Share News

వైద్యం చేసేదెలా..?

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:11 AM

జిల్లాలో రోజుకు సగటున 150 నుంచి 180వరకు జ్వరం కేసులు నమోదవు తున్నాయి. ఏ జ్వరమో నిర్ధారణకు ల్యాబ్‌ టెక్నీషియన్లు(ఎల్టీలు) లేరు.

వైద్యం చేసేదెలా..?

పీహెచ్‌సీల్లో రోగ నిర్ధారణ పరీక్షలకు సిబ్బంది కొరత

గ్రామీణ, అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు లేవు

అరకొర సిబ్బంది.. డిప్యుటేషన్లు

ప్రైవేటు ల్యాబ్‌లకు సిఫారసు

గ్రామాల్లో పేదలకు తప్పని భారం

జ్వరాలపై అయోమయం

జిల్లాలో రోజుకు సగటున 150 నుంచి 180వరకు జ్వరం కేసులు నమోదవు తున్నాయి. ఏ జ్వరమో నిర్ధారణకు ల్యాబ్‌ టెక్నీషియన్లు(ఎల్టీలు) లేరు. వైద్య ఆరోగ్య శాఖ ఐహెచ్‌పీ (ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ పోర్టల్‌)లో క్షేత్రస్థాయి నుంచి రోజువారీ నమోదవుతున్న జలుబు, దగ్గు, జ్వరం, యానిమల్‌ బైట్స్‌ వంటి నోటిఫైడ్‌ డిసీజెస్‌ నివారించడానికి లేదా నియంత్రించడానికి పీహెచ్‌సీలు, అర్బన్‌ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత ఉంది. ఫలితంగా రోగులు ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లవైపు వెళ్లక తప్పడం లేదు.

ఏలూరు అర్బన్‌, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): పీహెచ్‌సీల్లో రోగ నిర్ధారణ పరీక్షలకు అవకాశం లేకపోవడంతో వైద్యం అందిచడంలో కచ్చితత్వం లోపిస్తోంది. జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో ఏ జ్వరమనేది నిర్ధారణ కావడం లేదు. మరోవైపు విధులు నిర్వర్తించాల్సిన వైద్యులను పట్టణ ప్రాంతా ల్లో డిప్యుటేషన్లపై కొనసాగిస్తున్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఐదుగురు బఫర్‌ డాక్టర్లను ఆఫీసు విధులకే పరిమితం చేయడంపైనా వైద్యవర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఎల్టీలు లేకుండా రోగనిర్ధారణ ఎలా?

ఏలూరు జిల్లాలో మొత్తం 70 పీహెచ్‌సీలుండగా, వీటిలో 62 పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవిగాక ఏలూరు, చింతలపూడి, నూజివీడుల్లో 11 అర్బన్‌ పీహెచ్‌సీలు, దెందులూరు, చింతలపూడి, నూజివీడు, కైకలూరుల్లో సీహెచ్‌సీలున్నాయి. వివిధ రుగ్మతలు, రోగాలతో నిత్యం వేల సంఖ్యలో ప్రభుత్వాసుపత్రు లకు వస్తుంటారు. రోగనిర్ధారణ పరీక్షలు చేయడానికి ఉద్దేశించిన ల్యాబ్‌ టెక్నీషియన్లు పూర్తిస్థాయిలో లేకపోవడం ప్రధాన లోపం. ఈ సమస్యను తాత్కా లికంగా అధిగమించడానికి సమీప పీహెచ్‌సీల్లో విధులు నిర్వర్తించే ల్యాబ్‌ టెక్నీషియన్లను కొరతవున్న పీహెచ్‌సీలో వారానికి మూడు రోజులు పనిచేసేలా నెట్టుకొస్తున్నారు. ఫలితంగా ఎల్టీ అందుబాటులోలేని మిగతా మూడు రోజుల్లో రోగనిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. ఈ పరిస్థితి టి.నరసాపురం, లింగ పాలెం, కోరుకొల్లు, కొల్లేటికోట, రాఘవాపురం, మరి కొన్ని పీహెచ్‌సీల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వైరల్‌ జ్వరాలు, అంటువ్యాదుల కేసులు నిత్యం వస్తున్న వేళ కీలకమైన ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత వేదిస్తుం డడం సమస్యను మరింత పెంచుతోంది. కొన్ని పీహెచ్‌సీల్లో రోగనిర్ధారణకు ప్రైవేటు ల్యాబ్‌లకు పంపిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

