Share News

భూముల రీ సర్వే తప్పులతడక

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:46 AM

భూముల రీ సర్వే తప్పులతడక అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భూముల రీ సర్వే తప్పులతడక
కాళ్లలో సర్వే అధికారులతో మాట్లాడుతున్న రైతులు

తగ్గుతున్న భూమి..!

ప్రైవేటు సర్వేలో సక్రమం

రైతుల గగ్గోలు

కాళ్ళ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే తప్పులతడక అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసర్వేలో తమ భూమి విస్తీర్ణం తగ్గిందని, యాజమాన్య హక్కులను ప్రభావితం చేస్తోందని కాళ్ల గ్రామానికి చెందిన తోట కృష్ణారావు, పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వే అవకతవకలపై మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వాస్తవంగా తమ భూమి క్షేత్రస్థాయిలో సక్రమంగానే ఉందని, తమ దగ్గర ఉన్న అన్ని రికార్డులు ఉన్నా కొంత భాగం తగ్గించి చూపిస్తున్నారని, ఇది ముమ్మాటికీ అధికారుల తప్పిదమేనని ఆరోపించారు. 30 ఏళ్లుగా తగ్గని భూమి ఇప్పుడు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. ప్రైవేట్‌ సర్వే చేయించుకుంటే తమ భూమి కచ్చితంగానే ఉందని, లోపం ఎక్కడుందో తెలపాలని కోరుతున్నారు. రీ సర్వే చేస్తున్నప్పుడు ప్రారంభంలో అందరి భూమి సరిపోయిందని చెప్పిన అధికారులు, సర్వే పూర్తయ్యే సమయానికి భూమి తగ్గిందని, ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పడం దారుణమన్నారు. ఏ సర్వే నెంబర్‌లో విస్తీర్ణం తగ్గితే ఆ సర్వే నెంబర్‌కు మాత్రమే ఇది వర్తింపజేయాలని, మిగతా వారికి ఎలా వర్తింపజేస్తారని ప్రశ్నించారు. గ్రామంలో అనేక మంది అనర్హులు భూమిలో ఉంటే ఒక్కరిని కూడా బయటకు తీసుకురాని సర్వే లోపభూయిష్టంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నామని, వారి ఆదేశాల మేరకు విచారణకు వచ్చిన అధికారులు సైతం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారే కానీ సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. గతంలో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నట్లుగానే తమ భూమిని చూపాలని, లేనిపక్షంలో న్యాయపోరాటానికి సిద్ధపడతామని వారు స్పష్టం చేశారు.

Updated Date - Dec 17 , 2025 | 12:46 AM