Share News

కిక్‌కు.. చెక్‌

ABN , Publish Date - Jun 26 , 2025 | 12:34 AM

‘బెల్టు షాపుల్లో ఎంత తాగినా కిక్‌ ఎక్కడం లేదు. మొదట బాగానే ఉండేది. కాని, రాను రాను సరుకు నీళ్లలా ఉంటున్నది. అసలు నీళ్లు కలపకుండా ‘రా’ తాగకూడదు. కాని.. రా తాగినా కిక్‌ ఎక్కడం లేదు.

కిక్‌కు.. చెక్‌
మద్యం సీసాలు, నిందితులతో ఎక్సైజ్‌ పోలీసులు

జిల్లాలో విచ్చలవిడిగా నకిలీ మద్యం

ఖాళీ బాటిల్స్‌ కొని.. స్పిరిట్‌తో మద్యం తయారీ

ఆపై ఒరిజినల్‌ బాటిల్‌ మాదిరి సీలు

ఇందుకు పాలకొల్లులో ఏకంగా యూనిట్‌

బెల్ట్‌ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు

కిక్‌ ఉండడం లేదని మందుబాబుల ఆవేదన

గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా తయారీ

అదే పంథా కొనసాగిస్తున్న మాఫియా

దాబాల్లో నాన్‌డ్యూటీ పెయిడ్‌ మద్యం అమ్మకాలు

గుర్తించిన ఎక్సైజ్‌ అధికారులు.. వరుస దాడులు

‘బెల్టు షాపుల్లో ఎంత తాగినా కిక్‌ ఎక్కడం లేదు. మొదట బాగానే ఉండేది. కాని, రాను రాను సరుకు నీళ్లలా ఉంటున్నది. అసలు నీళ్లు కలపకుండా ‘రా’ తాగకూడదు. కాని.. రా తాగినా కిక్‌ ఎక్కడం లేదు. నకిలీ మద్యమా అని అనుకుందామంటే.. సీసా ఒరిజినల్‌ది. సీలు వుంటుంది’ అని ఇటీవల మందుబాబుల మధ్య పెద్ద చర్చే నడిచింది.

ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. కాని, నిన్న కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరిగిరిపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నకిలీ మద్యం తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేయడంతో మందుబాబులకు విషయం అర్థమైంది. ఒరిజినల్‌ ఖాళీ బాటిల్స్‌ను సేకరించి, అందులో సగం నీళ్లు, కొంత స్పిరిట్‌, కొంత మద్యం కలిపి.. సీల్‌ వేసి ‘కిక్‌కు చెక్‌’ పెట్టేలా మద్యం మాఫియా అరాచకం తెలిసింది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

నకిలీ మద్యం మాఫియా జిల్లాలో చెలరేగుతోంది. నిన్న మొన్న టి వరకు చెన్నై, పాండిచ్చేరి, యానాంల నుంచి నకిలీ మద్యాన్ని దిగుమతి చేసుకునేవారు. తాజాగా జిల్లాలోనూ తయారీ చేపటా ్టరు. జానీవాకర్‌ పేరుతో చెన్నై నుంచి భీమవరానికి దిగుమతి చేసి అమ్మకాలు సాగిస్తున్న వ్యక్తిని కొద్ది నెలల క్రితం ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వాస్తవానికి ఈ మద్యం బాటిల్‌ ధర రూ.8 వేలు. దీనిని రూ.3 వేలకే అమ్మేవారు. ఇంత తక్కువ ధరకే ఎలా అమ్ముతున్నారని ఎక్సైజ్‌ అధికారులు ఆరా తీయడంతో ఇది నకిలీ సరుకని తేలింది. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం మాఫియాకు భీమవరం అడ్డాగా మారింది. బ్రాండెడ్‌ రకాలు లేకపోవడం, నాసి రకం మద్యంతో విక్రయాలు మందగించాయి.

తాజాగా పాలకొల్లులో ఏకంగా నకిలీ మద్యాన్ని తయారుచేసి విక్రయించే భాగోతం బయటపడింది. నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకును ఎక్సైజ్‌ అధికారుల స్వాధీనం చేసుకున్నారు. రూ.10 లక్షల విలువైన స్పిరిట్‌, కలర్స్‌, మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. పాలకొల్లులో తయారీ చేసే మద్యం పొరు గున ఉన్న కోనసీమ జిల్లాకు సరఫరా చేస్తూ అమ్మకాలు సాగిస్తు న్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో భీమవరం, కోనసీమ జిల్లాల్లోనే మద్యం అమ్మకాలు తగ్గాయి. ఆక్వా దెబ్బ తినడంతో అమ్మకాలు లేవని సరిపెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత మద్యం మాఫియా ఆగడాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కట్టడి కష్టతరమవుతోంది,

