మమ్మల్ని బతకనివ్వండి
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:44 AM
మా తాత, ముత్తాతల నుంచి మేం కొల్లేరునే నమ్ముకుని బతుకుతున్నాం. కొల్లేరు ఆపరేషన్ తర్వాత అంతా అస్తవ్యస్తమైంది. మా ఊళ్లలో తాగు నీరే కాదు, పశువులకు చెరువులు లేవు.

కేంద్ర సాధికార కమిటీకి వినతుల వెల్లువ
పెద్దఎత్తున తరలివచ్చిన కొల్లేరువాసులు
కేంద్ర మంత్రి వర్మ సహా ఎమ్మెల్యేలు హాజరు
పర్యావరణంతోపాటు ప్రజల జీవనమూ ముఖ్యమే
కొల్లేటికోటలో భేటీకి హాజరైన వేలాది మంది
కోర్టు నిబంధనలకు లోబడే నివేదిక : కమిటీ
నేడు ఉంగుటూరు ప్రాంతంలో పర్యటన
‘మా తాత, ముత్తాతల నుంచి మేం కొల్లేరునే నమ్ముకుని బతుకుతున్నాం. కొల్లేరు ఆపరేషన్ తర్వాత అంతా అస్తవ్యస్తమైంది. మా ఊళ్లలో తాగు నీరే కాదు, పశువులకు చెరువులు లేవు. ఇప్పటికి ఇళ్ల స్థలాలు లేవు. ఉన్నా మెరక చేసుకునే దిక్కు లేదు. జిరాయితీ, డి–ఫారం పట్టా భూములైనా పంచితే బతుకీడ్చుకొస్తాం. పక్షులతోపాటు మేము బతికేందుకు అవకాశం ఇవ్వండి’ అంటూ కేంద్ర సాధికార కమిటీ ఎదుట కొల్లేరు వాసులంతా ఘొల్లుమన్నారు. తమ జీవన పరిస్థితులను కళ్లారా చూసి పెద్ద మనస్సుతో స్పందించండి అంటూ వేడుకున్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి/కైకలూరు)
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరులో నెలకొన్న తాజా పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర సాధికార కమిటీ మంగ ళవారం కొల్లేరులో భాగమైన కైకలూరు ప్రాం తంలో పర్యటించింది. ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం ఏలూరు చేరు కున్న బృందం కొల్లేరు వెళ్లింది. అటవీ అధికా రులు, ప్రజాప్రతినిధులు వెంట రాగా అన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొల్లేరు వాసులు కష్ట, సుఖాలను ప్రస్తా విస్తూ తమ వినతులను కమిటీకి అందజేశారు. కొల్లేటికోటలో ఏర్పాటు చేసిన భేటీలో సమస్య లను ఏకరవు పెట్టారు. ఓ వైపు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, డిప్యూటి స్పీకర్ రఘురా మకృష్ణరాజుతోపాటు ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరా జు, మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తదితరులు కొల్లేరు స్థితిగతులను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కొల్లేరు పరీ వాహకంలో మూడు లక్షల మందికిపైగా జీవిస్తు న్నామని, ఈ ప్రాంత పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూనే సమాంతరంగా తమ జీవన స్థితిగతులను పరిగణనలోకి తీసుకో వాలని అత్యధికులు తమ వినతుల్లో కమిటీకి నివేదించారు. జిరాయితీ, డి–ఫారం పట్టా భూములను తమకు పంచే విషయంలో ఒకింత సానుకూలత చూపాలని అభ్యర్థించారు. కొల్లేరు ప్రాంతంలో 122గ్రామాలున్నాయని, ఈ ప్రాం తంలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటునే ఉన్నామని కలెక్టర్ వెట్రిసెల్వి కమిటి దృష్టికి తీసుకెళ్లారు.
పర్యటన సాగింది ఇలా..
కమిటి తొలిరోజు శ్రీపర్రు, కలకుర్రు, అటపాక, కొల్లేటికోట, పైడిచింతపాడు, ప్రత్తికోళ్లలంక. గుడివాకలంక, మొండికోడు, చాటపర్రు ప్రాం తాల మీదుగా పర్యటిస్తున్నప్పుడు స్థానికులు స్వాగతం పలికి వినతులను సమర్పించారు. అంతకుముందు ఏలూరు చేరుకున్న కమిటి సభ్యులు చంద్రశేఖర్ గోయల్, డాక్టర్ జేఆర్ భట్, జి.భానుమతి, సునీల్ లిమాయే, ప్రకాశ్‌చంద్రభట్‌తోపాటు అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాముకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్వాగతం పలికారు. కమిటీ వెంట ఎస్పీ కిశోర్, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ అజయ్‌కుమార్‌నాయక్, మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, పశ్చిమ జేసీ రాహుల్ కుమార్‌రెడ్డి, డీఎఫ్‌వోలు శుభం, విజయ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో అచ్యుత్ అంబరీష్ ఉన్నారు.
