కూటమిలో జోష్
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:13 AM
గడిచిన సంవత్సర కాలం రాజకీయంగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి రెండో ఏడాదిలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు నామినేటెడ్ పదవుల పందేరంతో జోష్ నింపింది. ఇది పార్టీలు సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అడుగులు వేశాయి.
కేడర్‌కు పదవుల పందేరం.. తీయని జ్ఞాపకాలు మిగిల్చిన–2025
2025 వచ్చి అప్పుడే ఏడాది గడిచిపోయింది. మరో మూడు రోజుల్లో 2026లోకి ప్రవేశిస్తాం.
గడిచిన సంవత్సర కాలం రాజకీయంగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి రెండో ఏడాదిలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు నామినేటెడ్ పదవుల పందేరంతో జోష్ నింపింది. ఇది పార్టీలు సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అడుగులు వేశాయి. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు పోరాటాలను ఎంచుకుని.. జనం మధ్యే ఉండేందుకు ప్రయత్నాలు చేశాయి. ఈ ఏడాది పొలిటికల్ జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుందాం.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలోనూ నామినేటెడ్ పోస్టుల భర్తీని ఒక పండుగలా నిర్వహించారు. కూటమి పార్టీల్లో జిల్లాకు రాష్ట్ర స్థాయిలోనే కీలక పదవులు వరించాయి. భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్‌గా వలవల బాబ్జి, మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా కొల్లు పెద్దిరాజులకు అవకాశం దక్కించుకున్నారు. జిల్లా స్థాయిలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా జనసేన నుంచి జుత్తిగ నాగరాజు, డీసీఎం ఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణలకు అవకాశం ఇచ్చారు. ఈ ఏడాది జిల్లాకు ఇటువంటి కీలక భాధ్యతలు అప్పగించి ప్రభుత్వం కొంతమేర జిల్లా నేతలకు న్యాయం చేసింది. ఇక సహకార సంఘాలకు త్రిసభ్య కమిటీలను, దేవాలయాలకు ట్రస్ట్‌బోర్డులను నియమించింది. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీలకు నిష్పత్తుల ప్రకారం నామినేటెడ్ పదవు ల్లో ప్రాధాన్యం ఇచ్చారు. 10 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ఏర్పా టుచేశారు. రాష్ట్ర కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవుల నియామకంలోనూ జిల్లాకు సము చిత స్థానం లభించింది. పదవుల కేటాయిం పులో అన్నిటికంటే ఉండి ముందు వరుసలో ఉండగా, తాడేపల్లిగూడెం అట్టడుగున నిలి చింది. దీనిపై ఇక్కడి నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. పదవుల పంపకంలో కూటమి నేతల మధ్య కొన్నిచోట్ల అగాథం ఏర్పడింది.
ప్రజలతో టీడీపీ మమేకం
కూటమి పార్టీలు ఈ ఏడాది మమేకమయ్యాయి. రైతు కోసం, సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంలోనూ ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు ముందున్నారు. ఇక సంస్థాగ తంగా తెలుగుదేశం బలోపేతానికి ఈ ఏడాది చర్యలు తీసు కున్నారు. జిల్లా కమిటీని నియమించారు. ఈ సారి సభ్యుల సంఖ్యను పెంచారు. మహిళలకు సముచిత స్థానం లభిం చింది. పట్టణ, మండల పార్టీ కమిటీలను భర్తీ చేశారు. రెండోసారి జిల్లా అధ్యక్ష పదవిని మంతెన రామరాజు సొం తం చేసుకున్నారు, బీసీ సామాజిక వర్గం నుంచి పార్టీకి విధేయతగా ఉంటూ వచ్చిన పితాని మోహనరావుకు ప్రధా న కార్యదర్శిగా తెలుగుదేశం నియమించింది.
మూడు సార్లు ముఖ్యమంత్రి రాక
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది మూడుసార్లు జిల్లాకు వచ్చారు. తొలుత పెనుగొండ వాసవీ ధామ్‌కు, రెండోసారి తణుకు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి, మూడోసారి మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి హాజరయ్యారు.
వ్యూహం మార్చిన జనసేన
జనసేన ఈ ఏడాది రాజకీయ వ్యూహాలను మార్చింది. జనసేన ఎమ్మెల్యేలు వున్నచోట్ల వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకకున్నారు. ఇది టీడీపీని స్థానికంగా కాస్త ఇబ్బందుల కు గురిచేసింది. పెంటపాడులో వైసీపీ ఎంపీటీసీలు జనసే నలో చేరడంతో ఎంపీపీ పదవిని దక్కించుకుంది. క్రియాశీల సభ్యత్వంలోనూ పార్టీ నాయకులు కుస్తీ పడ్డారు.
పశ్చిమకు పట్టం కట్టిన బీజేపీ
బీజేపీ పశ్చిమ గోదావరికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. భీమవరంలో సీనియర్ నేతలకు మంచి గుర్తింపు ఇచ్చింది. కేంద్రమంత్రి శ్రీనివాస్‌వర్మ భీమవరంలో ఉన్నప్పటికీ అదే పట్టణానికి చెందిన పాకా సత్యనారాయణకు రాజ్యసభకు ఎంపిక చేసింది. కమిటీల్లోనూ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
ప్రతిపక్షాల పోరుబాట
వైసీపీ ఈ ఏడాది పోరాటాలు నిర్వహించి ప్రజల్లో ఉండే ప్రయత్నం చేసింది. రైతు కోసం ధర్నాలు నిర్వహించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడ్‌లో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ధర్నా చేపట్టారు. వైసీపీ నుంచి ఈ ఏడాది వలసలు ఎక్కువ కావడం ఆ పార్టీ కొన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. భీమవరం మాజీ ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. ద్వితీయ శ్రేణీ నాయకత్వం భీమవరం, నర్సాపురం వంటి నియోజకవర్గాల్లో పార్టీని వీడింది.
వామపక్ష పార్టీలు ఈ ఏడాది ప్రజా పోరాటంలో మునిగి తేలాయి. ధాన్యం సొమ్ముల కోసమంటూ ఎక్కడికక్కడ ఉద్యమాలు చేపట్టారు. గడచిన వేసవిలో వామపక్షాలు ఉద్యమానికి తెరలేపారు. గ్యాస్ ధరలు పెంపుపైనా నిరసనలు తెలిపారు. సీపీఎం రాష్ట్ర సభలు భీమవరంలో నిర్వహించారు. ఇక అంగన్‌వాడీల సమస్యలపైన పోరుబాట పట్టింది.