మాజీ ఎమ్మెల్యే కొఠారు గృహ నిర్బంధం
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:39 AM
పెదవేగి మండలం కొండలరావు పాలెంలోని కొఠారు అబ్బయ్యచౌదరి ఇంటి వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. భారీగా చేరుకున్న పోలీసులు ఆయనను బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశా రు.
పెదవేగి/దెందులూరు, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): పెదవేగి మండలం కొండలరావు పాలెంలోని కొఠారు అబ్బయ్యచౌదరి ఇంటి వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. భారీగా చేరుకున్న పోలీసులు ఆయనను బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశా రు. దీంతో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగింపు సమావేశం దెందులూరులో బుధవారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరులో మండలస్థాయి అధికారుల విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశా రు. టీడీపీ– వైసీపీ శ్రేణులు ఒకరికొకరు ఎదురుపడితే ఘర్షణ జరిగే అవకాశం ఉందని పోలీసులు ముందుస్తు జాగ్రత్త చర్యగా కొఠారును గృహ నిర్బంధం చేశారు. బుధవారం ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన కొఠారును బయటకు రాకుండా అడ్డుకున్నారు. కొఠారు, వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమం దెందులూరులో కాకుండా వేరేచోట నిర్వహించుకుంటే అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆ కార్యక్రమాన్ని దెందు లూరు మండలం వేగవరంలో నిర్వహిస్తామని వైసీపీ శ్రేణులు చెప్పడంతో కొఠారును ఉదయం 11 గంటలకు గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడంతో ఉద్రిక్తతకు తెరపడింది. అనంతరం కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమం అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వేగవరంలో నిర్వహించారు. అక్కడ నుంచి ఏలూరులోని వైసీపీ కార్యాలయానికి చేరుకుని 52 వేల సంతకాల ప్రతులను కొఠారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డీవీఆర్‌కే చౌదరి, జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, మండల వైసీపీ అధ్యక్షుడు కామిరెడ్డి నాని పార్టీ జిల్లా అఽధ్యక్షుడు దూలం నాగేశ్వరావుకు అందజేశారు.