కొల్లేరు సమస్యలు కోకొల్లలు
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:12 AM
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మంచినీటి సరస్సు కొల్లేరు కాస్త కాలుష్య కాసారం కావడానికి వీల్లేదు. పర్యావరణ పరిరక్షణ దిశగా కాలుష్యాన్ని నియంత్రించాల్సిందే.

దీర్ఘకాలిక సమస్యకు అంతమెప్పుడు?
పక్షులు, పర్యావరణంతో పాటు స్థానికుల జీవనోపాధికి ప్రాధాన్యం ఇవ్వాలి
కాంటూరు కుదింపు కష్టాలు తొలగించాలి
జిరాయితీ, సొసైటీ భూములే కాదు జీవనాధారం ముఖ్యం
కేంద్ర సాధికార కమిటీ రాక
మరోవైపు సుప్రీంకోర్టు దిశా నిర్దేశం
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మంచినీటి సరస్సు కొల్లేరు కాస్త కాలుష్య కాసారం కావడానికి వీల్లేదు. పర్యావరణ పరిరక్షణ దిశగా కాలుష్యాన్ని నియంత్రించాల్సిందే. ఆక్రమణలను తొలగించాల్సిందే. అంతకుమించి కొల్లేరు పరీవాహకంలో పక్షుల అభయారణ్యం పరిరక్షణకు ఎలాంటి అవరోధాలు ఉండరాదు. అన్నింటి కంటే మించి కాంటూరు పరిధిని నిర్దేశించాల్సిందే.
సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశం
దశాబ్దాలుగా కొల్లేరునే నమ్ముకున్న వారి జీవనోపాధికి ఎలాంటి లోటు రానివ్వకూడదు. పక్షులతో పాటు మమ్మల్ని బతకనివ్వండి. తరతరాలుగా ఇక్కడ బతుకీడ్చుతున్న వారు రెక్కాడితే.. డొక్కాడని పేదలే. సొసైటీల పేరుతో ఇప్పటిదాకా కాస్తోకూస్తో బతికాం. జిరాయితీ భూములు విషయంలోనూ చాన్నాళ్లుగా ప్రాధేయపడుతూనే ఉన్నాం. కాంటూరు పరిధిని కుదించి న్యాయం చేయాలని అధికారంలోకి వచ్చిన ప్రతీ ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాం. ఇప్పటికీ అది జరగనేలేదు. కాస్తంత మీరైనా కలగజేసుకోండి..
కొల్లేరు వాసుల ఆక్రందన
కొల్లేరు సమస్యకు మానవీయ పరిష్కారం లభించాల్సిందే. సరస్సును పరిరక్షిస్తూనే స్థానికులకు న్యాయం చేయాలి. జిరాయితీ, డి–పట్టా రైతుల హక్కులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. పర్యావరణంతో పాటు స్థానికుల జీవనావకాశాలు మెరుగుపర్చడం కూడా అంతే ముఖ్యం. 2014–19 మధ్య సుమారు 20 వేల ఎకరాల భూముల విషయమై కొంత మినహాయింపు ఇవ్వాల్సిందేనని అప్పటి ప్రభుత్వం గట్టిగానే కోరింది. కొల్లేరులో కాంటూరు కుదింపు ముఖ్య సమస్య.
అధికారిక సమీక్షలో వాదనలు
కొల్లేరులో నివసిస్తున్న కుటుంబాలకు జీవనోపాధి కల్పన, శాశ్వత ప్రాతిపదికన ఆదుకోవడానికి పక్కా ప్రణాళిక ఉండాలి. నిబంధనలతో పాటు వారందరికి బతికే హక్కు కూడా ఉంది. వారి విషయంలో మానవతా దృక్పథంతో నిర్ణయాలు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం సైతం కొల్లేరు వాసులకు మెరుగైన జీవితం అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. దీనికి తగ్గట్టుగానే సానుకూల దృక్పథంతో కొల్లేరును చూడాలి.
