తీసుకునేవారికి బ్యాంకులు గతంలో రూ.10 వేలు రుణంగా ఇచ్చేవి. ఇప్పుడు దానిని రూ.15 వేలకు పెంచారు. రెండో విడతలో రూ.20 వేల నుంచి 25 వేలకు మూడో విడతలో రూ.50 వేలు వరకు అందించనున్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే వడ్డీ రాయితీ 7 శాతం అదనంగా ఇస్తారు. తక్కువ ప్రీమియంతో ఇన్య్సూరెన్స్‌ సౌకర్యం నమోదు చేస్తారు.

Updated Date - Nov 27 , 2025 | 12:03 AM