లిక్కర్ కిక్కు!
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:48 PM
మద్యం షాపులకు అధికారులు నెలవారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. గతేడాది కొనుగోళ్లకు తగ్గట్టుగానే ఈసారి నిల్వ ఉంచాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. అదే ఇప్పుడు లైసెన్స్‌దారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో షాపులకు అమ్మకాలు అంతగా ఉండడం లేదు.
మద్యం షాపులకు టార్గెట్‌లు
రెండు నెలల నుంచి లైసెన్స్‌దారులపై ఒత్తిళ్లు
ఒక్కో షాపులో రూ. 80 లక్షలు కొనుగోళ్లు
నెలలో భర్తీ చేయాల్సిందే
అమ్మకాలు లేవంటూ లబోదిబోమంటున్న లైసెన్స్‌దారులు
కమీషన్ పెంచుతారంటూ ఆశలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
మద్యం షాపులకు అధికారులు నెలవారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. గతేడాది కొనుగోళ్లకు తగ్గట్టుగానే ఈసారి నిల్వ ఉంచాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. అదే ఇప్పుడు లైసెన్స్‌దారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో షాపులకు అమ్మకాలు అంతగా ఉండడం లేదు. హేతుబద్ధత లేకుండా షాపులను కేటా యించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెంటపాడు వంటి మండల కేంద్రాల్లోనూ అత్యధికంగా షాపులు కేటాయిం చడంతో అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయి. ఒక్కోషాపులో సగటున రూ.1.50 లక్షలు అమ్మకాలు సాగించడం గగనమైపోతోంది. మరోవైపు గత సంవత్సరం డిపోల నుంచి కొనుగోలు చేసిన విధంగానే ఈసారి కూడా నిల్వ చేసుకోవాలని లైసెన్స్‌దారులకు సూచిస్తున్నారు. అదే జరిగితే ప్రతి షాపులోనూ కనిష్టంగా రూ.60 లక్షల వరకు నిల్వ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి గడచిన ఏడాదిలో అక్టోబరులో ప్రైవేటు షాపులు తెరిచారు. వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ప్రైవేటు విధానాన్ని అమలు చేశారు. తొలి రోజుల్లో లైసెన్స్‌దారులు మంచి జోష్ మీద ఉండేవారు. మూడు నెలలపాటు అత్యధికంగా నిల్వలు చేసుకున్నారు.తాజాగా అదే తరహాలో కొనుగోలు చేయాలని లైసెన్స్‌దారులకు అధికారులు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఇప్పటిదాకా నెలవారీ ఎప్పుడైనా నిల్వ చేసుకునే అవకాశం కల్పించేవారు. ప్రస్తుతం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి లెక్కలు తీస్తున్నారు. గతంలో పోల్చుకుని తక్కువ కొనుగోలు చేసే లైసెన్స్‌దారులకు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులంతా నిత్యం దీనినే పర్యవేక్షిస్తున్నారు.
అమ్మకాలపై ప్రభావం
ప్రస్తుతం మద్యం సీజన్ అధికంగా ఉంటుంది. జిల్లాలో పంటలు చేతికొచ్చే రోజులివి. మరోవైపు పండుగ రోజులు దగ్గరపడుతున్నాయి. అమ్మకాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే లైసెన్స్‌దారులు ఆశించిన స్థాయిలో విక్ర యాలు లేవు.ప్రభుత్వం ప్రకటించిన విధంగా కమీషన్ రావడం లేదు. ప్రకటనల్లో 20 శాతం ఇస్తామని చెప్పుకొచ్చారు. తొలిరోజుల్లో పదిశాతానికే పరిమితం చేశారు. లైసెన్స్‌దారులు గగ్గోలు పెడితే దానిని 14 శాతానికి పెంచారు. ప్రస్తుతం పర్మిట్ రూమ్‌లకు మరో 7.50 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఏడాదికి రూ. 55 లక్షలు లైసెన్స్ ఫీజు కడుతున్నారు. దాంతో ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న కమీషన్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండం లేదు. ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తే కేసులు రాస్తున్నారు. ఇటీవల బెల్ట్ షాపులపైనా అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇవన్నీ జిల్లాలో లైసెన్స్‌దారులను ఊపిరాడకుండా చేస్తున్నాయి. షాపులు దక్కించుకున్న తొలిరోజు నుంచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా లాభం వచ్చిందన్న లైసెన్స్‌దారు లేడు. పాలకోడేరు వంటి ఒకటి రెండు మండలాల్లోనే జిల్లాలో కాస్త లాభ సాటిగా షాపులు నడుస్తున్నాయి. సదరు మండ లంలో నాలుగు షాపులు మాత్రమే ఉన్నాయి. దాంతో అక్కడ అమ్మకాలకు, ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌కు సరిపోతోంది. పెంటపాడు మండలంలో అయితే మండల కేంద్రంలోనే ఎనిమిది షాపు లున్నాయి. దాంతో అక్కడ రూ. 1.20 లక్షలు మాత్రమే రోజుకు అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రతిరోజు రూ.2లక్షలు వంతున అమ్మకాలు సాగిస్తేనే కాస్త గట్టెక్కుతారు. లైసెన్స్‌ఫీజు అయినా కట్టేందుకు అవకాశం ఉంటుందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.
కమీషన్ పెంచుతుందన్న ఆశతోనే..
ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందన్న ఆశ లైసెన్స్‌దారుల్లో సన్నగిల్లిపోతోంది. ఇటీవల మూడు శాతం మేర అదనంగా కమీషన్ పెంచుతారంటూ చర్చ నడిచింది. ఈ నెలలోనే అమలులోకి వస్తుందని ఎదురుచూశారు. వాయిదా పడిందంటూ సంకేతాలు రావడంతో నీరసించి పోయారు. ఇప్పటికే 18 నెలలు ముగిసి పోయాయి. మరో 16 నెలలు మాత్రమే మిగిలింది. రెండేళ్లు పూర్తయితే లైసెన్స్‌లు రద్దవుతాయి. జిల్లాలో 175 జనరల్ మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. మరో 18 షాపులను కల్లు గీత వృత్తిదారులకు కేటాయించారు. ప్రతినెలా భీమవరం డిపో నుంచే రూ. 70 కోట్లు విలువైన మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచు కుంటున్నారు. ఒక్కో నెల దానిని పెంచాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. లాభాలు లేక అవస్థలు పడుతుంటే అమ్మకాలు లేని మద్యాన్ని నిల్వ చేయడానికి అప్పులు చేయాల్సి వస్తోందంటూ లైసెన్స్‌దారులు మదన పడు తున్నారు. ప్రభుత్వం కమీషన్ పెంచుతుందన్న ఒకే ఒక్క ఆశ వారిని ఇంకా నడిపిస్తోంది. అధికారులు కూడా నిత్యం లక్ష్యాలు చేరుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు.