భూముల రీసర్వే
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:37 AM
జిల్లాలో రెండో విడత భూ రీసర్వే కొనసాగనుంది. తొలి విడత పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో 24 మండలాల్లోని 24 గ్రామాల్లో భూముల రీసర్వే జనవరి 20న ప్రారంభమైంది.

15 నుంచి రెండో విడత కార్యక్రమం
మరో 58 గ్రామాల్లో రీసర్వేకు శ్రీకారం
రోవర్లతో స్పీడుగా కొలతలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రెండో విడత భూ రీసర్వే కొనసాగనుంది. తొలి విడత పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో 24 మండలాల్లోని 24 గ్రామాల్లో భూముల రీసర్వే జనవరి 20న ప్రారంభ మైంది. ఆయా గ్రామాల్లో సరిహద్దులు వేసే ప్రక్రియ పూర్తయితే దాదాపు సర్వేలో లెక్కలు సరిపోలే అవకాశం ఉంది. మొత్తం 24,606 ఎకరాల భూముల సర్వేను లెక్క తేల్చుతున్నారు. దీంతో రెండో విడతగా అవే మండలాల్లో రెండేసీ గ్రామాల చొప్పున అదనంగా భూముల రీసర్వే జరపాలని రాష్ట్ర భూపరిపాలనా కమిషనర్ (సీసీఎల్‌ఏ) సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రెండో విడతగా మరో 58 గ్రామాల్లో ఈ నెల 15 నుంచి రీ సర్వే జరపడానికి అధికారులు గ్రామాలను ఎంపిక చేస్తున్నారు. మండలాల్లో తహసీల్దార్ల నుంచి లెక్కలు తీసుకుంటున్నారు. 14 నాటికి పూర్తి భూములు డేటాను సేకరించి కార్యాచరణకు దిగనున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో గందరగోళం
గత వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే పేరుతో గందరగోళం చేసింది. భూముల కొలతల్లో భారీగా తేడాలు వచ్చాయని చాలాచోట్ల రైతులు గగ్గోలు పెట్టారు. తాము నష్టపోతు న్నామని కూటమి ప్రభుత్వానికి మొరపెట్టుకోవడంతో భూముల తేడాల్లో ప్రక్షాళనకు సర్కార్ నడుం బిగించింది. గ్రామాల్లో మొదటి విడత సర్వేపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా బడా భూస్వాముల వివరాల సర్వే అక్కడక్కడ పూర్తి కాలేదని సమాచారం. వారంతా భూములున్న చోట్ల ఉండకపోవడంతో లెక్కలపై కుస్తీ పడుతున్నారు. సీసీఎల్‌ఏ అన్ని జిల్లాల్లో పర్యటించడంతో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సర్వేకు ఉపక్రమిస్తు న్నారు. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ వల్ల జిల్లాలో పర్యటించలేదు. త్వరలో ఆయన జిల్లాలో భూముల రీ సర్వేను పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతా నికి సర్వే చివరి దశకు చేరింది. గ్రౌండ్ ట్రూతింగ్ (జీటీ)పూర్తయ్యింది. గ్రామాలు, బ్లాక్‌లు మొత్తం ఎకరాలు, ఖాతాల కింద వర్గీకరణ చేస్తున్నారు.
సర్వేలో ఆధునిక సాంకేతికత
భూముల రీసర్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల వర్గీకరణ చర్యలు చేపట్టాలని, ప్రత్యేక మ్యాప్ లతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలకు వెళ్లాలని భూముల రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉండాలని సీసీఎల్‌ఏ సూచనలు చేస్తూనే ఉన్నారు. భూసేకరణ ప్రీ హోల్డ్, డిజిటలైజేషన్, జాయింట్ ఎల్‌పీఎంలు రూపకల్ప న చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. జేసీ ధాత్రిరెడ్డి ఎప్పటికప్పుడు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, సర్వే ల్యాండ్ రికార్డ్సు ఏడీ అన్సారీ, క్షేత్రస్థాయిలో తహసీల్దార్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. పాత విధానంలో గొలుసుకట్టు, టేప్‌లతో కొలిచే పద్ధతికి స్వస్తి పలికి గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా రోవర్లను ఉపయోగించి భూము ల సర్వే చేస్తుండడంతో లెక్కలు సరిగ్గా తేలుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బేస్డ్ స్టేషన్లు పెదవేగి, జీలుగుమిల్లిలో పరిధిలో రోవర్ల విధానంతో సర్వే చేస్తున్నారు. 13 కిలోమీటర్ల పరిధిలో రోవర్ల డేటాను రీసీవ్ చేసుకుని పనిచేస్తాయి. భూముల రీసర్వేతో గ్రామాల్లో భూ వివాదాలకు చెక్ పడనుంది.