నగరంలోని ప్రైవేటు ల్యాబ్‌కు జ్వరం లక్షణాలతో ఒక వ్యక్తి రోగనిర్ధారణ పరీక్షకు వెళ్లగా అక్కడ సీబీపీ, యూరిన్‌, ఎలీసా వంటి వైరల్‌ జ్వర సంబంధిత టెస్టులు చేయకుండానే డెంగీ జ్వరంగా చెప్పడంతో భయభ్రాంతులకు గురైన కుటుంబసభ్యులు రోగిని వైద్యంనిమిత్తం పీహెచ్‌సీకి వచ్చినట్టు ఓ వైద్యాధికారి వివరించారు. ల్యాబ్‌ టెక్నీషియన్లను ఎప్పటికప్పుడు భర్తీచేస్తుంటే పీహెచ్‌సీ స్థాయిలోనే రోగనిర్ధారణ, వైద్యం వేగవంతంగా జరుగుతాయని ఆ వైద్యాధికారి అభిప్రాయపడ్డారు. మరోవైపు పలు పీహెచ్‌సీల్లో వైద్య సేవలకు స్టాఫ్‌ నర్సుల కొరత వెంటాడుతోంది. ప్రత్యామ్నాయంగా ఏఎన్‌ఎంలను, ఎంఎల్‌హెచ్‌పీల ను వైద్యసేవలకు వినియోగించుకుంటున్నారు.

బఫర్‌ డాక్టర్లు ఉన్నా..

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఐదుగురు బఫర్‌ వైద్యులు ఉన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో డాక్టర్లు సెలవుపెడితే అక్కడ వైద్యసేవలకు విఘా తం కలుగకుండా బఫర్‌ డాక్టర్లను గతంలోనే నియ మించారు. వీరంతా డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో ఉంటారు. ప్రస్తుతం జిల్లాలో పీహెచ్‌సీల్లో వైద్యాధి కారుల కొరత ఉంటే, డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఐదుగురు బఫర్‌ డాక్టర్లను వివిధ పథకాలకు పర్య వేక్షకులుగా వినియోగించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. బఫర్‌ డాక్టర్లను క్షేత్రస్థాయికి పంపిస్తే వైద్య సేవలపై అవగాహన ఉంటుందని, కార్యాలయ విధులకే పరిమితంచేయడం సరికాదని ఓ వైద్యాధికారి వ్యాఖ్యానించారు.

ఎల్టీలు, స్టాఫ్‌ నర్స్‌ ఖాళీలు భర్తీచేస్తాం : డాక్టర్‌ పీజే.అమృతం, డీఎంహెచ్‌వో

జిల్లాలో కనీసం 10 పీహెచ్‌సీల్లో ల్యాబ్‌ టెక్నీషి యన్ల కొరత, కొన్నిచోట్ల స్టాఫ్‌ నర్సుల కొరత ఉంది. సమీప పీహెచ్‌సీల నుంచి ల్యాబ్‌ టెక్నీషియన్లు, స్టాఫ్‌ నర్సులను వారానికి మూడు రోజులపాటు సేవలందించేలా చర్యలు తీసుకుంటాం. జ్వరం కేసులు నమోదైనచోట ఆ ప్రాంతంలో అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించేందుకు సర్వే నిరంతరం జరుగుతుంది. జిల్లాలో ఇంతవరకు తురక పాలెం(గుంటూరు జిల్లా)లో నమోదైన జ్వరం తీవ్రత మాదిరి కేసులేవీ లేవు.

Updated Date - Sep 10 , 2025 | 12:11 AM