Share News

ఇంజనీరింగ్‌పైనే మక్కువ

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:54 AM

ఇంజనీరింగ్‌ విద్య గాడినపడింది. రెండేళ్లుగా ఇంజనీరింగ్‌పై విద్యార్థులు మక్కువ పెరగడం సీట్ల భర్తీ ఆశాజనకంగా మారింది. 2025 విద్యా సంవత్సరం అదే జోరు కొనసాగేలా కనిపిస్తుంది.

ఇంజనీరింగ్‌పైనే మక్కువ

రెండేళ్లుగా సీట్ల భర్తీ ఆశాజనకం

2024లో 80 శాతానికి పైగా..

ఈ ఏడాది ఏపీఈఏపీ సెట్‌లో 11,739 మంది ఉత్తీర్ణత

15 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 90 శాతం సీట్ల భర్తీకి అవకాశం

భీమవరం రూరల్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ విద్య గాడినపడింది. రెండేళ్లుగా ఇంజనీరింగ్‌పై విద్యార్థులు మక్కువ పెరగడం సీట్ల భర్తీ ఆశాజనకంగా మారింది. 2025 విద్యా సంవత్సరం అదే జోరు కొనసాగేలా కనిపిస్తుంది. గత ఏడాది లెక్కల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 ఇంజనీరింగ్‌ కళాశాలలకు 3500 వరకు మేనేజ్‌మెంట్‌ సీట్లు, ఎనిమిది వేలకుపైగా కన్వీనర్‌ కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏపీఈఏపీ సెట్‌లో 11,739 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. దీనినిబట్టి చూస్తే రెండు వేల పైగా విద్యార్థులు కన్వీనర్‌ కోటా సీట్లకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఆ లెక్కన సీట్ల భర్తీ బాగుంటుందని యాజమాన్యాలు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కొన్ని కళాశాలలు 100 శాతం సీట్ల భర్తీగా నిలిచాయి. మిగిలినవి 80 శాతంపైగా సీట్ల భర్తీ అయ్యాయి. ఈసారి అంతకన్నా సీట్ల భర్తీ పెరుగుతుందనే లెక్క వేయవచ్చు.

సాఫ్ట్‌వేర్‌ స్లోగా ఉన్నా మక్కువే

గతంతో పోలిస్తే రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ రంగం స్లోగా ఉంది. దీంతో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో క్యాంపస్‌ ఎంపికలు 60 శాతానికి పైగా పడిపోయాయి. ప్రధాన కళాశాలల్లో ఏడాదికి 500పైగా క్యాంపస్‌ ఎంపికల్లో వెళ్లేవారు. అలాంటిది 100లోపు వచ్చేశారు. ఇలాంటి సమయంలోనూ ఇంజనీరింగ్‌ చదివే వారి సంఖ్య పెరిగింది. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ వంటి గ్రూపులతోపాటు మెకానికల్‌, ఈఈఈ గ్రూపులపైనే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఐదేళ్ల క్రితం కొన్ని కళాశాలల్లో ఈఈఈ, మెకానికల్‌ గ్రూపులు లేకుండా చేసుకున్నాయి. అలాంటిది గత ఏడాది ఆ గ్రూపులను మరలా తెచ్చుకున్నారు. సీట్ల భర్తీ బాగానే జరిగింది.

మేనేజ్‌మెంట్‌ సీట్ల ధర పెంచేశారు

ఇంజనీరింగ్‌ కోర్సుల మక్కువ కళాశాలల యాజమాన్యాలకు లాభంగా మారింది. మేనేజ్‌మెంట్‌ సీట్ల ధరలు ఒక రెట్లు పెంచేశారు. గత ఏడాది ఒక కళాశాలలో మేనేజ్‌మెంట్‌ సీఎస్‌ఈ సీటు రూ.12 లక్షలు ఉండేది. అది ఈ ఏడాది రూ.16 లక్షలకుపైగా పెంచారు. ఎవరి కళాశాలలకు తగ్గట్లు వారు మేనేజ్‌మెంట్‌ సీట్ల ధరలు లక్షల్లో పెంచుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెంచింది. సీటుకు వచ్చి ప్రథమ కళాశాలలో రూ.30 వేలు, మిగిలిన కళాశాలల్లో 10 వేల నుంచి 20 వేలు వరకు ఫీజులు పెంచినట్లు ప్రకటించింది.

కౌన్సెలింగ్‌ చకచకా.. ఆపై తరగతులు

ఇంజనీరింగ్‌ విద్యా విధానంలో అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి. రెండేళ్లుగా ఇంజనీరింగ్‌ ప్రవేశపరీక్ష ముందుగా నిర్వహించడం రిజల్ట్స్‌ త్వరితగతిన ఇవ్వడం జరుగుతోంది. కౌన్సెలింగ్‌ క్లాసులు ప్రారంభం సక్రమంగా వెళ్తుంది. 2024 విద్యా సంవత్సరం ఆగస్టులో మొదలైంది. ఈ ఏడాది మే 27తో ఏపీఈఏపీ సెట్‌ ముగిసింది. జూన్‌ 8న ఫలితాలు విడుదల చేశారు. ఈ లెక్కన కౌన్సెలింగ్‌ తరగతుల ప్రారంభం ఆగస్టులోపే జరిగిపోవచ్చు. గతంలో నవంబరు వరకు ఇంజనీరింగ్‌ తరగతులు ప్రారంభం కాని సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం అన్నీ సానుకూలంగా జరగడం విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:54 AM