వినతుల వెల్లువ
పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, మణుగు లూరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. అటపాక పక్షుల కేంద్రంలో కొల్లేరు మ్యాప్‌ను పరిశీలించారు. సరస్సు ఉనికి, ఏయే దేశాల నుంచి పక్షులు వలస వస్తున్నాయి, పర్యాటక వసతులు, తదితర వివరాలను అటవీ శాఖ అధికారులు సీఈసీ కమిటీకి వివరించారు. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెంలో సుమారు 10 వేల మంది కొల్లేటివాసులతో సీఈసీ కమిటీ మమేకమైంది. ప్రధానంగా మంచినీటి చెరువులు, పశువుల చెరువులు, ఇళ్ల స్థలాలు, వాటిని మెరక చేయడం, శ్మశాన వాటికలు, రహదారులపై అన్ని గ్రామాల నుంచి అర్జీల రూపంలో ప్రజలు తమ డిమాండ్లను ఎక్కువగా వినిపించారు. సీపీఎం, సీపీఐ నాయకులు కొల్లేరు సమస్యను పరిష్కరించాలని రాత పూర్వకంగా అర్జీలను కమిటీ సభ్యులకు అందించారు. కొల్లేరు అభయారణ్య పరిధిలో పక్షులకు ఎలాంటి హాని కలిగించబోమని సమావేశానికి హాజరైన ప్రజలతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించారు.
అనంతరం సాధికార కమిటీ సభ్యులు రాత్రి ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరా నికి కమిటీ చేరుకుని వినతులను స్వీకరించారు. దెందులూరు, ఏలూరు, ఉంగుటూ రు ప్రాంతాల రైతులు, కొల్లేరు వాసులు, పర్యావరణవేత్తలు తమ అభిప్రాయాలతో కమిటీకి వినతులను అందించారు. కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ గోయల్‌కు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఆయన కుమార్తె నవ్యశ్రీ కొల్లేరు సమస్యలపై వినతులు సమర్పించారు. కమిటీ బుధవారం ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటిస్తుంది. ఆ తదుపరి కలెక్టరేట్‌లో ప్రత్యేక సమీక్ష సమావేశానికి హాజరు కానుంది.
సమగ్ర నివేదిక ఇస్తాం : చంద్రశేఖర్ గోయల్
కేంద్ర సాధికార కమిటీలో చంద్రశేఖర్ గోయల్ ఒక్కరే తాము ఎందుకు కొల్లేరులో పర్యటించాల్సి వచ్చిందనే విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా వివరించారు. సుప్రీంకోర్టు పరిమితులకు లోబడి కొల్లేరులో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణతోపాటు ప్రజల స్థితిగతులపై రెండు రోజులపాటు పర్యటిస్తా మని, ఈ అంశాలపై నివేదికను ఉన్నత న్యాయస్థానానికి అందిస్తామని ప్రకటించారు. కొల్లేరుపై తగు సూచనలు, వినతులను అందరి నుంచి స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
భూములను ప్రజలకు అందించాలి
కొల్లేరు సరిహద్దుల్లో జిరాయితీ భూములు, డి.ఫామ్ పట్టాలు వున్నాయి. పర్యావరణానికి నష్టం కలగకుండా వాటిని ప్రజలకు అందించి, వారి సమస్యలను తీర్చాల ని కోరుతున్నాం. ఈ ప్రాంత ప్రజలు పర్యావరణానికి నష్టం కలిగించరు. పర్యావరణాన్ని, అటవీ శాఖ చట్టా లను కాపాడుకుంటూనే ప్రజా సమస్యల పరిష్కారా నికి కేంద్ర కమిటీని కొల్లేరుకు తీసుకురావడంతో విజయం సాధించాం.
– కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ
ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం
కొల్లేరు ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుం ది. ప్రజల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువెళతాం. కోర్టులు రెండు వైపులా చూస్తాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంటూరు కుదింపు, జిరా యితీ భూములు ప్రజలకు అందిస్తుందని ఆశిస్తున్నాం.
– కె.రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్
కొల్లేరులో జీవ వైవిధ్యం
కొల్లేరు సరస్సులో జీవవైవిధ్యం ఉంది. పర్యావరణా నికి హాని కలగకుండా పక్షులు, సరస్సు, ప్రజలు అన్ని ఒకేచోట ఉండేలా చూడాలి. కొల్లేరులో జన సంచారం, సరస్సులు అన్ని ఒకేచోట ఉన్నాయి. వీటిని పరిగణన లోకి తీసుకోవడమే గాక సుప్రీంకోర్టు నిబంధనలను పాటిస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం. ప్రజాభిప్రాయంపై నివేదిక తయారుచేసి కమిటీకి, ప్రభుత్వానికి అందజేస్తాం.
– అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనంతరాములు
ప్రజల గొంతును వినిపిస్తాం
కొల్లేరు ప్రజల గొంతును సీఈసీకి వినిపిస్తాం. 122 గ్రామాల్లో మూడు లక్షల మందికిపైగా జీవిస్తున్నారు. వారందరిది ఒకటే నినాదం. పర్యావరణాన్ని కాపాడు కుంటూ ప్రజల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువెళ తాం. ప్రజానుకూల చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాం.
– కలెక్టర్ వెట్రిసెల్వి
కొల్లేటివాసులకు న్యాయం చేయాలి
కొల్లేరులో పుట్టి పెరిగిన ప్రజలందరికి జిరాయితీ, డిఫాం పట్టాలు అందించి కమిటీ న్యాయం చేయాలి. కొల్లేరులో ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఉపాధి కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సమస్యలను కమిటీ స్వయంగా పరిశీలించింది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. కోర్టు కూడా ఇటు పర్యావరణాన్ని, అటు పక్షులతోపాటు ప్రజల జీవితాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.
– చింతమనేని ప్రభాకర్, దెందులూరు ఎమ్మెల్యే
ఉపాధి పనులు చేపట్టాలి
కొల్లేరులో ప్రజలు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. జిరాయితీ, డి.ఫామ్ పట్టాలు అందించి ఆదుకోవాలి. కొల్లేరు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు నిర్వహించాలి. ఈ మేరకు కమిటీ నివేదికలో పొందుపరుస్తుందని ఆశిస్తున్నాం.
– ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