పార్లమెంట్‌లో ఎంపీ మహేశ్ యాదవ్
(ఏలూరు–ఆంధ్రజ్యోతిప్రతినిధి)
దశాబ్దాల తరబడి కొల్లేరు పేరెత్తితే సమస్యలు కొకొల్లలు. ఎవరిని కదిపినా కన్నీటి గాఽథలే. చాన్నాళ్లు కొల్లేరును ఆక్రమించి దోచుకున్న పెద్దలు లేకపోలేదు. ప్రశ్నించి, నిలదీసిన పేదలను వెలివేసిన ఘటనలెన్నో. కొల్లేరు మంచి నీటి సరస్సుగా తిరిగి పునరుద్ధరణ జరగాలని సంవత్సరాల క్రితం సుప్రీం సాధాకార కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. ఆనాడు కొల్లేరు పరిధిలో ఉన్న దాదాపు 56వేల ఎకరాలకు పైగా ఆక్రమణలను ధ్వంసం చేశారు. ఎక్కడా చేపల చెరువు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొల్లేరు ఆపరేషన్ పేరిట దాదాపుగా 120 రోజుల వ్యవధిలో పని పూర్తి చేశారు. ఒక సమస్య తీరినా జీవనాధార సమస్య ఇంకా వెన్నాడుతూనే ఉంది. ప్రత్యేకించి ఎన్నికలు జరిగిన ప్రతీసారీ ఈ సమస్య పరిష్కరించేది తామేనంటూ ఏదో పార్టీ కొల్లేరు వాసుల్ని నమ్మబలుకుతూ ఓట్లను కూడగట్టు కుంది. ఈ లోపే స్థానికంగా సమస్యలు ముదిరి, వివాదాలు తలెత్తి ఆఖరికి ‘వెలి’ వేసేందుకు పెద్దలు వెనుకాడలేదు. ఇక్కడ సామాజికపరమైన సమస్యే కాకుండా, రాజకీయ సమస్య కూడా తోడైంది. ఇలాంటి తరుణంలోనే పర్యావరణ పరిరక్షణ కోరుతూ కొందరు ఏదొక రూపంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ వస్తున్నారు. గతంలో కొల్లేరు ప్రక్షాళనకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణప్రియులు డిమాండ్ మేరకే కొల్లేరు ఆపరేషన్‌కు దారితీసింది.
సాధికార కమిటీపైనే అందరి చూపు
కొల్లేరు పరిస్థితిని అధ్యయనం చేయడానికి మరోమారు కేంద్ర సాధికార కమిటీ రెండురోజుల పాటు కొల్లేరు ప్రాం తంలో పర్యటించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం ఈ బృందం మంగళ, బుధవారాల్లో కొల్లేరులో క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొల్లేరు ప్రాంతంలో ప్రజలెదుర్కొంటున్న కష్టాలపై ఎమ్మెల్యే లు చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఈ నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు సాధికార కమిటీ నేరుగా కొల్లేరులో పర్యటిస్తున్న నేపథ్యంలో స్థానికులంతా తాము ఎదుర్కొంటున్న కష్టాలు, జీవనోపాధిలో ఎదుర వుతున్న ఆటంకాలు, కాంటూరు కుదింపు వ్యవహారం పూ ర్తిగా కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు సమాయత్తం అయ్యారు. జిరాయితీ భూములు ఇప్పటికే దాదాపుగా 22 వేల ఎకరాలకు పైగా ఉన్నట్లు పేర్కొంటూనే కొల్లేరు ప్రాంతంలో పాఠశాలలు, నివాసిత ప్రాంతాలు, తాగునీటి చెరువులు, ఇతరత్రా వాటిని మినహాయించాలన్న డిమాండ్‌ను లేవనె త్తబోతున్నారు. ఇప్పటికే కొంతమంది విద్యావంతులు సాధికార కమిటీకి అర్థమయ్యేలా వినతులు సిద్ధం చేశారు. ఈసారి కమిటీ సమర్పించే నివేదిక అత్యంత కీలకం కావడంతో ఒకింత జాగ్రత్తగా మెలగాలని కూడా కొల్లేరు వాసులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. సాధికార కమిటీ పర్యటన పూర్తి వివరాలు జిల్లా యంత్రాంగం వెల్లడించాల్సి ఉంది.