భూంఫట్
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:08 AM
జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణానికి ఆనుకుని ఉన్న పెద అమిరం పంచాయతీ భూమి మింగేశారు. అత్యంత విలువైన భూములు అక్రమార్కులు అమ్మేశారు.
పెద అమిరం పరిధిలో 1.75 ఎకరాల భూమి అన్యాక్రాంతం
లేఅవుట్ వేసిన వారే విక్రయించారు
పదేళ్ల క్రితమే విక్రయం!
ఎన్టీఆర్ కళా వనం ఏర్పాటు ప్రతిపాదనతో అక్రమాలు వెలుగులోకి
ఇతరుల పేరిట భూమి రిజిస్ట్రేషన్
నాటి అధికారుల అడ్డగోలు ఉత్తర్వులు
స్వాధీనానికి చర్యలు
జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణానికి ఆనుకుని ఉన్న పెద అమిరం పంచాయతీ భూమి మింగేశారు. అత్యంత విలువైన భూములు అక్రమార్కులు అమ్మేశారు. లేఅవుట్ అభివృద్ధి చేసిన యజమానులే పంచాయతీకి అప్పగించిన రిజర్వుడు స్థలాలను ఇతరులకు విక్రయించేశారు. భీమవరంలోని జువ్వలపాలెం రహదారికి అత్యంత సమీపంలో ఉన్న 1.75 ఎకరాలు పెద అమిరం గ్రామ పంచాయతీకి చెందిన భూమి ఇతరుల పరమైంది.
పెద అమిరం పంచాయతీ పరిధిలో 17.5 ఎకరాల్లో లేఅవుట్ వేసి అభివృద్ధి చేశారు. నిబంధనల మేరకు పది శాతం భూమి 1.75 ఎకరాలు రిజర్వుడ్ స్థలంగా పంచాయతీకి అప్పగించారు. లే అవుట్‌లో బహుళ అంతస్థుల భవనాలు నిర్మాణమయ్యాయి. అక్కడ భూమి విలువ ఒక్కసారిగా పెరిగింది. సెంటు స్థలం రూ.20 లక్షల వరకు కావడంతో రిజర్వు స్థలం విలువ రూ.35 కోట్లు పైమాటే. లేఅవుట్ చేసిన వారే రిజర్వు స్థలం విక్రయానికి తెగబడ్డారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పెద అమిరం పంచాయతీ పరిధిలోని 17.5 ఎకరాల్లో 1996లో లేఅవుట్ చేశారు. దాదాపు దశాబ్దం తర్వాత భవన నిర్మాణాలకు ఆసక్తి కనబరిచారు. నిబంధనల మేరకు పది శాతం రిజర్వు స్థలం పంచాయతీకి రిజిస్ట్రేషన్ కూడా అయింది. ప్లాట్‌లు కొనుగోలు చేసినవారికి భవన నిర్మాణాలకు గ్రామ పంచాయతీ ఎల్‌పీ నెంబర్ వేసి ప్లాన్‌లు మంజూరు చేసింది. ప్లాన్‌కు చెల్లిం చాల్సిన సొమ్ము మాత్రమే కొనుగోలుదారులు గ్రామ పంచాయతీకి చెల్లించారు. లేఅవుట్ అనుమ తి(ఎల్‌పి) నెంబర్‌తో నిర్మాణాలకు ప్లాన్ అప్రూవల్ ఇవ్వడంతో అధికారిక లేఅవుట్‌గా పంచాయతీ గుర్తించినట్లు. గ్రామ పంచాయతీ రికార్డుల్లో కూడా 1.75 ఎకరాల రిజర్వు స్థలం పంచాయతీకి చెందిన భూమిగా నమోదైంది.
5 శాతం స్థలం స్వాధీనం చేసుకోండి..!
