Share News

ఆచంటేశ్వరుడి సన్నిధిలో అఖండ జ్యోతి

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:18 AM

ప్రసిద్ధ ఆచంట రామేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం సాయంత్రం అఖండ జ్యోతి (కర్పూర జ్యోతి) వెలి గించనున్నారు.

ఆచంటేశ్వరుడి సన్నిధిలో అఖండ జ్యోతి
అఖండ జ్యోతికి ఆవు నెయ్యి సమర్పిస్తున్న భక్తులు (ఫైల్‌)

నేడు కార్తీక పౌర్ణమి వెలుగులు.. ఏర్పాట్లు పూర్తి

ఆచంట, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ ఆచంట రామేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం సాయంత్రం అఖండ జ్యోతి (కర్పూర జ్యోతి) వెలి గించనున్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఆచంటేశ్వరాల యంలో అఖండ జ్యోతిని వెలిగించడం ఆనవాయితీ. ముందుగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కృత్తిక నక్షత్ర హోమం, మండపారాధన, పూర్ణాహుతి మహానైవేద్యం, దూపసేవ అనంతరం కర్పూర జ్యోతిని వెలిగిస్తారు.

2 కేజీల దూదితో ఏక ఒత్తి

గడ్డి చుట్టిన దీప స్తంభంపై ఇత్తడి మండిగలో రెండు కేజీల దూదితో చేసిన ఏక ఒత్తి ఉంచుతారు. ఇత్తడి మండిగలో ఆవు నెయ్యి పోసి కర్పూరంతో జ్యోతిని వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన కర్పూర జ్యోతి మహా శివరాత్రి వరకు నిరంత రాయంగా వెలుగుతుంది. కార్తీక మాసం చివరి వరకు వేలాది సంఖ్యలో భక్తులు కర్పూర జ్యోతికి ఆవు నెయ్యి సమర్పించి మొక్కు చెల్లించుకుంటారు. ఎప్పటికప్పుడు ఆవు నెయ్యిని ఇత్తడి గుండిగలోకి తీసి ఉంచుతారు. నెయ్యి నిల్వలు పూర్తయ్యేవరకు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. కార్తీక పౌర్ణమి ఒక్క రోజులోనే సుమారు 50 కేజీల పైగా ఆవు నెయ్యి భక్తులు సమర్పిస్తారు.

150 ఏళ్ల నాటి ఆనవాయితీ

రామేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి నాడు గంధర్వ మహల్‌కు చెందిన గొడవర్తి కుటుంబీకులు కర్పూర జ్యోతిని వెలిగించడం ఆనవాయితీ. సుమారు 150 ఏళ్ల నుంచి గొడవర్తి కుటుంబీకులు జ్యోతిని వెలిగిస్తున్నారు. మహత్తర అఖండ జ్యోతి దేశంలో అరుణాచలం, కాశీ తర్వాత ఆచంట మాత్రమే పౌర్ణమి రోజున వెలిగిస్తారు.

25 వేల మంది భక్తుల రాక!

కర్పూర జ్యోతికి ఆవు నెయ్యి సమర్పించడానికి మొదటి రోజు 25 వేల మంది భక్తులు రావచ్చని ఆలయ అధికారుల అంచనా. భక్తుల రద్దీకి అనుగు ణంగా ఆలయం వద్ద ఏర్పాట్లు చేసినట్లు ఈవో ఆదిమూలం వెంకట సత్యనారాయణ, చైర్మన్‌ నెక్కం టి గజేశ్వరరావు, కమిటీ సభ్యులు తెలిపారు. భక్తు లకు తగిన సౌకర్యాలతో పాటు రామగుండం వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ వెంకట రమణ తెలిపారు.

Updated Date - Nov 05 , 2025 | 12:18 AM