మా గోడు వినండి!
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:51 AM
నూజివీడును చదువులవీడుగా మార్చిన నాటి జమీందారి దాతృత్వం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పునకు నూజివీడు ప్రాంతవాసులు బలి పశువులయ్యారు.
నూజివీడు రామాయమ్మరావుపేటలో వందమంది ఆవేదన
బాధితుల పాలిట శాపంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ
తప్పును సరి చేయడంలో అధికారుల మీనమేషాలు
నిషేధిత జాబితాలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు
నూజివీడు, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): నూజివీడును చదువులవీడుగా మార్చిన నాటి జమీందారి దాతృత్వం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పునకు నూజివీడు ప్రాంతవాసులు బలి పశువులయ్యారు. నివేశనా స్థలాలుగా క్రయ విక్రయాలు జరిగి రిజిస్టర్ అయిన భూమిని వ్యవసాయ భూములుగా అదీ జిల్లా పరిషత్ భూమిగా పేర్కొంటూ 22ఏలో చేర్చారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ ఏళ్ల తరబడి బాధితులు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. స్వాతంత్ర్యానికి ముందు నూజివీడులో ఎస్‌ఆర్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఏర్పాటుకు సంబంధించి పాఠశాల ట్రస్టీగా ఉన్న ఉయ్యూరు ఎస్టేట్ జమిందార్ 1937లో నూజివీడులోని రామాయమ్మరావుపేట (ఆర్‌ఆర్‌పేట)లోని సుమారు 4.53 ఎకరాల భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించారు. సదరు విక్రయ దస్తావేజుల్లో పాఠశాల అభివృద్ధి నిర్మాణ కార్యక్రమా లకు అంటూ పేర్కొన్నారు. అనంతరం పదేళ్లకు దేశా నికి స్వాతంత్రం రాగా ఆపై ఐదేళ్లకు భూ రికార్డులను రెవెన్యూ అధికారులు పొందుపరిచారు. అప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ 1937లోనే నివేశ్న స్థలా లుగా క్రయ విక్రయాలు జరిగి రిజిస్టర్ అయిన భూమిని వ్యవసాయ భూములుగా అదీ జిల్లా పరిషత్ భూమిగా నమోదు చేశారు. రెవెన్యూ రికార్డుల ఆధా రంగా 2024లో ఆ భూమిని తమ భూములుగా భావిస్తూ జడ్పీ తమ ఆస్తుల జాబితాలో కలపడంతో రామాయమ్మరావుపేటలోని నివాస గృహాలు నిర్మించు కుని ఉంటున్న దాదాపు 100 మంది పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 2018లో అప్పటి కృష్ణ జిల్లా కలెక్టర్ ఆ భూములను పేరడంగళ్ ఆధారంగా జిల్లా పరిషత్ భూములుగా పేర్కొంటూ 22ఏలో చేర్చారు. నూజివీడు నడిబొడ్డున కోట్లాది రూపాయలు విలువ చేసే ఆ ప్రైవేటు భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చడంపై తమ ఆవేదనను తెలుపుతూ నిషేధిత జాబితా నుంచి తొలగించమని ఆ ప్రాంతవాసులు అప్పట్లోనే కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం జిల్లాల పున ర్వ్యవస్థీకరణ చేస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజి వీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలపడంతో అప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తులు చేసిన 22ఏ బాధితుల పరిస్థితి తిరిగి మొదటికి వచ్చింది. మరల బాధితులంతా ఏలూరు జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. బాధితుల గోడును అర్థం చేసుకుని విచారణ జరిపి తప్పును సవరించాల్సిందిగా అటు ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇటు ఏలూరు జిల్లా కలెక్టర్లు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సీఈవోకి లేఖ రాయడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ తొలుత ఆ ఆస్తిని తమది కాదని పేర్కొంటూ లేఖ ఇచ్చారు. అనంతరం ఏం జరిగిందో తెలియదు గాని రెవెన్యూ రికార్డుల ఆధారంగా 2024లో ఆ భూమిని తమ ఆస్తిగా పేర్కొంటూ రికార్డుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ అఽధికారులు పొందుపర్చడం గమనార్హం.
కమిటీలతో సరి..
రామాయమ్మరావుపేట 22ఏ భూముల సమస్య విషయంలో కమిటీ నియామకంతోనే కాలయాపన జరుగుతోంది. తొలుత పంచాయతీరాజ్, ఎంఈవోలతో కమిటీని వేయగా వారు నివేదికను అందించారు. జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు తిరిగి మరో కమిటీని వేయడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మరోవైపు ఏలూరు జిల్లా కలెక్టర్ ఆ భూమి జిల్లా పరిషత్‌ది కాదని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ నుంచి కౌన్సిల్ తీర్మానం కోరారు. అయితే ఒక జిల్లా అధికారి ఆదేశాలను మరో జిల్లా పరిషత్ ఆచరించడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సీఈవో, ఇతర అధికారులు వాస్తవ భూముల వివరాలను గుర్తించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
జీవోతో న్యాయం జరిగేనా..
రాష్ట్ర ప్రభుత్వం 22ఏ భూముల జాబితా సవరణకు సంబంధించి ఇటీవల ఇచ్చిన జీవోతో తమకు న్యాయం జరిగే అవకాశం ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. స్వాంతంత్రానికి ముందు రిజిస్టర్ అయిన భూములను జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తమ ఆదేశాల్లో పేర్కొంది. దీనిని అధికారులు ఆచరణలో పెడితే అనేక మంది 22ఏ బాధితులకు ఊరట లభించే అవకాశం ఉంటుంది.