2014లో ఆ స్థలం పదేళ్ల విక్రయానికి బీజం పడింది. అప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అధికారి జారీ చేసిన ఉత్తర్వులు లే అవుట్ యజమానులకు వరంగా మారాయి. లే అవుట్‌కు చెందిన 5 శాతం భూమిని పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని అప్పటి డీపీవో లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి ముని సిపాలిటీలు, పంచాయతీల్లో లేఅవుట్ వేస్తే పది శాతం భూమిని ఇవ్వాలి. నిబంధనల మేరకు రహదారులు నిర్మిస్తే సంబంధిత మునిసిపాలిటీ లేదా పంచాయతీ అయినా లేఅవుట్‌కు అనుమతి ఇస్తుంది. పెద అమిరం గ్రామ పంచాయతీలో మాత్రం 5 శాతం భూమి స్వాధీనం చేసుకోవాలని 2014లో అప్పటి డీపీవో నోటీసులు ఇచ్చారు. దా నిని అడ్డం పెట్టుకుని ఎకరం 1.75 సెంట్లలో కొంత భూమిని లేఅవుట్ యజమాని విక్రయించేశారు. కొనుగోలుదారుల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా అయి పోయింది. అన్యాక్రాంతం కావడంతో గ్రామ పంచా యతీ సుమారు రూ.35 కోట్ల భూమి కోల్పోయినట్లేనని అంచనా.
ఖాళీ స్థలాలపై ఆరా..
జిల్లా అధికారులు ప్రత్యేకంగా పెద అమిరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఖాళీ స్థలాలపై ఆరా తీశారు. మొత్తంగా 6.40 ఎకరాలు పంచాయ తీకి భూమి ఉన్నట్టు రికార్డుల్లో తేలింది. అదే సందర్భంలో 1.75 ఎకరాల భూమి ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించిన అధికారులు అవాక్కయ్యారు. ఆ భూమిలో 80 సెంట్లు స్థలంలో ఎన్టీఆర్ కళా వనాన్ని నిర్మించాలనే ప్రతి పాదన కలెక్టర్ దృష్టికి వెళ్లింది. స్థలం మొత్తం అన్యాక్రాంత మైనట్టు గుర్తించి కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందన లేకపోవడంతో 25 సెంట్లు భూమిని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భూమి కోసం అన్వేషిస్తున్నారు. మొత్తం స్థలంలో చిన్న చిన్న షెడ్లు వేసినట్టు అధికారులు నిర్ధారిం చారు. కొనుగోలుదారుల వద్ద రిజిస్ట్రేషన్ పత్రాలు న్నాయి. పంచాయతీకి బెటర్‌మెంట్ చార్జీలు చెల్లించి సదరు స్థలంలో నిర్మాణాలకు అనుమతి కూడా తెచ్చుకున్నారు.
గత అధికారులు బెటర్ మెంట్ చార్జీలు వసూలు చేసి ప్లాన్ కూడా ఇచ్చే శారు. పంచాయతీ భూములను పరిరరిక్షించుకునే చర్యలు కూడా చేపట్టలేదు. గతంలో ఒక్కో అధికారి, ఉద్యోగి పెదఅమిరం గ్రామానికి చెందిన స్థలాన్ని అన్యాక్రాంతం అయ్యేలా సహకారమందించారు. ప్రస్తుతం సర్వే నెంబర్లతో సహా రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొనుగోలుదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు సమాచారం.
రిజిస్ట్రేషన్‌లోనూ అవకతవకలే..
లేఅవుట్‌ను అభివృద్ధిచేసిన నిర్మాణదారులు గ్రామ పంచాయతీకి ఇచ్చిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడంలో కూడా అక్రమాలకు పాల్పడి కొనుగోలుదారులకు కుచ్చుటోపీ పెట్టారు. భూవినియోగ మార్పిడి చెందిన స్థలాలను గజాల్లో విక్రయించాలి. ముఖ్యంగా భీమవరం ప్రాంతంలో కలసిన భూమిని గజాల్లోనే రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ కొంత భూమిని సెంట్లుగా విక్రయించగా అలాగే రిజిస్ట్రేషన్ చేశారు. 40 సెంట్లు భూమి గజాల్లో కాకుండా సెంట్లలో విక్రయించినట్టు పంచాయతీ గుర్తించింది. మొత్తానికి అత్యంత విలువైన పంచాయతీ భూమి విక్రయం కావడంతో అధికారులే విస్తుపోతున్నారు. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.