పన్నేతర మద్యం

జిల్లాలో తణుకు, నరసాపురం, భీమవరం తదితర ప్రాంతాల్లో పన్నేతర మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. యానాం నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం దిగుమతి అవుతోంది. దీని వల్ల జిల్లాలో మద్యం షాపుల వద్ద అమ్మకాలకు గండి పడుతోంది. ఇప్పటికే నష్టాలు చవిచూస్తున్నామంటూ లైసెన్స్‌దారులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్సైజ్‌ శాఖ టార్గెట్‌లను కొనుగోలు చేయడానికి తంటాలు పడుతున్నారు. ఈ తరుణంలో నకిలీ మద్యం, నాన్‌ డ్యూటీ మద్యం మరింత నష్ట పెడుతోంది. దాబాల్లో యథేచ్ఛగా నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. వాస్తవానికి మద్యం షాపుల నుంచి తొలుత కొనుగోలు చేసేవారు. కొందరు కూటమి నేతల నుంచి ఒత్తిడితో దాబాల వైపు అధికారు లు దృష్టి పెట్టడం లేదు. దీంతో యానాం నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యాన్ని తెచ్చి అమ్మకాలు సాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆరోగ్యంతో చెలగాటం

తక్కువ ధరకు లభ్యం అవుతుందన్న ఉద్దేశంతో మద్యం ప్రియులు నకిలీ మద్యాన్ని సేవిస్తున్నారు. జానీవాకర్‌ వంటి బ్రాండెడ్‌ రకాల పేరుతో మద్యం బాటిళ్లను తయారు చేస్తున్నారు. అమ్మకాలు సాగిస్తున్నారు. పండుగ రోజుల్లో నకిలీ మద్యం తయారీ మరింత అధికంగా ఉంటోంది. గతంలో హర్యానా వంటి రాష్ర్టాల నుంచి దిగుమతి చేశామంటూ మద్యం మాఫియా బ్రాండెడ్‌ పేరుతో విక్రయించేది. తక్కువ ధరకు బ్రాండెడ్‌ మద్యం లభిస్తోందని మద్యం ప్రియులు ఎగబడేవారు. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చే నాసిరకం కంటే అనారోగ్యకరమైన నకిలీ మద్యాన్ని తయారు చేసి మార్కెట్‌లో అమ్మకాలు సాగించారు. వైసీపీ నేతల అండదం డలు ఉండడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. మద్యం మాఫియాను చూసీ చూడనట్టు వదిలేశారు. ఇప్పటికి జిల్లాలో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఎక్సైజ్‌ అధికారులు వాటిపై కన్నేస్తూనే ఉన్నారు. అయినా అరికట్టడం కష్టతరం అవుతోంది. మరోవైపు నకిలీ భాగోతం ఎక్సైజ్‌ శాఖను పట్టి పీడిస్తోంది. నకిలీ మద్యం సేవిస్తే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. స్పిరిట్‌ను ఉపయోగించి మద్యం తయారు చేస్తున్నారు. దీనివల్ల ప్రధాన అవయవాలు చెడిపోయే ప్రమాదం ఉంది.

కల్తీ మద్యం స్వాధీనం

నరసాపురం/యలమంచిలి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): యలమంచిలి మండలం శిరగాలపల్లిలో అక్రమ మద్యం అమ్ముతున్న గుత్తుల సత్యనారాయణను, కొనడానికి వచ్చిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కేదారిలంకకు చెందిన సాలా ఈశ్వరరావును అదుపులోకి తీసుకుని 62 మద్యం బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు నరసాపురం ఎక్సైజ్‌ సీఐ రాంబాబు తెలిపారు. సత్యనారాయణను విచారించగా కొంత కాలంగా పాత మద్యం ఖాళీ సీసాలను కొని, వాటిలో చీప్‌ లిక్కరు మద్యంతోపాటు కొంత నీటిని నింపి బెల్ట్‌ షాపుల ద్వారా అమ్ముతున్నాడు. ఈశ్వరరావు ఇతని వద్ద నుంచి తరచు ఈ బాటిల్స్‌ కొంటాడు. కొనుగోలుదారులకు అనుమానం రాకుండా సీల్డ్‌ మూతలు అమరుస్తున్నారు. ఈ మూతలను విజయవాడకు చెందిన ముత్త మనోజ్‌కుమార్‌ వద్ద కొంటున్నారు. సత్యనారాయణ, మనోజ్‌కుమార్‌ మధ్య అనేక ఫోన్‌కాల్స్‌, ఫోన్‌ పేలో నగదు బదిలీని గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, కల్తీ చేసిన 62 మద్యం బాటిల్స్‌ను, 970 సీసా మూతలను, 100 ఖాళీ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిని బుధవారం నరసాపురం కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించారు. ఏలూరు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కె.వి.నాగప్రభుకుమర్‌, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌సింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్స్‌ శ్యాం భోగేశ్వరరావు, షేక్‌ ఖాసిం మహ్మద్‌ జైనులాబద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 12:34 AM