జూదక్రాంతులు..!
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:13 AM
నూజివీడు నియోజకవర్గం ఏడాది కాలంగా జూదాలకు నిలయంగా మారింది. తెలుగుదేశం–వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పేకాట, కోడి పందేలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నాయి.
మీర్జాపురంలో సంక్రాంతికి భారీ కోడి పందేల బరి
ఒక్కో ముసుగు పందెం రూ.25 లక్షలు అంటూ ప్రచారం
ప్రత్యేక ఆకర్షణగా క్యాసినో ఏర్పాటు చేస్తామని వెల్లడి
ఇప్పటికే జూదాలకు నిలయంగా మారిన నూజివీడు
వెలిసిన పేకాట శిబిరాలు.. లక్షలు పోగొట్టుకుంటున్న జనం
మామిడి పంట సొమ్ము జూదార్పణం.. రైతు ఆత్మహత్య
జూదాలను అణిచివేయాలని మంత్రి కొలుసు ఆదేశం
పెద్దగా లెక్కచేయని పోలీసులు
(నూజివీడు–ఆంధ్రజ్యోతి)
నూజివీడు పేరు చెపితే బాస్కెట్‌బాల్, టెన్నిస్, చెడుగుడు వంటి క్రీడలు గుర్తుకువస్తాయి. ఎంతో మంది క్రీడాకారులు ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో పేరు గడించిన వారు వున్నారు. మరెందరికి ఈ ప్రాంతం ఆటల్లో పేరు తెచ్చి పెట్టింది. అలాంటి నూజివీడు నియోజకవర్గం ఏడాది కాలంగా జూదాలకు నిలయంగా మారింది. తెలుగుదేశం–వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పేకాట, కోడి పందేలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నాయి. ఇందుకు పోలీసుల సహకారం మరువలేనిది. ఈ జూదాలను అరికట్టాలని మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఇటీవల పోలీసులను హెచ్చరించారు. అయినప్పటికి సంప్రదాయ ముసుగులో సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించేం దుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
మీర్జాపురంలో భారీ బరి సిద్ధం
నిన్న మొన్నటి వరకు ఉమ్మడి కృష్ణాలో ఈడుపుగల్లు, అంపా పురం, ఏలూరు జిల్లా కొప్పాక, పశ్చిమ గోదావరి భీమవరం పెద్ద పందేలకు పేరు. ఇప్పుడు వీటి సరసన నూజివీడు మండలం మీర్జాపురాన్ని చేర్చి రాష్ట్రవ్యాప్తంగా జూదరులను ఆహ్వానించాలని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మీర్జాపురం గ్రామ పరిధిలో బిల్లనపల్లి వెళ్లే రహదారిలో పెద్ద బరులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నిర్వాహకులు సంక్రాంతి మూడు రోజులు వివిధ స్థాయిల్లో పందేలు నిర్వహించనున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ముసుగు పందెం రూ.25 లక్షలుగా నిర్ణయించారు. ఇవి రోజుకు 20 చొప్పున వేయనున్నారు. తొమ్మిది లక్షల చొప్పున రోజుకు 20 పందేలు, ఐదు లక్షల చొప్పున రోజుకు 25 పందేలు, రెండు లక్షల చొప్పున పందేలు వేయనున్నారు. ఈ మూడు రోజులపాటు పగలు, రాత్రి తేడా లేకుండా సాగుతూనే ఉంటాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 మంది మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఇతర రాజకీయ ప్రముఖులు వస్తున్నట్లు భారీస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా కేసివోనో కూడా ఉంటుందని చెబుతున్నారు.
నియోజకవర్గంలో పేకాట శిబిరాలు
మంత్రి హెచ్చరికలను ఎవరూ లెక్క చేయడం లేదు. యథేచ్ఛగా పేకాట శిబిరాలు సాగుతున్నాయి. ఆగిరిపల్లి మండ లంలో 2014లో మూతపడిన ఓ క్లబ్ తిరిగి తెరిచారు. ఇక్కడకు ఉమ్మడి కృష్ణాతోపాటు పక్కనే ఉన్న తెలంగాణ నుంచి నిత్యం వందలాది మంది జూదప్రియలు వస్తున్నారు. అలాగే ఇదే మండలంలోని ఈదర, వట్టిగుడిపాడు, నూజివీడు మండలం సుంకొల్లు, పోతిరెడ్డిపల్లి, ముసునూరు మండలం నేలపాటివారి కుంట సూరేపల్లి, బాసవరప్పాడు గ్రామాల్లో ఈ పేకాట శిబిరాలు వెలిశాయి. పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసిం చడం లేదు.
ఎందరికో నష్టం.. లాభం కొందరికే
సాంప్రదాయాల ముసుగులో ప్రారంభం అవుతున్న కోడిపందాలు వాటితోపాటు అనుబంధంగా జరిగే లోపల బయట, గుండాట, మూడు ముక్కలాట, చిన్న బజారు, పెద్ద బజారు, ఎరుపు నలుపు తదితర జూద క్రీడలతో లాభం కొందరికి మరెంతో మందికి నష్టం అనేలా ఈ జూద క్రీడల నిర్వహణ ఉండనుంది. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న జూదాలకు ఎందరో బానిసలై అప్పులపాలయ్యారు. నూజివీడు మండలానికి చెందిన ఓ రైతు మామిడి పంట విక్రయింగా వచ్చిన నగదును పేకాటలో పెట్టి పూర్తిగా పోగొట్టుకుని అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది పైకి కనిపించింది. కనిపిం చని ఘటనలు ఎన్ని ఉన్నాయో..? ఈ జూదాలను పోలీసులు కఠినంగా అణిచివేయాలని ప్రజలు కోరుతున్నారు.